Monday, October 14, 2024

సోషల్ మీడియా ద్వారా బిఆర్‌ఎస్ నాయకుల అసత్య ప్రచారాలు

- Advertisement -
- Advertisement -

బిజెపి వాళ్లు సిగ్గు లేకుండా ధర్నా చేస్తున్నారు
ఫాంహౌజ్ పాలనకు కాంగ్రెస్ ప్రభుత్వానికి పొంతన లేదు
భువనగిరి కాంగ్రెస్ ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: బిఆర్‌ఎస్ నాయకులు సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారాలు చేస్తున్నారని, బిజెపి వాళ్లు సిగ్గు లేకుండా ధర్నా చేస్తున్నారని, ఫాంహౌజ్ పాలనకు కాంగ్రెస్ ప్రభుత్వానికి పొంతన లేదని భువనగిరి కాంగ్రెస్ ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. మూసీ ప్రక్షాళనపై గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రతిపక్షాలపై ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఎంపి మాట్లాడుతూ హైదరాబాద్‌లోని చెరువులు, కుంటలు కబ్జాకు గురైతే వాటి మీద హైడ్రా తీసుకుంటున్న యాక్షన్‌ను కెటిఆర్, హారీష్ రావులు, అప్పుడప్పుడు బిజెపి నాయకులు తప్పు బట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణలో 28 లక్షల మంది రైతులకు రుణమాఫీ అయితే వారెవ్వరూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలపలేదన్నారు. కానీ, సాంకేతిక కారణాల వల్ల కొందరికి రుణమాఫీ కాకపోతే బిఆర్‌ఎస్ వాళ్లు వారిని వెతికి పట్టుకొని తమ సోషల్ మీడియాలో అసలు రుణమాఫీ జరగలేదని అబద్దాలు చెప్పిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని విష ప్రచారం

కెసిఆర్ గతంలో హైదరాబాద్‌లో 28 వేల అక్రమ కట్టడాలు ఉన్నాయని మీడియాతో చెప్పారని, పదేళ్లలో వాటిని కూలగొట్టకుండా చోద్యం చూసిన కెటిఆర్, హరీష్‌రావులు ఇప్పుడు సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని విష ప్రచారం చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలో మూసీ కింద వేల ఎకరాలు పంటలు పండుతాయని, కానీ, వాటిని కొనే పరిస్థితి లేదని ఆయన తెలిపారు. మూసీలోని వ్యర్థాల వల్ల అక్కడ పండిన పంటలు, అక్కడ పెంచిన చేపలు ఎవరు కొనరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఉమ్మడి నల్లగొండ జిల్లా మూసీ పరివాహక ప్రాంతాల్లో బిఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేలు పర్యటనలు చేస్తే చెట్లకు కట్టేసి కొట్టాలని మూసీ ప్రాంత రైతులకు సూచిస్తున్నానన్నారు. మూసీ ప్రక్షాళన కోసం వాజ్‌పేయ్ నిధులు కేటాయించారని, ఇప్పుడు బిజెపి వాళ్లు సిగ్గు లేకుండా ధర్నా చేస్తున్నారన్నారు. గత పదేళ్లు బిఆర్‌ఎస్ మూసీ ప్రక్షాళన అని మేనిఫెస్టోలో పెట్టి, దాని కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసి, నిధులు కేటాయించి చిన్న పని కూడా చేయకుండా ఇప్పుడు కెటిఆర్, హరీష్‌రావులు డ్రామాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

మూసీనది ప్రక్షాళనకు డిపిఆర్‌లు కాలేదు

బిఆర్‌ఎస్ నాయకులు రియల్ ఎస్టేట్ పడిపోయిందని మాట్లాడుతున్నారు. కానీ, తప్పుడు ప్రచారాలతో రియల్ ఎస్టేట్ ను పడేస్తుంది బిఆర్‌ఎస్ నాయకులేనని ఆయన విమర్శలు చేశారు. మూసీనది ప్రక్షాళనకు డిపిఆర్‌లు కాలేదని అంటున్నారని, పదేళ్లలో ఏం చేయనిది పది నెలల్లోనే కావాలంటే ఎలా జరుగుతుందని ఎంపి చామల మండిపడ్డారు. ఫాంహౌజ్‌లో పడుకొని పాలన చేసిన కెసిఆర్ ప్రభుత్వానికి, 24 గంటలు పని చేసే కాంగ్రెస్ ప్రభుత్వానికి పోలిక ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News