Saturday, July 27, 2024

బెంగళూరులో 68 స్కూళ్లకు బాంబు బెదిరింపులు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కర్నాటక రాజధాని బెంళూరు, దాని చుట్టుపక్కల పదుల సంఖ్యలో పాఠశాలలకు శుక్రవారం బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. గుర్తు తెలియని ఇమెయిల్ అడ్రసునుంచి ఈ బెదిరింపులు వచ్చాయని పోలీసులు తెలిపారు. పాఠశాలల్లోనే బాంబులు పెట్టామని ఆ మెయిళ్లలో బెదిరించడంతో విద్యార్థులు,తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వణికిపోయారు. శుక్రవారం ఉదయం తొలుత ఏడు ప్రైవేటు పాఠశాలకు ఈ బెదిరింపులు వచ్చాయి.ఆ తర్వాత కొద్ది సేపటికే మరికొన్ని స్కూళ్లకు కూడా అదే తరహా బెదిరింపులు వచ్చాయి.మొదట సంఖ్య 15గా ఉండగా, చివరికి 68కి చేరుకుంది. ఈ పాఠశాలల్లో 48 పాఠశాలలు బెంగళూరు నగరంలో ఉండగా, మిగతా స్కూళ్లు బెంగళూరు రూరల్ పరిధిలో ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఇమెయిళ్లు రాగానే స్కూళ్ల అధికారులు వెంటనే పోలీసులను అప్రమత్తం చేశారు. వారు బాంబు డిస్పోజల్ బృందాలు, కుట్రలను ఛేదించే టీమ్‌లతో సంబంధిత స్కూళ్లకు చేరుకుని ఉపాధ్యాయులు, పిల్లలందరినీ బయటికి తీసుకువచ్చారు.

తర్వాత బాంబు స్కాడ్‌లతో తనిఖీఖీలు నిర్వహించారు. కాగా బాంబు బెదిరింపు ఉత్తుత్తి బెదిరింపు కావచ్చన్న ఆనుమానాన్ని వారు వ్యక్తం చేశారు. వైట్‌ఫీల్డ్, కోరెమంగళ,బసవేశ్వర నగర్, యలహంక, సదాశివనగర్ తదితర ప్రాంతాల్లోని పాఠశాలలకు ఈ బెదిరింపులు వచ్చాయి. కాగా ఇమెయిల్ ఎక్కడినుంచి వచ్చిందో లోతుగా దర్యాప్తు చేయాలని తాను పోలీసు అధికారులను ఆదేశించినట్లు కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య చెప్పారు. ముందుజాగ్రత్త చర్యగా పాఠశాలలకు, ఆలయాలకు తగినంత భద్రత కల్పించాల్సిందిగాఆదేశించారు. బెంగళూరు సూళ్లలో బాంబులు పెట్టామని, పిల్లలను, సిబ్బందిని చంపేస్తామని బెదిరిస్తూ గుర్తు తెలియని ఇమెయిల్ ఐడినుంచి మెస్సేజ్ వచ్చిందని రాష్ట్ర హోంమంత్రి జి పరమేశ్వర చెప్పారు. బెదిరింపులు వచ్చిన వాటిలో ఒక స్కూలు ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ నివాసానికి దగ్గర్లో ఉండడంతో ఆయన స్వయంగా అక్కడికి వెళ్లి పరిశీలించారు.ఈ క్రమంలో ఒక పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులకు ఒక అడ్వైజరీ జారీ చేసింది.‘ ఈ రోజు మన పాఠశాల ఒక అనూహ్య పరిస్థితిని ఎదుర్కొంది.గుర్తు తెలియని వర్గాలనుంచి ఒక మెయిల్ వచ్చింది.

విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని తక్షణమే వాళ్లను ఇళ్లకు పంపించాలని నిర్ణయించాం’అని పేర్కొంది. గత ఏడాది కూడా బెంగళూరులోని ఏడు స్కూళ్లకు ఇలాంటి బెదిరింపులే వచ్చాయి.అయితే తర్వాత అవి ఉత్తుత్తి బెదిరింపులని తేలింది. ప్రస్తుత బెదిరింపులపైన కూడా పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. ఇవి కూడా నకిలీ బెదిరింపు అయి ఉండవచ్చని వారు అనుమానిస్తున్నారు. జనం భయపడరాదంటూ నగర పోలీసు కమిషనర్ బి దయానంద విజ్ఞప్తి చేశారు. పోలీసు సోదాల్లో స్కూళ్ల ఆవరణలో అనుమానాస్పద వస్తువులేవీ దొరకలేదని మరో సీనియర్ అధికారి చెప్పారు. బాంబు బెదింపుల విషయం తెలిసే సమయానికే విద్యార్థులు స్కూళ్లకు చేరుకుని ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే తల్లిదండ్రులు తమ పిల్లలను క్షేమంగా ఇళ్లకు తీసుకెళ్లడానికి ఆఫీసులు, ఇళ్లనుంచి స్కూళ్ల వద్దకు పరుగుపరుగున చేరుకున్నారు. తమకు ఈ రోజు పరీక్షలున్నట్లు బాంబు బెదిరింపులు అందుకున్న పలు స్కూళ్ల విద్యార్థులు చెప్పారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో శాంతిభద్రతలు కరువయ్యాయని, అసాంఘిక శక్తులకు పోలీసులంటే భయం లేకపోవడమే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయంటూ ప్రతిపక్ష బిజెపి, జెడి(ఎస్)లు ధ్వజమెత్తాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News