Saturday, April 20, 2024

మంచి ఆహారమే కేన్సర్‌కి ఆన్సర్

- Advertisement -
- Advertisement -

కేన్సర్ అంటే అందరికీ భయమే. ఈ జబ్బు గురించి అనేక సందేహాలు, అపోహలు..కేన్సర్ ఎలా వస్తుంది? ఎందుకు వస్తుంది? ఎలా వ్యాపిస్తుంది? దానివల్ల మనకు నష్టమేంటి? కేన్సర్ వస్తే చావు తప్పదా? కుటుంబంలో ఒకరికి వస్తే మిగతావారికీ వస్తుందా? ఎందుకొస్తుంది? ఎవరికో వచ్చిందట మనక్కూడా వస్తుందా? ఎలాంటి ఆహారం తింటే కేన్సర్ రాదు? ఏమేం తినకూడదు? …ఇలాంటి భయాలు చాలా మందికి వస్తుంటాయి. కేన్సర్ గురించి వాస్తవాలు తెలుసుకుంటే సగం భయాలు పోతాయంటున్నారు 28 సంవత్సరాలుగా అనుభవం ఉన్న డాక్టర్ జి. సూర్యనారాయణ రాజు (సర్జికల్ ఆంకాలజీ& డైరెక్టర్). ప్రస్తుతం అశ్విన్స్ స్పెషాలిటీ హాస్పిటల్స్‌లో వీరు వైద్యసేవలందిస్తున్నారు. కేన్సర్‌కు సంబంధించిన సందేహాలను ‘దునియా’కు వివరించారు.

కేన్సర్ అంటువ్యాధి కాదు. కేన్సర్ అనేది శరీరంలో వారసత్వంగా ఉండే మార్పులను బట్టి వచ్చే వ్యాధి తప్ప ఒకరి నుంచి మరొకరికి వచ్చేది కాదు. తల్లిదండ్రుల నుంచి పిల్లలకు అరుదుగా వచ్చే ఒకరకమైన వ్యాధి. వందమంది కేన్సర్ పేషెంట్లను తీసుకుంటే ఐదు నుంచి పదిమంది వరకు వారసత్వంగా కుటుంబంలో తల్లిదండ్రులు, తాతలు, అమ్మమ్మలు, నానమ్మల నుంచి పిల్లలకు వస్తుంది. ఇంట్లో ఉండేవారికి కానీ, ఒకే ప్రాంతంలో ఉండేవారికి కానీ, కలిసి జీవించేవారికికానీ, భార్య నుంచి భర్తకి, భర్త నుంచి భార్యకుగానీ, తల్లిదండ్రుల నుంచి పిల్లలకి, ఒకరికి వచ్చింది కాబట్టి ఇంకొకరికి పాకుతుందనేది అపోహలే.
శరీరంలో కేన్సర్ ఎలా ప్రారంభమౌతుంది? ఎవరికి వస్తుంది? అంటే ఎవరైతే శరీరంలో ఉండే జీన్స్ బలహీనంగా ఉంటాయో వారికొస్తుంది.

జీన్స్ అంటే ఒక్కొక్క మొక్క, ఒక్కొక్క జంతువు, ఒక్కొక్క మనిషి కూడా ఒక్కో ప్రత్యేకమైన కేరక్టర్స్‌తో పుడతాయి. వాటితోటే మళ్లీ పిల్లలు పుడతారు. వాటితోటే మనం చనిపోతాం. ప్రతి జీవిలో ఈ కేరక్టర్స్ ఇలా ఉండాలి అని నిర్దేశించేది జీన్స్. ప్రతి జీన్‌కి కూడా ప్రత్యేకమైన రసాయనిక నిర్మాణం ఉంటుంది. వీటిలో కొన్ని రకాలైన సీక్రెట్ కోడ్స్‌లాగా కొంత సమాచారం దాగి ఉంటుంది. ఆ నిర్మాణాన్ని బట్టి కుటుంబంలోని వ్యక్తిలో కొన్ని గుణాలు ఏర్పడతాయి. మనిషి ఎత్తు ఎంతుండాలి, బరువు ఎంతుండాలి, రంగు ఎలా ఉండాలి, మాట ఎలా ఉండాలి, జీర్ణవ్యవస్థ ఎలా ఉండాలి, ఏ అవయవం ఏం పనిచేయాలన్నది అనే సీక్రెట్ కోడ్ లాంగ్వేజ్ అంతా కూడా జీన్స్ లోపల భద్రపరచి ఉంటుంది. ఎప్పుడైతే ఆ జీన్స్‌లో ఉండే రసాయనిక నిర్మాణం దెబ్బతింటుందో సమస్య మొదలవుతుంది.

Cancer

అసలీ సమస్య ఎందుకొస్తుందంటే … వాతావారణంలోవచ్చే మార్పులకు, అందులోని రసాయనాలకు మనశరీరంలో అనేక మార్పులు జరుగుతుంటాయి. అవి శరీరంలోంచి కణాల్లోకి చేరతాయి. అక్కడి నుంచి కణజాల కణాల్లో ఉండే స్వతంత్ర కణాల్లోకి పాకుతాయి. అంటే కణం నుంచి ఇంచుమించు జీన్స్ న్యూక్లియర్స్‌లో ఉండే జీన్స్‌కి పాకుతుంది. దీంతో జీన్స్ నిర్మాణం మారిపోతుంది. సహజంగా ఉండాల్సిన కోడ్ లాంగ్వేజ్ అన్‌కోడ్ అవుతుంది. ఉదాహరణకు కంప్యూటర్‌కి, మొబైల్ ఫోన్‌కి వైరస్ పట్టింది అనుకుంటాం కదా..అలాగన్నమాట. శరీరానికి కూడా అంతే.

ఎప్పుడైతే ఆ జెనెటిక్ స్ట్రక్చర్‌లో మిటేషన్ అంటే మార్పులు, డ్యామేజ్ జరిగిందో ఆ కణం చేయాల్సిన పని, పర్టిక్యులర్ టిష్యూ గానీ అవయవం గానీ చేయాల్సిన పనిని అది మర్చిపోయి పక్కపనులు చేస్తుంది. పక్కపనులు అంటే నిర్ణీతమైన సమయంలో పుట్టి నిర్ణీత సమయంలో చనిపోవాల్సిన వాటికి ఓ లాంగ్వేజ్ ఇస్తుంది. ప్రతి కణానికి కూడా ప్రత్యేకమైన పని, సమయం ఉంటుంది. 24 గంటలు బతకాల్సిన కణాలు కొన్ని, 7 రోజులు బతకాల్సిన కణాలు కొన్ని, కొన్ని సంవత్సరాలు బతకాల్సిన కణాలు కొన్ని మన శరీరంలో ఉంటాయి. ఎప్పుడైతే ఆ కణం దాని కోడ్ లాంగ్వేజ్ నుంచి బయటపడిందో…. ఒకరోజు చనిపోవాల్సిన కణాలు చనిపోవు. అవి మల్టిపుల్ అవుతుంటాయి. ఒకటికి రెండు, రెండికి నాలుగు అలా పెరుగుతూ ఉంటాయి. శరీరానికి అవసరం లేకుండా, శరీరానికి అవసరానికి మించి కణ ఉత్పత్తి ఎక్కువ అవుతూ, ఒక పర్టిక్యులర్ టిష్యూ అనవసరంగా శరీరంలో పెరుగుతుంది. పెరిగింది మామూలుగా ఉండకుండా పక్క కణాలను నాశనం చేస్తుంది. అది అవసరంలేని పనులు చేయడం, అవసరమైన పనులు చేయకపోవడం వల్ల శరీరం ఒక ప్రత్యేకమైన బలహీనతను సంక్రమించుకుని కావలసిన పనులు చేసుకోలేక నీరస పడుతుంది.

మనం తినే ఆహారమంతా ఈ అనవసరంగా పుట్టిన కణాలు, కణ సమృద్ధిలో ఒక అనవసరమైన టిష్యూ కణితి రూపంలో ఏర్పడుతుంది. మనం తినవలసిన మన శరీరానికి, మిగిలిన అవయవాలకు, మెదడుకి, గుండెకి , కాలేయానికి, మూత్రపిండాలకు కావాల్సిన ఆహారాన్నంతటినీ అనవసరమైన టిష్యూలు తినేయడం వల్ల మనిషి బలహీనుడవుతాడు.
ఈ కేన్సర్ కణాలు పుట్టిన చోట ఉండకుండా రక్తం ద్వారా గానీ, లిన్‌ఫ్లాటిక్ గ్లాండ్స్ వల్ల గానీ, చుట్టుపక్కల టిష్యూల ద్వారా గానీ, ఉండే కేవిటీస్ అంటే థొరాక్స్‌లో గానీ ఎబ్డామల్‌లో గానీ ఒక అవయవాన్నించి మరో అవయవానికి వ్యాపించి దేహాన్ని మొత్తం బలహీనం చేసి మనిషి చనిపోయేటట్టు చేస్తుంది. అడ్వాన్స్‌డ్ ట్రీట్‌మెంట్ చేయగలిగితే రోగిని రక్షించగలుగుతాం.

Food role in cancer preventionFood role in cancer prevention

కేన్సర్ వ్యాధి పట్ల సర్వత్రా భయం నెలకొని ఉంది. ఇందుకు కారణం ఆ వ్యాధి గురించిన అవగాహన లేకపోవడమే. ఆరోగ్యకరమైన జీవనశైలి అలవరుచుకోగలిగితే కేన్సర్ నుంచి రక్షణ పొందడం అసాధ్యమేమీ కాదు. అపోహలు వదిలి వ్యాధి ముదరక ముందే గుర్తించి చికిత్స తీసుకుంటే కేన్సర్ నుంచి విముక్తి పొందడం తేలికే. కేన్సర్ మరణాల్లో 30 శాతం మరణాలను వ్యాధిని తొలి దశలోనే గుర్తించగలిగితే నియంత్రించవచ్చు.

ప్రపంచ వ్యాప్తంగా ఏటా సుమారు 1.41 కోట్ల మంది కేన్సర్ మహమ్మారి బారిన పడుతున్నారు. వారిలో 82 లక్షల మంది మృత్యువాత పడుతున్నారు. జీవనశైలిలో వస్తున్న మార్పులతో పాటు తీసుకునే ఆహారం కూడా కేన్సర్ కారకాలుగా పలు పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నిరంతరం నిర్వహిస్తున్న పరిశోధనల్లోనూ అదే తేలింది. మనం తీసుకునే ఆహార పదార్థాల ద్వారా కేన్సర్‌ను చాలా వరకూ నిరోధించవచ్చని శాస్త్రీయంగా బలమైన ఆధారాలే వెల్లడయ్యాయి. కేన్సర్‌కు ప్రధాన కారకాలైన వేపుళ్లు, నిల్వ పచ్చళ్లు, ప్రాసెస్‌డ్ ఫుడ్ వంటి వాటికి దూరంగా ఉండాలని ఆయా నివేదికలు సూచిస్తున్నాయి.
దినసరి ఆహారంలో మనం తీసుకునే పదార్థాల్లోనే కేన్సర్‌ను నిరోధించేవి ఎన్నో ఉన్నాయి. ఆయా ఆహార పదార్థాలను పోషకాలు నశించకుండా తీసుకుంటే సత్ఫలితాలు రాబట్టవచ్చు. కేన్సర్‌ను నిరోధించే ఆహార పదార్థాలేంటో చూద్దాం…


* ఆకుకూరలు అన్ని విధాలా మంచి విటమిన్లు, ఖనిజాలు, యాంటి ఆక్సిండెంట్లు, ఎంజైమ్‌లు అధికంగా ఉండే ఆకుకూరలు అన్ని విధాలా మంచివి. పోషకాలు ఎక్కువ. క్యాలరీలు తక్కువ. బచ్చలికూర, పాలకూర… తదితరాల్లో కేన్సర్‌ను నిరోధించే యాంటీ ఆక్సిడెంట్ల శాతం ఎక్కువ. వీటిల్లోని గ్లూకో సైనోలేట్లు అన్ని రకాల కేన్సర్ కణాలను పని చేయకుండా చేస్తాయి. కంతులు పెరగకుండా ఉంటాయి.
* పుట్టగొడుగులు మంచి పోషకాహారంగానే కాక పుట్టగొడుగులు కేన్సర్‌ను నిరోధించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. వీటిలోని లెక్టిన్ కేన్సర్ కణాలు వృద్ధి చెందకుండా నిరోధిస్తుంది.
* కేరెట్ కేరెట్, బీట్‌రూట్, గుమ్మడి, చిలగడదుంపల్లోని బీటా కెరోటిన్, ల్యూటెన్… వంటివన్నీ ఊపిరితిత్తులు, నోరు, గొంతు, పొట్ట, పేగు, మూత్రాశయం, మూత్రపిండాలు, ప్రొస్టేట్, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లన్నింటినీ తగ్గిస్తాయి. క్యారెట్లలోని ఫాల్కారినాల్ కేన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుందని డెన్మార్క్‌కు చెందిన ఓ పరిశోధన సంస్థ నిరూపించింది. కేరెట్ల కారణంగా కళ్లు, చర్మ సంబంధ క్యాన్సర్లు దరిచేరవు. సంక్లిష్ట పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే ఈ రకం కూరగాయలు అన్నవాహిక క్యాన్సర్లు రాకుండా అడ్డుకుంటాయి. వీటిల్లోని బీటాకెరొటిన్ కేన్సర్ కారక రసాయనాలు కణత్వచాన్ని దాటి డీఎన్‌ఏను చేరకుండా రక్షిస్తుంది. కేరెట్ ముక్కలు, జ్యూస్‌ను ఓ అరకప్పు మోతాదులో రోజుకు రెండు సార్లు తీసుకుంటే అండాశయ కేన్సర్ తగ్గుముఖం పడుతుంది.
* మిరప: కేన్సర్ కారక నైట్రస్ అమైన్లను నిరోధించడం ద్వారా పొట్ట కేన్సర్‌ను అడ్డుకుంటుంది. క్యాప్సికమ్‌లోని ఫైటోకెమికల్స్ కూడా జీర్ణాశయ క్యాన్సర్లను చాలా వరకూ నిరోధిస్తాయి.
* సిట్రస్ జాతి పండ్లు: సిట్రస్ జాతి పండ్లయిన బత్తాయి, కమలా.. వంటి వాటిల్లోని మోనోటెర్ఫీన్లు కేన్సర్ కారక కార్సినోజెన్ కణాలను శరీరం నుంచి నుంచి బయటకు పంపిస్తాయి. రొమ్ము కేన్సర్‌ను అద్భుతంగా తగ్గిస్తాయని తేలింది. వీటిలోని లిమోనిన్‌లు కేన్సర్ కణాలను నాశనం చేసే లింఫోసైట్లనూ ప్రేరేపిస్తాయి.
* నాన్ రిఫైన్డ్ నూనెలు: సాధారణంగా మన ఆహారంలో రిఫైన్డ్ నూనెల శాతమే ఎక్కువ. మెదడుతో పాటు నాడీ వ్యవస్థలో 60 శాతం కొవ్వు, ఆమ్లాలతోనే నిర్మితమై ఉంటుంది. రిఫైన్డ్ వెజిటబుల్ ఆయిల్స్, హైడ్రోజినైటెడ్ నూనెలు తీసుకోవడం వల్ల అవి కణాల మీద దాడి చేయడంతో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. వాటికి బదులు నాన్ రిఫైన్డ్ కొబ్బరి, అవిసె, కాడ్ లివర్ ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్… వంటి నూనెలు వాడితే వాటిలోని ఒమెగా ఫ్యాటీ ఆమ్లాలు కేన్సర్ వ్యాధుల్ని రానివ్వవు.
* కాలీఫ్లవర్, క్యాబేజీ: క్రూసిఫెరస్ జాతులకు చెందిన ఆకు, కాయగూరలన్నీ కేన్సర్ నిరోధకాలే.. కేన్సర్ కారక ఫ్రీరాడికల్స్‌ను సమర్థంగా ఎదుర్కొనే గ్లూటాధియోస్ వీటిలో ఎక్కువగా ఉంటుంది. వీటిల్లోని ఐసోధియోసైనేట్లు అన్నిరకాల కేన్సర్లను అడ్డుకుంటాయి. పేగు, మలద్వార కేన్సర్లను నియంత్రించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.

Cancer Disease Spread in India
* తేయాకు
గ్రీన్‌టీ, బ్లాక్ టీల్లోని కెటెచిన్లు కేన్సర్ కణాల విభజనను అడ్డుకుంటాయి. ఇవి పొట్ట, పేగు, ఊపిరితిత్తులు, కాలేయం, క్లోమ క్యాన్సర్లన్నింటినీ నిరోధించగలవని తేలింది. రొమ్ము కేన్సర్ రోగులకు గ్రీన్‌టీ ఎంతో మేలు చేస్తుంది. చెర్రీలు, స్ట్రాబెర్రీలు సమర్థవంతమైన కేన్సర్ నిరోధకాలనేనని పరిశోధనలు నిరూపిస్తున్నాయి. నలుపు రంగులోని రాస్పెర్రీల్లోని యాంటీ ఆక్సిడెంట్లు గొంతులోని కణుతుల్ని సమర్థవంతంగా నిరోధిస్తాయి. వీటిల్లోని గాలిక్ ఆమ్లం శక్తివంతమైన యాంటీవైరల్‌గా పనిచేస్తూ రోగ నిరోధకశక్తిని పెంపొందిస్తుంది. దానిమ్మ పండును తరచూ తీసుకుంటే గర్భాశయ కేన్సర్‌ను తగ్గించవచ్చు.
* గింజలు తినాలి:
గింజలన్నీ కేన్సర్ నిరోధకాలే. వీటిలో సమృద్ధిగా ఉండే క్యుయెర్సిటిన్, క్యాంఫెరాల్… వంటి యాంటీ ఆక్సిడెంట్లు కేన్సర్ వ్యాపించకుండా అడ్డుకుంటాయి. బ్రెజిల్ నట్స్‌లో సెలీనియం అత్యధికంగా ఉంటుంది. అందుకే ఇది ప్రొస్టేట్ కేన్సర్‌ను చాలా వరకూ నిరోధించగలదు. వాల్‌నట్స్, అవిసె గింజల్లోని ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు మెదడు కేన్సర్‌ను సమర్థంగా అడ్డుకుంటాయి. అవిసెలతో పాటు ఇతర ముడి ధాన్యంలోని పీచుతో పేగు, మలద్వార కేన్సర్‌లను నిరోధించవచ్చు. అవిసెల్లోని లిగ్నన్లు కంతులు పెరగకుండా చూస్తాయి. గింజలతో పాటు ప్రోటీన్లు ఎక్కువగా ఉండే చేపలు, మాంసాహారం తీసుకుంటే ఎముక కేన్సర్ నివారణ సులభమవుతుంది.
* పసుపు: పసుపులో సైక్లో ఆక్సిజినేజ్ శాతం ఎక్కువగా ఉండటంతో అది పేగు కేన్సర్‌ను తిప్పికొడుతుంది. అలాగే ఇందులోని కుర్‌క్యుమిన్ కణుతుల పరిమణాన్ని తగ్గించడంతో పాటు మంటను తగ్గించడం ద్వారా పేగు, రొమ్ము సంబంధిత క్యాన్సర్ల నివారణకు తోడ్పడుతుందట. అందుకే కప్పు నీటిలో టీస్పూను పసుపుతో పావు టీస్పూను మిరియాల పొడి కలపి రోజూ తాగితే ఫలితం ఉంటుంది.
* వెల్లుల్లి : వెల్లుల్లిలోని ఎలిం పదార్థాలు కేన్సర్‌తో పోరాడే రోగ నిరోధక కణాలను ప్రేరేపించడం ద్వారా కణుతుల పెరుగుదల వేగాన్ని అడ్డుకుంటాయి. కేన్సర్ కారక కణాలు ఆరోగ్యకర కణాల్లోకి ప్రవేశించకుండా అడ్డుకుంటాయి. వెల్లుల్లి జాతికి చెందిన ఉల్లి వంటి వాటిలోని యాంటీ బాక్టీరియల్ గుణాలు చాలా ఎక్కువ. పొట్ట, పేగు క్యాన్సర్లనూ నిరోధిస్తాయి. కాలేయంలోని కేన్సర్ కణాలను నిర్వీర్యం చేయడానికి వెల్లుల్లిలో ఉండే డై ఎలైల్ స్ఫడ్ అనే పదార్థం తోడ్పడుతుంది.
* ద్రాక్షతో రక్ష:
ద్రాక్ష పండ్లలోని బయో ఫ్లేవనాయిడ్లు అద్భుత ఆక్సిడెంట్లు మాత్రమే కాదు. శక్తివంతమైన కేన్సర్ నిరోధకాలు కూడా. వీటిల్లోని రెస్ వెరట్రల్ కేన్సర్‌ను ప్రేరేపించే ఎంజైములు విడుదల కాకుండా చేస్తుంది. ఎలాజిక్ ఆమ్లం కూడా కేన్సర్ కణాలకు అవసరమైన ఎంజైములను అడ్డుకోవడం ద్వారా కేన్సర్‌ను నిరోధించడంతో పాటు కణుతుల పెరుగుదలను అడ్డుకుంటుంది.
* బొప్పాయి:
బొప్పాయిలోని సీ విటమిన్ అద్భుత యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తూ కేన్సర్ కారక నైట్రస్ అమైన్లు శరీరంలోకి ప్రవేశించకుండా చేస్తుంది. అందుకనే ప్రతి రోజూ క్రమం తప్పకుండా ఆహారంలో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, నట్స్ ఉండేలా చూసుకోవాలి. ఆహారంతోపాటు రోజూ ఓ అరగంట పాటు వ్యాయామం తప్పనిసరిగా చేయాలి.
ఇలా ఆరోగ్యాన్ని కాపాడుకుంటే కేన్సర్ దరిచేరదు.

నగరంలో ఏటా 2400 కొత్త కేన్సర్ కేసులు నమోదవుతున్నాయి. ఇక్కడ రొమ్ము కేన్సర్ బాధితులే ఎక్కువ. ఊపిరితిత్తులు, నోటి, నాలుక, గొంతు కేన్సర్ కేసుల సంఖ్యా ఎక్కువే. దేశ వ్యాప్తంగా కేన్సర్ బాధిత రాష్ట్రాలనుబట్టి చూస్తే హరియాణా, ఢిల్లీల తర్వాతి స్థానంలో ఉత్తరప్రదేశ్ ఉంటే.. నగరాల్లో హైదరాబాద్‌దేనని ఢిల్లీకి చెందిన ఫోర్టిస్ మెమోరియల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(ఎఫ్‌ఎంఆర్‌ఐ) ఆందోళన వ్యక్తం చేస్తోంది. రొమ్ము కేన్సర్ బాధితుల్లో మహిళలు, ఊపిరితిత్తుల కేసుల్లో పురుషులు, గొంతు, నాలుక కేన్సర్ కేసుల్లో చిన్నారుల సంఖ్య ఎక్కువగా ఉంది. 50 నుంచి 55 ఏళ్ల మధ్య వయసున్న పురుషులు, మహిళలు ఎక్కువగా కేన్సర్ బారిన పడుతుంటే హైదరాబాద్‌లో 15 ఏళ్లలోపు చిన్నారులు కూడా కేన్సర్‌కు బలవుతున్నారు.
* ప్రతి ఏడాది మన దేశంలో పది లక్షల కేన్సర్ కొత్త కేసులు నమోదవుతున్నాయి. వీరిలో 50 ఏళ్లు దాటిన వారే ఎక్కువ.
* మన దేశంలో 80 కేసుల్లో రెండో, మూడో స్టేజీల్లోనే క్యాన్సర్ వచ్చిందని తెలుస్తుంది. ఈ దశలో కేన్సర్ నివారణ కష్టమవుతుంది. లక్షలు ఖర్చు పెట్టినా గ్యారంటీ ఉండదు. అందువల్లే కేన్సర్ చాలా ప్రమాదకరం.
* ఇటీవల కాలంలో 21 ఏళ్ల వయస్సు దాటిన వారందరినీ కేన్సర్ స్క్రీనింగ్ చేయించుకొమ్మని సలహా ఇస్తున్నారు వైద్యులు. కేన్సర్‌ను ముందుగా గుర్తిస్తే నివారణ అవకాశాలు ఎక్కువ. చిన్న పిల్లలకు కూడా కేన్సర్ రావటం బాగా పెరిగింది.
* 2014 నాటికి మన దేశంలో 33 లక్షల కేన్సర్ కేసులు నమోదయ్యాయి. ప్రతి ఏడాది మరో పది లక్షల చొప్పున వచ్చి చేరుతున్నాయి. స్త్రీ, పురుషులు దాదాపు సమానంగానే కేన్సర్ బారిన పడుతున్నారు.
* మహిళల్లో రొమ్ము, సర్వికల్ కేన్సర్, పురుషుల్లో లంగ్ కేన్సర్ ఎక్కువగా వస్తోంది.
* 2020 నాటికి దేశంలో 17.3 లక్షల మంది కొత్తగా కేన్సర్ బాధితులుగా మారనున్నట్లు ఎఫ్‌ఎంఆర్‌ఐ నివేదిక చెబుతోంది.
* హైదరాబాద్‌లోని అన్ని కేన్సర్ ఆస్పత్రుల్లోనూ రోజుకు సగటున 10 కొత్త కేసులు నమోదవు తున్నాయి.

* కణుతులనేవి శరీరం లోపలా వెలుపలా ఎక్కడైనా రావచ్చు. అయితే ఈ కణుతుల్లో 70 శాతానికి పైగా కేన్సర్‌తో సంబంధం లేనివే (బినైన్) ఉంటాయి. అయితే, కణితి కనిపించినప్పుడు ఎక్కడ కేన్సర్ కణితిగా బయటపడుతుందోనని కొందరు వ్యాధి నిర్ధారణ పరీక్షలకే వెళ్లరు. ఒకవేళ నిజంగానే అది కేన్సర్ క ణితే అయితే తొలి దశలోనే ఉన్నప్పుడే వైద్య చికిత్సలకు వెళితే దాని నుంచి పూర్తిగా విముక్తి పొందే అవకాశం ఉంటుంది. అలా కాకుండా పరీక్షలకే వెళ్లకుండా ఉండిపోతే ఒక్కోసారి అది ప్రాణాపాయానికే దారి తీయవచ్చు. అందుకే కణితి అనగానే వణికిపోకుండా ముందు వైద్య పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి అనే అవగాహన అందరికీ అవసరమే.

Dr. జి. సూర్యనారాయణ రాజు
M.S, M.Ch, FRCS, FUICC
సీనియర్ ప్రొఫెసర్, సర్జికల్ ఆంకాలజీ &డైరెక్టర్,
అశ్విన్స్ స్పెషాలిటీ హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్.

మల్లీశ్వరి వారణాసి

Foods that may help lower your cancer risk

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News