Sunday, August 24, 2025

అందరి కళ్లు ఆ ఇద్దరిపైనే!

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: ప్రతిష్ఠాత్మకమైన యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ (Grand Slam) టోర్నమెంట్‌కు ఆదివారం తెరలేవనుంది. సీజన్‌లో చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ అయిన యూఎస్ టైటిల్‌పై స్టార్ ఆటగాళ్లు కన్నేశారు. డిఫెండింగ్ ఛాంపియన్ జన్నిక్ సినర్ (ఇటలీ), స్పెయిన్ సంచలనం కార్లొస్ అల్కరాజ్ పురుషుల సింగిల్స్ విభాగంలో ఫేవరెట్‌లుగా బరిలోకి దిగనున్నారు. మహిళల విభాగంలో డిఫెండింగ్ ఛాంపియన్ అరినా సబలెంక (బెలారస్), మాజీ విజేత ఇగా స్వియాటెక్(పోలండ్)లు టైటిల్ ఫేవరెట్‌లుగా కనిపిస్తున్నారు. ఇక యూఎస్ ఓపెన్‌లో ఇప్పటికే మిక్స్‌డ్ డబుల్స్ విభాగం పోటీలు ముగిసాయి. అంతేగాక మహిళలు, పురుషుల విభాగంలో క్వాలిఫయర్ పోటీలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

ఇక మెయిన్ డ్రా పోటీలు ఆదివారం ప్రారంభం కానున్నాయి. ఈ టోర్నీలో పురుషుల సింగిల్స్ విభాగంలో సినర్‌కు, మహిళల సింగిల్స్‌లో అరినా సబలెంకకు టాప్ సీడింగ్ (Top seeding) లభించాయి. పురుషుల సింగిల్స్‌లో అల్కరాజ్‌కు రెండో, అలెగ్జాండర్ జ్వరేవ్ (జర్మనీ)కి మూడో, టెలర్ ఫ్రిట్జ్ (అమెరికా)కు నాలుగో, జాక్ డ్రాపర్‌కు ఐదో సీడ్ దక్కింది. బెన్ షెల్టన్, నొవాక్ జకోవిచ్ (సెర్బియా), అలెక్స్ డి మినార్ (ఆస్ట్రేలియా), కరెన్ కచనోవ్ (రష్యా), లొరెంజొ ముసెట్టి (ఇటలీ) టాప్10 సీడింగ్‌లను దక్కించుకున్నారు. మహిళల విభాగంలో ఇగా స్వియాటెక్‌కు రెండో, కొకొ గాఫ్ (అమెరికా)కు మూడో, జెసికా పెగులాకు నాలుగో, మిరా అండ్రీవాకు ఐదో సీడ్ లభించింది. మాడిసన్ కీస్, జస్మయిన్ పౌలిని, ఎలినా రిబకినా, ఎమ్మా నవ్వారొలు టాప్10 సీడింగ్‌లను సొంతం చేసుకున్నారు. కాగా, పురుషుల విభాగంలో టైటిల్ కోసం సినర్, అల్కరాజ్‌ల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఇద్దరు కూడా పురుషుల టెన్నిస్‌లో ఎదురులేని శక్తులుగా మారారు.

కొంతకాలంగా వీరిద్దరే గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను దక్కించుకుంటున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన మూడు గ్రాండ్‌స్లామ్ ట్రోఫీల్లోనూ వీరిద్దరే ఫైనల్‌కు చేరారు. సినర్ ఈ సీజన్‌లో ఆస్ట్రేలియా ఓపెన్, వింబుల్డన్ ఓపెన్‌లను గెలుచుకున్నాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లోనూ ఫైనల్‌కు చేరుకున్నాడు. కిందటి సీజన్‌లో సినర్ యూఎస్ ఓపెన్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఈసారి కూడా టైటిల్ గెలవాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇక అల్కరాజ్ 2022లో యూఎస్ ఓపెన్ విజేతగా నిలిచాడు. ఇక వింబుల్డన్ ఓపెన్‌లో సినర్ చేతిలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకోవాలని తహతహలాడుతున్నాడు. మరోవైపు మహిళల విభాగంలో ప్రస్తుత ఛాంపియన్ సబలెంక, మాజీ విజేత సియాటెక్‌ల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఇక కొకొ గాఫ్, రిబకినా, నవ్వారొ, పెగులా, అనిసిమోవా, అండ్రీవా తదితరులు కూడా టైటిల్ ఫేవరెట్‌లుగా కనిపిస్తున్నారు. పురుషుల సింగిల్స్‌లో జ్వరేవ్, రూడ్, జకోవిచ్, ఫ్రిట్జ్‌లు టైటిల్ సాధించాలనే పట్టుదలతో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News