మన తెలంగాణ/హైదరాబాద్ : కాందీశీకుల భూమిపై ఒక ప్రైవేటు సంస్థతో పాటు మరికొందరు అధికారులు కన్నేశారు. ఈ నేపథ్యంలోనే సుమారుగా రూ. 4వేల కోట్ల పైచిలుకు విలువచేసే ప్రభుత్వ భూమికి తప్పుడు పత్రాలను సృ ష్టించి అక్కడ హైరైజ్ బిల్డింగ్‌ను నిర్మిస్తున్నారు. ఈనిర్మాణాలకు సంబంధించిన అనుమతులను 2021లో అప్పటి హెచ్‌ఎండిఏ కమిషనర్ అరవింద్‌కుమార్, అప్పటి డైరెక్టర్ శివ బాలకృష్ణలు ఇవ్వడంతో దీనిపై లోకాయుక్తలో ఓ హైకోర్టు న్యాయవాది ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన లోకాయుక్త అధికారులపై కేసు నమోదు చేసినట్టుగా తెలిసింది. ఈ ఫిర్యాదుపై లోకాయుక్త రెండు, మూడు రోజుల్లో విచారణ చేపట్టనున్నట్టుగా సమాచారం. ఇక, దీనికి సం బంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే…. పుప్పాలగూడ పరిధిలోని (పాత రాజేంద్రనగర్, గండిపేట్ మండలం,
రంగారెడ్డి జిల్లాలోని) 277, 278, 280, 281 సర్వే నెంబర్‌లలో సుమారు గా 40 ఎకరాల పైచిలుకు కాందీశీకుల భూమి ఉంది. ఈ భూములకు సంబంధించి ఎలాంటి క్రయ, విక్రయాలు చేపట్టరాదని ప్రభుత్వం 2005తో పాటు 2021లో ఓ సర్కులర్‌ను సై తం జారీ చేసింది. అయితే, 1964 సంవత్సరం లో జీవిత్‌రామ్ అనే వ్యక్తి అప్పటి ప్రభుత్వం నుంచి ఈ నాలుగు 277, 278, 280, 281 స ర్వే నెంబర్‌లలో ఉన్న కాందీశీకుల భూమిని కొ నుగోలు చేశారని, ఆయన నుంచి 2006లో ఒక సొసైటీ కొనుగోలు చేసిందని, ఆ సొసైటీ నుంచి వేరే వ్యక్తులు 278 సర్వే నెంబర్‌లోని 11ఎకరాల భూమి నుంచి 6 ఎకరాలను కొనుగోలు చేశామని తప్పుడు పత్రాలను సృష్టించారని, ఈ నేపథ్యంలోనే వారు డిఎస్‌ఆర్‌ఎస్‌ఎస్‌ఐ అనే సంస్థతో డెవలప్‌మెంట్ అగ్రిమెంట్ చేసుకున్నారని లోకాయుక్తలో చేసిన ఫిర్యాదులో హైకోర్టు న్యాయవాది పేర్కొన్నారు.
2022లో హెచ్‌ఎండిఏకు డిఎస్‌ఆర్‌ఎస్‌ఎస్‌ఐ సంస్థ మార్టిగేజ్
ఈ అగ్రిమెంట్ ప్రకారం డిఎస్‌ఆర్‌ఎస్‌ఎస్‌ఐ అనే సంస్థ ఈ సర్వేనెంబర్‌లో బహుళ అంతస్థుల భవనాన్ని కట్టడానికి 2021లో హెచ్‌ఎండిఏకు అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే అప్పటి హెచ్‌ఎండిఏ కమిషనర్ అరవింద్‌కుమార్, డైరెక్టర్ శివ బాలకృష్ణలు పూర్తిగా డాక్యుమెంట్‌లను పరీక్షించకుండానే వాటికి అనుమతులు ఇచ్చారని, అసలు ప్రభుత్వ భూమిని ప్రభుత్వం 2021లో సర్యులర్ జారీ చేసినా ఎలా అనుమతులు ఇచ్చారన్న దానిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీంతోపాటు 2022లో హెచ్‌ఎండిఏకు డిఎస్‌ఆర్‌ఎస్‌ఎస్‌ఐ అనే సంస్థ మార్టిగేజ్ సైతం చేయడం విశేషం. అయితే, హెచ్‌ఎండిఏ ఇచ్చిన అనుమతి నేపథ్యంలో 278 సర్వేనెంబర్‌లోని 6 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఇప్పటికే డిఎస్‌ఆర్‌ఎస్‌ఎస్‌ఐ సంస్థ నిర్మాణాలను ప్రారంభించడంతో పాటు మిగతా సర్వే నెంబర్‌లోని 277, 280, 281లలో ఉన్న మిగతా 30 ఎకరాల పైచిలుకు భూమిలో సైతం ఈ సంస్థ నిర్మాణాలు చేపట్టిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
46 అంతస్థులు….2 బ్లాకుల నిర్మాణం
ప్రస్తుతం డిఎస్‌ఆర్‌ఎస్‌ఎస్‌ఐ అనే సంస్థ ఒక బ్లాక్‌లో 46 అంతస్థులు, మరో బ్లాక్‌లో 39 అంతస్థుల్లో నిర్మాణం చేపట్టింది. అందులో 2 టవర్‌లు (ఏ,బిల బ్లాక్‌ల పేరుతో) ఒక క్లబ్‌హౌజ్, 9 అప్పర్ ప్లోర్‌లు, 4 స్టిల్ట్ నిర్మాణాలు, 2 సెల్లార్‌లను నిర్మిస్తోంది. అయితే, ఈ కాందీశీకుల భూమి అన్యాక్రాంతంపై హెచ్‌ఎండిఏను వివరాలు కోరగా ఈ నిర్మాణదారుడు సాంక్షన్ ప్లాన్ సబ్‌మిట్ చేయలేదని పేర్కొనడం విశేషం. ఇప్పటికే డిఎస్‌ఆర్‌ఎస్‌ఎస్‌ఐ సంస్థ ఈ నిర్మాణం కోసం సుమారుగా రూ.150 కోట్ల రుణాన్ని బ్యాంకుల నుంచి తీసుకున్నట్టుగా తెలిసింది. అయితే ఈ సంస్థ నిర్మాణం కోసం హెచ్‌ఎండిఏకు సుమారుగా రూ.2 కోట్ల 72 లక్షల 28 వేల 810లను డెవలప్‌మెంట్ చార్జీల రూపంలో చెల్లించగా, మిగతా ఫీజుల రూపంలో రూ.32 లక్షల 37వేల 304 రూపాయలను చెల్లించింది. అయితే, ఈ నాలుగు సర్వేనెంబర్‌లలో కలిపి 40 ఎకరాల పైచిలుకు భూమి ఉండగా మార్కెట్‌లో దాని ధర సుమారుగా రూ.4వేల కోట్ల పైచిలుకు ఉంటుందని తెలిసింది.
నిర్మాణాలను వెంటనే ఆపాలి, అధికారులను అరెస్టు చేయాలి
హైకోర్టు న్యాయవాది, రామారావు ఇమ్మాన్యూయేల్, లోకయుక్త
నాలుగు సర్వేనెంబర్‌లలో (277, 278, 280, 281) జరిగే నిర్మాణంలో భారీగా అవినీతి జరిగింది. అసలు ఇది ప్రభుత్వ భూమి, 2005తో పాటు 2021లో ఇది కాందీశీలకు భూమి అని ఇందులో ఎలాంటి క్రయ, విక్రయాలు జరపరాదని ప్రభుత్వం ఓ సర్కులర్‌ను సైతం జారీ చేసింది. ఈ సర్వేనెంబర్‌లలో ఉన్న ప్రభుత్వ భూమిలో నిర్మాణాలకు ఎందుకు అనుమతి ఇచ్చారో తేలాలి. డిఎస్‌ఆర్‌ఎస్‌ఎస్‌ఐ సంస్థతో ఒప్పందం చేసుకున్న వారు డిఎస్‌ఆర్‌ఎస్‌ఎస్‌ఐ యాజమాన్యాన్ని, ఈ నిర్మాణానికి అనుమతి ఇచ్చిన సంబంధిత అధికారులను వెంటనే అరెస్టు చేయడంతో ఈ నిర్మాణాలను ఆపాలి.