Saturday, October 5, 2024

జెకెలో ఉగ్రవాదానికి శాశ్వత సమాధి కడతాం:అమిత్ షా

- Advertisement -
- Advertisement -

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదం పునరుద్ధరణకు యత్నాలు సాగుతున్నాయని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా సోమవారం ఆరోపించారు. ఉగ్రవాదం తిరిగి తలెత్తుకోలేని విధంగా కేంద్ర పాలిత ప్రాంతంలో ‘సమాధి చేస్తాం’ అని కేంద్ర మంత్రి చెప్పారు. కిష్ట్‌వార్‌లో ఒక బహిరంగ ర్యాలీలో అమిత్ షా ప్రసంగిస్తూ, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సి) కాంగ్రెస్ కూటమి జెకె ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవని అన్నారు. పాద్దర్ నాగ్‌సెని అసెంబ్లీ సెగ్మెంట్‌లో బిజెపి అభ్యర్థి, మాజీ మంత్రి సునీల్ శర్మకు మద్దతుగా ఒక ఎన్నికల ర్యాలీలో అమిత్ షా ప్రసంగిస్తూ, ‘ఉగ్రవాదం తిరిగి తలెత్తుకోలేని స్థాయిలో సమాధి చేస్తాం. ఉగ్రవాదులను విడుదల చేస్తామని నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ మేనిఫెస్టోలు సూచిస్తున్నందున ఉగ్రవాదం పునరుద్ధరణకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది మోడీ ప్రభుత్వం. జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని పునరుద్ధరించే అధికారం ఎవ్వరికీ లేదు’ అని స్పష్టం చేశారు. ‘ఈ ఎన్నికలు రెండు శక్తుల మధ్య జరుగుతున్న పోరు.

ఒక వైపు నేషనల్ కాన్ఫరెన్స్, పిడిపి, మరొక వైపు బిజెపి ఉన్నాయి. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటట్లయితే, 370 అధికరణాన్ని పునరుద్ధరిస్తామని ఎన్‌సి కాంగ్రెస్ చెబుతున్నాయి. దానిని పునరుద్ధరించాలా చెప్పండి. పహాడీలు, గుజ్జర్‌లు. తదితరులకు బిజెపి ఇచ్చిన రిజర్వేషన్లను లాక్కొంటారు. ఆందోళన చెందకండి. కాశ్మీర్‌లో పరిస్థితిని గమనిస్తున్నాను. అబ్దుల్లాల పార్టీ గాని, రాహుల్ పార్టీ గాని జెకెలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోవడం లేదని ధీమాగా ఉండండి’ అని హోమ్ శాఖ మంత్రి అన్నారు. పక్షం రోజుల్లో హోమ్ శాఖ మంత్రి జమ్మూ ప్రాంతాన్ని సందర్శించడం ఇది రెండవ సారి. ఈ నెల 6, 7 తేదీల్లో జమ్మూకు ఆయన వచ్చినప్పుడు జెకె అసెంబ్లీ ఎన్నికల కోసం బిజెపి మేనిఫెస్టోను విడుదల చేసి, కార్యకర్తల సదస్సులో ప్రసంగించారు. బుధవారం తొలి విడత పోలింగ్ జరగనున్న పాద్దర్ నాగ్‌సెనితో సహా 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారానికి గడువు సోమవారంతో ముగిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News