పిల్లల కోసం రాసినట్టుండి, వాళ్ళ తో పాటు పెద్దవాళ్ళను విశేషంగా ఆకట్టుకునే పుస్తకాలు కొన్నుంటాయి. ఆ కోవ కు చెందిన పుస్తకం ‘గ్లో రషెస్’. పదకొండు భాషల్లోకి అనువాదం అయిన ఈ పుస్తకం ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది పాఠకుల చేతుల్లోకి వెళ్ళింది. ప్రసిద్ధ ఇటాలియన్ చిత్రకారుడు సెక్కో మారినెల్లో ఈ పుస్తకానికంటూ ప్రత్యేకంగా గీసిన బొమ్మలు అదనపు ఆకర్షణ. టర్కీలోని మలత్య నగరంలో నివసించే సకుమత్ అనే చిత్రకారుడు పక్క దేశం రాజు గనువాన్ ప్రత్యేకంగా పంపించిన ఆహ్వానాన్ని మన్నించి, ఆయన దగ్గరకు వెళతాడు. ఆయన కొడుకు మదురర్ విచిత్రమైన వ్యాధితో ఇబ్బంది పడుతుంటాడు. దుమ్ము, సూర్యరశ్మికి ఏమాత్రం దగ్గరైనా ప్రాణాలకే ముప్పు వాటిల్లే పరిస్థితి ఆ పిల్లవాడిది.
సూర్య కాంతి నేరుగా చొరబడకుండా ప్రత్యేకమైన భవనాన్ని నిర్మించి, కొడుకును కాపాడుకుంటూ ఉంటాడు రాజుగారు. వైద్యుల అంచనా ప్రకారం మదురర్ ఎక్కువ రోజులు బతికే అవకాశం లేదు. తన కొడుకు చూడలేని బాహ్య ప్రపంచాన్ని వాడికి చిత్రకళ ద్వారా పరిచయం చేసేందుకు సకుమత్‌ను ఆహ్వానిస్తాడు రాజుగారు. భవనం అంతర్భాగం అంతా ప్రకృతి దృశ్యాలతో నింపాలనేది రాజుగారి కోరిక. కథంతా మధ్యవయస్కుడైన సకుమత్, పదకొండేళ్ళ మదురర్ మధ్యలోనే జరుగుతుంది. మదురర్, సకుమత్ మధ్య స్నేహం బలపడేకొద్దీ నవల ఇంకా ఆసక్తికరంగా మారుతుంది. మదురర్ కలలో కనిపించే దృశ్యాలనే, బొమ్మలుగా గోడల మీద అద్భుతంగా చిత్రీకరించడం మొదలుపెడతాడుసకుమత్.
కలకూ, వాస్తవానికీ మధ్య కళ వారధిగా మారుతుంది. ఓ పక్క వ్యాధితో బాధపడుతున్న పిల్లవాడికి కూడా చిత్రకళ మీద ప్రత్యేకమైన ఆసక్తి మొదలౌతుంది. మదురర్, తాను ఊహల్లో చిత్రించుకున్న రాత్రిని వెలుగు నింపే ‘మెరిసే పూలు’ బొమ్మల రూపంలో కావాలంటాడు సకుమత్‌తో. కళా సృజన, జీవితేచ్ఛ, ఎల్లలు లేని స్నేహాల గురించి రాసిన అతి చక్కటి నవలలో ‘స్ట్రాలీస్కో’ (ఇంగ్లీష్‌లో ‘గ్లో రషెస్’ NYRB ప్రచురణ) త్వరలో ఈ పుస్తకం ‘మెరిసే పూలు’గా తెలుగులోకి వస్తోంది. ఈ నవలను అనువదించిన లేయా ఎనెక్కొ సుప్రసిద్ధ ఇటాలియన్ ఇంగ్లీష్ అనువాదకురాలు. అమెరికాలో జన్మించిన ఈమె ఇటలీలోని రోమ్ నగరంలో స్థిరపడ్డారు. ఈమె అనువదించిన నవలల్లో ‘విమెన్ ఎట్ ది హిట్లర్స్ టేబుల్’ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్2024కు నామినేట్ అయిన ‘లాస్ట్ ఆన్ మీ’, ‘గ్లో రషెస్’ పాఠకుల విశేషాదరణకు నోచుకున్నాయి. రాక్ బాండ్లకు కూడా ఈమె కొన్ని పాటలు రాశారు.
పిల్లల, టీన్ ఫిక్షన్ నవలలు రాసే రాబర్టో పియూమినిలో ‘స్ట్రాలీస్కో’ నవలను 1993లో రాసారు. ఈ నవలకు ఇంగ్లీష్ అనువాదం ‘గ్లో రషెస్’. ఆయన ఇటలీలోని మిలాన్ నగరంలో నివాసం ఉంటారు. పూర్తిస్థాయి రచయితగా మారే ముందు రాబర్టో పిల్లల అధ్యాపకుడిగా, నటుడిగా, తోలుబొమ్మల నాటక ప్రదర్శకుడిగా పని చేశారు. పిల్లల కోసం నాటకాలు, నవలలు, గేయాలు, జానపద కథలు రచించారు. గత ముప్పై ఏళ్ళుగా అనేక పునర్ముద్రణలకు నోచుకున్న ఈ పుస్తకం, అత్యుత్తమ పిల్లల ఇటాలియన్ రచయితగా ఆయనకు పేరు తెచ్చింది. ఇప్పటిదాకా ఈ పుస్తకం పదకొండు భాషలలోకి అనువాదం అయ్యింది.
Also Read : 6న ముసాయిదా ఓటర్ల జాబితా
- హర్షణీయం బృందం
- అనువాదకురాలు లేయా ఎనెక్కొ పుస్తక రచయిత రాబర్టో పియూమిని