Monday, September 1, 2025

టిఎంసి ఎంపి మహువా మొయిత్రాపై కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

రాయ్‌పుర్: కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై ‘అభ్యంతరకర’ వ్యాఖ్యలు చేసినందుకుగాను తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాపై ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పుర్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదయిందని ఆదివారం పోలీసులు పేర్కొన్నారు. ‘ఒకవేళ బంగ్లాదేశ్ నుంచి చొరబాటును ఆపడంలో అమిత్ షా విఫలమైతే ముందు ఆయన తల నరికి మీ టేబుల్‌పై పెట్టండి. సరిహద్దు భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతలను విస్మరిస్తోంది’ అని మహువా మొయిత్రా ఇటీవల ఆగ్రహంతో అన్నారు.

పశ్చిమ బెంగాల్‌లోని నాడియా జిల్లాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. తన ఆగ్రహాన్ని చాటారు. దీనిపై గోపాల్ సమంతో అనే స్థానిక వ్యక్తి ఫిర్యాదు చేశారు. దాంతో ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పుర్ పోలీసులు భారత న్యాయ సంహితలోని సెక్షన్లు 196, 197 కింద శనివారం మనా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదుచేశారు. అంతేకాక అతడు తన ఫిర్యాదులో బంగ్లాదేశీ కాందీశీకులు రాయ్‌పుర్‌లోని మనా క్యాంప్ ఏరియాలో 1971 నుంచే పెద్ద సంఖ్యలో స్థిరపడ్డారని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో మహువా మొయిత్రా చేసిన వ్యాఖ్యలు రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలను రెచ్చగొట్టవచ్చని పేర్కొన్నారని పోలీసు అధికారి తెలిపారు. దీనికి ముందు పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణానగర్ కోత్వాలీ పోలీస్ స్టేషన్‌లో కూడా ఆమెపై ఓ ఫిర్యాదు దాఖలయింది. మహువా మొయిత్రా ఇటీవల కేంద్రంపై విరుచుకుపడుతూ ‘బిజెపి నేతలు పదేపదే చొరబాటుదార్ల గురించి మాట్లడతారే తప్ప దేశ సరిహద్దులను పరిరక్షించే బాధ్యతలను నిర్వర్తించరని, సరిహద్దుల్ని పరిరక్షించే ఐదు భద్రతా దళాలు కేంద్ర హోం శాఖ పరిధిలోనే పనిచేస్తున్నాయని, కేంద్ర హోం శాఖ, హోం మంత్రి సరిహద్దుల్ని పరిరక్షించలేనప్పుడు.. చొరబాటుదారులు దేశ ప్రజల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ప్రధాని స్వయంగా వాపోతున్నప్పుడు… ఆ తప్పు ఎవరిది?’ అని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ఆమె అమిత్ షాను ఉద్దేశించి ఆగ్రహంతో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాగా దీనిని బిజెపి ఖండించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News