Tuesday, April 30, 2024

‘గోమూత్ర’ రాష్ట్రాలలోనే బిజెపి గెలుపు

- Advertisement -
- Advertisement -

డిఎంకె ఎంపి వివాదాస్పద వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా మంగళవారం డిఎంకె ఎంపి డిఎన్‌వి సెంథిల్ కుమార్ బిజెపిపై చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని సృష్టించాయి. ప్రధానంగా హిందీ మాట్లాడే రాష్ట్రాలలోనే బిజెపికి ఎన్నికల్లో గెలిచే శక్తి ఉందని, వాటిని తాము గోమూత్ర రాష్ట్రాలని అంటామని, దక్షిణాది రాష్ట్రాలలో బిజెపి ప్రవేశించలేదని సెంథిల్ కుమార్ వ్యాఖ్యానించారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి విజయం సాధించిన నేపథ్యంలో సెంథిల్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు.

కాగా..సెంథిల్ కుమార్ వ్యాఖ్యలను ఎండిఎంకె ఎంపి వైకో సమర్థించారు. సెంథిల్ కుమార్ ప్రకటనతో తాను ఏకీభవిస్తున్నానని, ఆయన వ్యాఖ్యల్లో నిజం ఉందని వైకో పేర్కొన్నారు. అయితే బిజెపి మాత్రం డిఎంకె ఎంపి సెంథిల్ వ్యాఖ్యలను తప్పుపట్టింది. బిజెపి ఎంపి అన్నపూర్ణాదేవి స్పందిస్తూ ఆ మూడు రాష్ట్రాల ప్రజలు ప్రధాని నరేంద్ర మోడీపై విశ్వాసంతో బిజెపిని గెలిపించారని అన్నారు. కుత్సిత మనస్తత్వం ఉన్నవారే అటువంటి ప్రకటనలు చేస్తారని, ప్రపంచవ్యాప్తంగా ప్రధాని మోడీకి ఉన్న ఆదరణను చూసి ఓర్వలేక అసూయతో ఇటువంటి ప్రకటనలు చేస్తారని ఆమె విమర్శించారు.

మరో బిజెపి ఎంపి జగన్నాథ్ సర్కార్ కూడా డిఎంకె ఎంపి సెంథిల్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. దేశవ్యాప్తంగా బిజెపిని ప్రజలు ఆదరిస్తున్నారని, ఈ రకమైన వ్యాఖ్యలు చేసేవారికి ఏ విధమైన విషయ పరిజ్ఞానం లేదని ఆయన వ్యాఖ్యానించారు. సెంథిల్ కుమార్‌కు భారతీయ సంస్కృతి పట్ల ఏమాత్రం అవగాహన లేదని కూడా ఆయన విమర్శించారు. ప్రధాని మోడీ కేవలం భారతీయ నాయకుడు మాత్రమే కాదని, ఆయన ప్రపంచ నాయకుడని సర్కార్ కీర్తించారు.

అయితే..ప్రతిపక్ష ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షమైన డిఎంకె ఎంపి వ్యాఖ్యలను అదే కూటమిలోని కాంగ్రెస్ ఎంపి ఒకరు ఖండించడం విశేషం. డిఎంకె ఎంపి సెంథిల్ కుమార్ వ్యాఖ్యలను పార్లమెంటరీ భాషకు విరుద్ధమంటూ కాంగ్రెస్ ఎంపి కార్తి చిదంబరం వ్యాఖ్యానించారు. సెంథిల్ వాడిన పదాలు అత్యంత దురదృష్టకరమని, తాను చేసిన వ్యాఖ్యలపై ఆయన క్షమాపణ చెప్పడంతోపాటు వాటిని ఉపసంహరించుకోవాలని ఎక్స్ వేదికగా కార్తి చిదంబరం సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News