Thursday, September 19, 2024

పోలెండ్‌కు చేరుకున్న ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని పెంచే పర్యటనగా అభివర్ణన
పోలెండ్‌లో మోడీ తొలి పర్యటన
45 ఏళ్లలో భారత ప్రధాని తొలి పోలెండ్ సందర్శన
తదుపరి ఉక్రెయిన్‌కు వెళ్లనున్న ప్రధాని మోడీ
వార్సా: ప్రధాని నరేంద్ర మోడీ రెండు దేశాల పర్యటన తొలి ఘట్టంలో బుధవారం పోలెండ్ రాజధాని వార్సా చేరుకున్నారు. ఆయన ఆ తరువాత ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు వెళతారు. కాగా, పోలెండ్‌లో తన తొలి పర్యటన ద్వైపాక్షిక భాగస్వామ్యానికి ఊపు ఇస్తుందని, రెండు దేశాల ప్రజలకు ప్రయోజనకరమని ప్రధాని మోడీ పేర్కొన్నారు. పోలెండ్ అధ్యక్షుడు ఆంద్రెజ్ సెబాస్టియన్ దుదాతో భేటీ అయ్యే ప్రధాని మోడీ పోలెండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్‌తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. పోలెండ్ రాజధానిలో వివిధ కార్యక్రమాల కోసం తాను ఎదురుచూస్తున్నట్లు మోడీ తెలియజేశారు. ‘పోలెండ్‌లో దిగాను. ఇక్కడ వివిధ కార్యక్రమాల కోసం ఎదురుచూస్తున్నా.

ఈ పర్యటన భారత్ పోలెండ్ స్నేహానికి ఊపు ఇస్తుంది, మన దేశాల ప్రజలకు ప్రయోజనకరం అవుతుంది’ అని మోడీ వార్సా మిలిటరీ విమానాశ్రయంలో దిగిన వెంటనే ‘ఎక్స్’ పోస్ట్‌లో పేర్కొన్నారు. పోలెండ్‌లో ప్రధాని మోడీ పర్యటన గడచిన 45 ఏళ్లలో ఒక భారత ప్రధాని తొలి పర్యటన అవుతోంది. ప్రధాని మోడీ హోటల్ చేరుకున్నప్పుడు పోలెండ్‌లోని భారతీయ సమాజం సభ్యులు సాదర స్వాగతం పలికారు. అక్కడ పోలిష్, భారతీయ కళాకారులు గుజరాతీ సంప్రదాయ నృత్యం ప్రదర్శించారు. ’మనం దౌత్య సంబంధాల 70వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సమయంలో నా పోలెండ్ పర్యటన చోటు చేసుకుంటున్నది. మధ్య యూరప్‌లో కీలక ఆర్థిక భాగస్వామి పోలెండ్’ అని మోడీ బుధవారం తాను ఢిల్లీ నుంచి బయలుదేరడానికి ముందు ఒక ప్రకటనలో తెలిపారు. ‘ప్రజాస్వామ్యం, బహుళపక్ష వాదం పట్ల మా పరస్పర నిబద్ధత మా భాగస్వామ్యానికి మరింత బలం చేకూరుస్తుంది.

మా భాగస్వామ్యం పురోగతికి నా మిత్రుడు ప్రధాని డొనాల్డ్ టస్క్, అధ్యక్షుడు ఆంద్రెజ్ దుదాతో సమావేశం కోసం ఎదురుచూస్తున్నా’ అని మోడీ తెలియజేశారు. తన రెండు రోజుల పర్యటనలో పోలిష్ నాయకత్వంతో ప్రధాని మోడీ చర్చలు వివిధ అంశాలపై ఉన్నత స్థాయిలో అభిప్రాయాల మార్పిడికి ఉభయ పక్షాలకు వీలు కల్పిస్తుంది, అది ఒక విధంగా అసలైన ‘ప్రయోజనకర అభిప్రాయాల మార్పిడి’ అని పోలెండ్‌లోని భారత రాయబారి నగ్మా మొహమద్ మల్లిక్ వార్సాలో ‘పిటిఐ’ వీడియోస్‌తో చెప్పారు. మోదీ వార్సా నుంచి కీవ్‌కు వెళతారు. ఉక్రెయిన్ 1991లో స్వతంత్ర దేశమైనప్పటి నుంచి ఆ దేశానికి ఒక భారత ప్రధాని జరపనున్న తొలి పర్యటన అవుతుంది.

‘పోలెండ్ నుంచి ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ ఆహ్వానంపై ఉక్రెయిన్‌ను సందర్శించనున్నాను. ఉక్రెయిన్‌కు ఇది ఒక భారత ప్రధాని తొలి పర్యటన’ అని మోడీ తెలిపారు. ‘ద్వైపాక్షిక సహకారం పటిష్ఠతపై అధ్యక్షుడు జెలెన్‌స్కీతో గత సంభాషణలపై ముందుగు సాగేందుకు, ఉక్రెయిన్ ప్రస్తుత వివాదం శాంతియుత పరిష్కారంపై అభిప్రాయాలు పంచుకునేందుకు అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను’ అని ఆయన తెలిపారు. ‘ఒక మిత్రునిగా, భాగస్వామిగా ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరతలు సత్వరం తిరిగి నెలకొనగలవని ఆశిస్తున్నాం’ అని మోడీ తెలియజేశారు. రెందు దేశాలతో విస్తృత సంబంధాల కొనసాగింపునకు, మున్ముందు సుదృఢమైన, మరింత చైతన్యవంతమైన సంబంధాలకు వేదిక సృష్టికి తన వార్సా, కీవ్ పర్యటన దోహదం చేస్తుందని దృఢంగా నమ్ముతున్నానని మోడీ తెలిపారు.

కాగా, ప్రధాని మోడీ పోలెండ్ నుంచి కీవ్‌కు ‘రైల్ ఫోర్స్ వన్’ రైలులో ప్రయాణిస్తారు. ఇందుకు సుమారు పది గంటలు పడుతుంది. ఆయన తిరుగు ప్రయాణం వ్యవధి కూడా అంతే ఉంటుంది. మాస్కోకు తన అత్యున్నత స్థాయి పర్యటన తరువాత సుమారు ఆరు వారాలకు మోడీ కీవ్ సందర్శిస్తున్నారు. మోడీ మాస్కో పర్యటన యుఎస్ నుంచి, దాని పాశ్చాత్య మిత్ర దేశాలు కొన్నిటి నుంచి విమర్శలకు దారి తీసింది. ఉక్రెయిన్‌లో రష్యా దురాక్రమణను భారత్ ఇంత వరకు ఖండించలేదు. చర్చలు, దౌత్యమార్గం ద్వారా వివాదం పరిష్కారానికి భారత్ పిలుపు ఇస్తున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News