Thursday, May 9, 2024

ఇండియా కీలకమే..మరక సంగతి తేలాలి

- Advertisement -
- Advertisement -

టొరంటో : భారతదేశంతో సంబంధాలు కెనడాకు చాలా కీలకమైనవే అని, అయితే భారత్‌పై ఆరోపణలపై దర్యాప్తు జరగాల్సిందేనని కెనడా రక్షణ మంత్రి బిల్ బ్లెయిర్ స్పష్టం చేశారు. కెనడాలో ఖలీస్థానీ ఉగ్రవాది నిజ్జార్‌ను భారతీయ ఏజెంట్లు చంపివేశారని ఇటీవల కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలు ఇరు దేశాల మధ్య చిచ్చుకు దారితీశాయి. ఈ దశలోనే రక్షణ మంత్రి బ్లెయిర్ స్పందించారు. భారతదేశంతో ఉన్న సంబంధ బాంధవ్యాల కోణంలో చూస్తే ఇప్పుడు అత్యంత తీవ్రస్థాయి సవాలు ఏర్పడింది. ఇక్కడ జరిగిన హత్య సంబంధిత నిజానిజాల నిగ్గు తేలాల్సి ఉందని ఆయన పేర్కొన్నట్లు గ్లోబల్ న్యూస్ పేర్కొంది. భారతదేశంతో పలు రకాల సంబంధాలను కెనడా ప్రధానాంశంగానే భావిస్తుంది. అయితే ఇప్పుడు వెలువడ్డ విషయం తమ దేశ ప్రాదేశిక సమగ్రతకు సంబంధించినదని, ఇతరుల చొరబాటుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నట్లుగా వ్యవహరించడం జరిగినట్లు అయితే అది తీవ్రస్థాయి విషయం అవుతుందని రక్షణ మంత్రి స్పష్టం చేశారు.

అత్యంత మిత్రదేశంగా ఉన్న భారత్ విషయంలో ఇప్పుడు తీవ్రస్థాయి ఆరోపణలు వెలువడ్డాయి. ఈ ఆరోపణలు రుజువు అయితే ఇది గణనీయ పరిణామాలకే దారితీస్తుందని , కెనడా ఎట్టి పరిస్థితుల్లోనూ తమ దేశ సర్వసత్తాకత విషయంలో రాజీపడదని స్పష్టం చేశారు. కెనడా ప్రధాని ట్రూడో చేసిన ఆరోపణలను భారతదేశం తిప్పికొట్టింది. కెనడాలో గ్యాంగ్‌వార్ జరిగిందని, దీనిని తమకు ఆపాదించడం అనుచితం అని తెలిపింది. క్రమేపీ ఇది అంతర్జాతీయ విషయంగా రూపుదిద్దుకునే పరిస్థితి ఏర్పడింది. అమెరికా భద్రతా సంస్థ పెంటగాన్ మాజీ అధికారి ఒక్కరు పూర్తి స్థాయిలో భారతదేశాన్ని సమర్థించారు. కెనడా ప్రధాని అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే భారతదేశంపై ఆరోపణలకు దిగాడని విమర్శించారు. అమెరికా ఎప్పుడూ ఇండియా వైపే మొగ్గు చూపాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కాగా ఆ తరువాత అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ భారతదేశం సీమాంతర చర్యకు పాల్పడిందని పేర్కొన్నారు. అమెరికాకు చెందిన సీనియర్ దౌత్యవేత్త డేవిడ్ కోహెన్ తమ స్పందనలో ఉగ్రవాది హత్యకు సంబంధించి కెనడా ప్రధాని చేసిన ప్రకటన సముచితమైనదే అనే అభిప్రాయం వ్యక్తపర్చారు. ఐదుదేశాల నిఘా సంస్థల నుంచి అందిన సమాచారం మేరకే జస్టిన్ ట్రూడో దేశ పార్లమెంట్‌లో దీనిపై ఆరోపణలకు దిగి ఉంటారని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News