Sunday, October 6, 2024

అబద్ధం చెప్పిన వరుడు….. అయిపోయిన పెళ్లి రద్దన్న వధువు

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: సొంతూరు విషయంలో అబద్ధం చెప్పినందుకు అయిపోయిన పెళ్లిని కూడా రద్దు చేసుకున్నదో యువతి. పెళ్లయిన తర్వాత భర్తతో కలసి అత్తవారింటికి బయల్దేరిన వధువుకు తన అత్తగారికి ఊరు ప్రయాగ్‌రాజ్ కాదని, రాజస్థాన్‌లోని బికనీర్ అని తెలియడంతో తనకు ఈ పెళ్లే వద్దంటూ హైవే పోలీసులకు ఫిర్యాదు చేసి వారి సాయంతో వెనదిరిగి వారణాసిలోని తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ సంఘటన తాజాగా వెలుగుచూసింది.

వారణాసిలో పెళ్లి కార్యక్రమం పూర్తయిన తర్వాత నవ వధువు తన భర్త రవితోపాటు ఇతర వరుడి బంధువులతో కలసి బస్సులో అత్తగారింటికి బయల్దేరింది. ఏడు గంటలపాటు ప్రయాణించినా ప్రయాగ్‌రాజ్ రాకపోవడంతో ఆమెకు అనుమానం వచ్చి మనం ఎక్కడకు వెళుతున్నామని భర్తను ప్రశ్నించింది. రాజస్థాన్‌కు అని భర్త చెప్పడంతో ఆమె అవాక్కైంది. తన తల్లిదండ్రులను వదిలిపెట్టి అంతదూరం రాలేనంటూ కన్నీళ్లు పెట్టుకుంది.

వాహనం పెట్రోల్ కోసం ఒక బంకు వద్ద ఆగడంతో వెంటనే 112 నంబర్‌కు ఫోన్ చేయగా వారణాసి-కాన్పూర్ హైవేలో ఉన్న పోలీసు రెస్పాన్స్ వాహనం అక్కడకు చేరుకుంది. పెళ్లి కొడుకు తమది ప్రయాగ్‌రాజ్ అని చెప్పడంతోనే తాను వివాహం చేసుకున్నానని, రాజస్థాన్ అని చెప్పలేదని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను వారణాసికి పంపించివేయాలని ఆమె పోలీసులను వేడుకుంది. దీంతో ఎసిపి అమర్‌నాథ్ యాదవ్ ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం చెప్పగా వరుడు తన సొంతూరు రాజస్థాన్ అని చెప్పలేదని వధువు తల్లి కూడా చెప్పింది. వెంటనే తన కుమార్తెను వెనక్కు పంపించివేయాలని, ఈ పెళ్లిని తాము రద్దు చేసుకుంటున్నామని ఆమె తల్లి తేల్చి వేయడంతో పోలీసులు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆమెను వారణాసికి పంపించివేశారు. పెళ్లి కుమార్తె లేకుండానే వరుడు ఒంటరిగా తన ఇంటికి పయనమయ్యాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News