Saturday, September 23, 2023

ముందస్తు అభ్యర్థులు

- Advertisement -
- Advertisement -

సంపాదకీయం: ఎన్నికలు మూడు మాసాల దూరంలో వుండగానే రాష్ట్ర శాసన సభలోని దాదాపు అన్ని నియోజకవర్గ స్థానాలకు అభ్యర్థులను ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. మొత్తం 119లో 115 స్థానాలకు అభ్యర్థులను వెల్లడించడం ఒక ఎత్తు అయితే, తొమ్మిది మంది మినహా మిగిలిన పార్టీ ఎంఎల్‌ఎలందరికీ టిక్కెట్లు ఇచ్చారు. ఇలా చేయడం బహుశా దేశంలో ఇదే మొదటిసారి. ఇందులో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆంతర్యం ఏమిటి? ఇది దుస్సాహసమా, చెక్కుచెదరని ఆత్మవిశ్వాసానికి నిదర్శనమా అనే చర్చకు సహజంగానే తెరలేచింది. నాయకత్వ సామర్థం గల వారు గాలిలో మేడలు కట్టరు. సరైన పునాదుల మీదనే భవన నిర్మాణం చేస్తారు. వరుసగా రెండు పదవీ కాలాల పాటు రాష్ట్రాన్ని పాలించిన కెసిఆర్‌కు వ్యతిరేక ఓటు భయం ఏ కోశానా లేదని సిట్టింగ్ ఎంఎల్‌ఎలు దాదాపు అందరికీ టిక్కెట్లు ఇవ్వడంలో నిరూపణ అవుతున్నది.

పదేళ్ళ నిర్విరామ పాలనలో ఎన్ని సాఫల్యాలు వున్నప్పటికీ కొన్నైనా వైఫల్యాలు వుండడానికే ఆస్కారం వున్నది. వాటి బేరీజును నిర్దుష్టంగా వేసుకోగల నాయకుడే ఇలా చేయగలడు. సిట్టింగ్ ఎంఎల్‌ఎలపై ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా తన సొంత నిష్పాక్షిక పరిశీలన అనే కంటితో జల్లెడ పట్టి వారి నిగ్గు తేల్చుకొన్న తర్వాతనే వారిని తిరిగి సమరసీమలో నిలబెట్టారని అనుకోవాలి. గెలుపు అవకాశాలు బొత్తిగా లేని కొద్ది మందిని మాత్రం విడిచిపెట్టారని భావించాలి. అభ్యర్థులెవరనే దానితో నిమిత్తం లేకుండా తనను, తన పాలనను చూసి ప్రజలు గెలిపిస్తారనే ధీమా కూడా కారణం కావచ్చు. అయినా సాహసమే. అయితే కొత్త దారి తొక్కడం ద్వారానే సమర్థత గల నాయకులుగా నిరూపించుకోగలరు. నలుగురు నడిచిన బాటలో మొలకలు పుట్టవు. కెసిఆర్ తీసుకొన్న ఈ నిర్ణయాలు ఆయన నాయకత్వ సామర్థాన్ని కొత్త ఎత్తులకు తీసుకు పోతాయో లేదో చూడాలి.

నామినేషన్ దాఖలు గడువు ముగిసిపోవస్తున్నా అభ్యర్థులను నిర్ణయించుకోలేక ముందు జాగ్రత్త కోసం డమ్మీల చేత నామినేషన్ వేయించిన సందర్భాలు గతంలో చాలా చూశాము. గెలుపు మీద గట్టి నమ్మకం లేని రాజకీయ పార్టీల నాయకులు మాత్రమే అటువంటి సందిగ్ధావస్థకు లోనవుతారు. మరి కెసిఆర్ ధైర్యానికి కారణమేమిటి? కేంద్ర పాలకుల దుర్విధానాలను, దార్శనికత లేనితనాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్ని వేదికల మీద ఎంతగా తూర్పారబట్టారో, మరెంతగా చీల్చిచెండాడారో ప్రపంచానికి తెలిసిందే. సాగు నీరు తదితర రంగాల్లో ప్రధాని మోడీ ప్రభుత్వ వైఫల్యాలు ఎంతటి ఘోరమైనవో గణాంకాలు సహా దేశ ప్రజల ఎదుట పరిచి వుంచిన సందర్భాలు విదితమే. ఏమేమి చేస్తే దేశాన్ని సునాయాసంగా ప్రగతి పథంలో పరిగెత్తించవచ్చునో తన సొంత దృక్కోణం నుంచి ఆయన వివరించి చెప్పారు. అనేక విధాలుగా కేంద్రాన్ని సవాలు చేసిన ముఖ్యమంత్రి పాలనలోని రాష్ట్రానికి అదే కేంద్రం నుంచి వచ్చిన అవార్డులు కోకొల్లలు.

మిషన్ భగీరథ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ మంచి నీటిని సరఫరా చేస్తున్నందుకు దేశంలోనే తెలంగాణకు కేంద్ర ప్రభుత్వ మొదటి బహుమతి లభించింది. కేంద్రం నెలకొల్పిన డిజిటల్ ఇండియా అవార్డు 2022 ను మొదటిసారే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా గత జనవరిలో రాష్ట్రం స్వీకరించింది. 202122కు గాను 13 జాతీయ పంచాయతీ అవార్డులను తెలంగాణ దక్కించుకొన్నది. ఇంకా ఆరోగ్యాది రంగాల్లో ఎన్నో పురస్కారాలు పొందింది. సంక్షేమ రంగంలో కల్యాణ లక్ష్మి, షాదీముబారక్, కెసిఆర్ కిట్స్ వంటివి ముందున్నాయి. ఆర్థిక రంగంలో చూసుకొంటే రాష్ట్ర తలసరి స్థూల దేశీయోత్పత్తి (జిఎస్‌డిపి) లో 201718 సంవత్సరానికి పొరుగునున్న ఆంధ్రప్రదేశ్‌ను, జాతీయ రాజధాని సగటును తెలంగాణ మించిపోయింది. అలాగే మానవాభివృద్ధి సూచీలలోనూ ఆంధ్రప్రదేశ్‌ను, జాతీయ సగటును అధిగమించింది.

అయితే ఈ సూచీల ఆధారంగానే బిఆర్‌ఎస్ దిగ్విజయాన్ని సాధించగలదని గట్టిగా అనుకోలేము. ఈసారి కాంగ్రెస్, బిజెపిలు గట్టి పోటీ ఇవ్వడానికి శాయశక్తులా శ్రమిస్తున్నాయి. కర్నాటక విజయం తర్వాత కాంగ్రెస్ వెయ్యి ఏనుగుల బలం పుంజుకొన్నది. బిజెపి డబులింజిన్ విన్యాసాలు సరేసరి. అయినా వీసమెత్తు వెరపు లేకుండా మూడు మాసాల ముందే ఇంతమంది అభ్యర్థులను, అందులోనూ సిట్టింగ్ ఎంఎల్‌ఎలను మళ్ళీ బరిలో దింపడం మామూలు విషయం కానేకాదు. ఇలా చేయడం ద్వారా ఇంకొకరికి సాధ్యం కాని రీతిలో శత్రుభీకరంగా కెసిఆర్ పాంచజన్యం పూరించారనే అభిప్రాయం కూడా వినవస్తున్నది.

ఆయన తీసుకొన్న ఈ నిర్ణయాల ముందు ప్రతిపక్షం కళ్ళు తేలవేస్తుందా, రెట్టింపు చొరవతో, ఉత్సాహంతో బిఆర్‌ఎస్‌కు దీటైన పోటీ ఇవ్వగలుగుతుందా అనే దానిని వేచి చూడాల్సిందే. మొత్తానికి ఇంత ముందుగా అభ్యర్థులను ప్రకటించడం ద్వారా, సిట్టింగ్‌ల మీద విశ్వాసం వుంచడం ద్వారా కెసిఆర్ అనితరమైన చొరవను ప్రదర్శించారు. అంతేకాదు 95 నుంచి 105 స్థానాల్లో గెలుస్తామని చెప్పుకొని ప్రతిపక్షానికి గట్టి సవాలు విసిరారు. పులితో పోరాడి విజయం సాధించగలిగినవాడే కొత్త చరిత్రను లిఖిస్తాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News