స్పష్టంగా కనిపించేలా అభ్యర్థుల పేర్లు, గుర్తులు, సీరియల్ నెంబర్లు
బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచే కొత్త నిబంధన అమల్లోకి
న్యూఢిల్లీ: ఈసారి ఓటు వేసేముందు ఈ వీఎంలపై పోటీ చేసే అభ్యర్థుల కలర్ ఫోటోలు దర్శనం ఇస్తాయి. అభ్యర్థుల ముఖాలు స్పష్టంగా కన్పించేందుకు ఇప్పటివరకూ ఉన్న నలుపు తెలుపు ఫోటోలస్థానే కలర్ ఫోటోలు ఏర్పాటు చేస్తారు. అలాగే సీరియల్ నెంబర్ లు కూడా ఉంటాయి. ఈవీఎం బ్యాలెట్ పేపర్ల లేఅవుట్ ను మార్చడానికి ఎన్నికల సంఘం తన నియమ నిబంధనల్లో మార్పులు చేసింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచే ఈ కొత్త మార్పు అమలవుతుంది. 1961 ఎన్నికల నిర్వహణ నియమాలలోని 49 బి రూల్ ప్రకారం అభ్యర్థుల ఛాయా చిత్రాలు ఇప్పుడు రంగుల్లో ముద్రిస్తారు. మునుపటి నలుపు తెలుపు లేదా ఫోటో లేని వెర్షన్ స్థానంలో మరింత స్పష్టతకోసం నిబంధన మారుస్తున్నారు.
అంతే కాదు బ్యాలెట్ పేపర్ పై అభ్యర్థి సీరియల్ నెంబర్ కూడా మరింత స్పష్టంగా కన్పిస్తుంది. నిబంధనలను మార్చి, పోలింగ్ బూత్ లలో గందరగోళాన్ని తగ్గించేందుకు డిజైన్, ప్రింట్ రెండింటినీ మార్చారు. ఎన్నికల ప్రక్రియ క్రమబద్దీకరణకు, ఓటర్లకు మరింత చేరువ కావడానికి ఎన్నికల సంఘం ఆరు నెలలుగా దాదాపు 28 మార్పులను చేపట్టింది. అభ్యర్థుల పేర్లు, నోటా ఓటర్లు చదువుకోడానికి సులభంగా ఒకే ఫాంట్ లో ముద్రిస్తారు. ఈవీఎం బ్యాలెట్ పత్రాలను 70 జిఎస్ ఎం కాగితంపై ముద్రిస్తారు. అసెంబ్లీ ఎన్నికల కోసం గులాబీ రంగు కాగితాన్ని ఉపయోగిస్తారు. బీహార్ లో రానున్న అసెంబ్లీ ఎన్నికలలోనే అప్ గ్రేడ్ చేసిన ఈవీఎం బ్యాలెట్ పత్రాలను ఉపయోగిస్తారు.
Also Read: వారిని జైలుకు పంపండి.. పంట వ్యర్థాల దహనంపై సుప్రీం సీరియస్