Tuesday, April 23, 2024

నాకేమైనా జరిగితే కేంద్రానిదే బాధ్యత: సత్యపాల్ మాలిక్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : తనకు కల్పించిన జెడ్ ప్లస్ కేటగిరి భద్రతను ఉపసంహరించుకోవడంపై జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కేంద్రంపై మండిపడ్డారు. తన భద్రతను కుదించి ఓ పర్సనల్ సెక్యూరిటీ అధికారిని ఇచ్చినా, అతడు మూడు రోజులుగా రాలేదన్నారు. ఎవరైనా తనపై దాడి చేయవచ్చని, తనకేదైనా జరిగితే కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన పలు జాతీయ మీడియా సంస్థలతో మాట్లాడుతూ రైతు సమస్యలు, కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్‌ల విషయంలో కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడినందువల్లే తన భద్రతను తగ్గించారని ఆరోపించారు. ఏ రాజకీయ పార్టీ లోనూ చేరాలని తనకు లేదని, తాను రాజకీయ వ్యక్తిని కాదని అన్నారు. 2008 నుంచి 2018 వరకు జమ్ము కశ్మీర్ గవర్నర్‌గా పనిచేసిన ఎన్‌ఎన్‌వోరా వంటి వాళ్లకు భద్రత ఇప్పటికీ చెక్కు చెదరలేదన్నారు.

తనకు ఎందుకు భద్రత కుదించారు? దీని వెనుక కారణాలేంటని కోరుతూ కేంద్ర హోం మంత్రిత్వశాఖకు లేఖ రాసినా ఇప్పటివరకు స్పందన రాలేదన్నారు. తాను గవర్నర్‌గా ఉన్న సమయం లోనే జమ్ముకశ్మీర్ అసెంబ్లీ రద్దు చేశామని, ఆర్టికల్ 370 రద్దు జరిగిందని చెప్పారు. సత్యపాల్ మాలిక్ జమ్ముకశ్మీర్‌తోపాటు మేఘాలయ, గోవా గవర్నర్ గానూన సేవలందించారు. జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేసి ఆ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం కశ్మీర్, లద్దాఖ్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొట్టిన సమయం లో సత్యపాల్ మాలిక్ గవర్నర్‌గా ఉన్నారు. ఆ చారిత్రక నిర్ణయం జరిగిన నెలరోజులకు ఆయన గోవా గవర్నర్‌గా బదిలీ అయ్యారు. అలాగే అక్టోబర్ 2022 వరకు ఆయన మేఘాలయ గవర్నర్‌గా సేవలందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News