Tuesday, December 10, 2024

వైద్య నిపుణులపై నేరాల కట్టడికి ప్రత్యేక కేంద్ర చట్టం అనవసరం

- Advertisement -
- Advertisement -

చిన్న నేరాలపై చర్యకు రాష్ట్ర చట్టాలు చాలు
తీవ్ర నేరాలను బిఎన్‌ఎస్‌తో అరికట్టవచ్చు
జాతీయ టాస్క్ ఫోర్స్ సిఫార్సు

న్యూఢిల్లీ : ఆరోగ్య సేవ వృత్తి నిపుణులపై నేరాల కట్టడికి ప్రత్యేక కేంద్ర చట్టం ఏదీ అవసరం లేదని, దైనందిన చిన్న నేరాలపై చర్యకు రాష్ట్ర చట్టాల్లో తగిన నిబంధనలు ఉన్నాయని, తీవ్ర నేరాలపై చర్యకు భారతీయ న్యాయ సంహిత (బిఎన్‌ఎస్)ను ఉపయోగించవచ్చునని జాతీయ టాస్క్ ఫోర్స్ (ఎన్‌టిఎఫ్) సిఫార్సు చేసింది. కోల్‌కతాలోని ఆర్‌జి కర్ వైద్య కళాశాల. ఆసుపత్రిలో ఒక పిజి ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం నేపథ్యంలో వైద్య వృత్తి నిపుణుల రక్షణ, భద్రతకు అనుసరించవలసిన విధి విధానాల రూపకల్పనకు సుప్రీం కోర్టు ఆగస్టు 20న ఎన్‌టిఎఫ్‌ను ఏర్పాటు చేసింది. ఎన్‌టిఎఫ్ తన నివేదికలో పలు సిఫార్సులు చేసింది. ఆరోగ్య సేవ ప్రొఫెషనల్స్‌పై దౌర్జన్య సంఘటనల కట్టడికి 24 రాష్ట్రాలు ఇప్పటికు చట్టాలు చేశాయని, ‘ఆరోగ్య సేవ సంస్థలు’, ‘మెడికల్ ప్రొఫెషనల్స్’ పదాలను కూడా అవి నిర్వచించాయని ఎన్‌టిఎఫ్ తన నివేదికలో తెలియజేసింది.

మరి రెండు రాష్ట్రాలు ఈ విషయమై తమ బిల్లులను ఇప్పటికే ప్రవేశపెట్టినట్లు ఎన్‌టిఎఫ్ తెలిపింది. చాలా వరకు రాష్ట్ర చట్టాలు చిన్న నేరాలకు వర్తిస్తాయని, వాటికి శిక్షలు నిర్దేశిస్తాయని, ఇక పెద్ద నేరాలను బిఎన్‌ఎస్ పరిధిలోకి తగిన రీతిలో తీసుకువచ్చారని ఎన్‌టిఎఫ్ తన సిఫార్సుల్లో పేర్కొన్నది. ‘దైనందిన చిన్న నేరాలకు వర్తించే తగినన్ని నిబంధనలు రాష్ట్ర చట్టాల్లో ఉన్నాయని తెలియవచ్చింది. పెద్ద నేరాలను బిఎన్‌ఎస్‌తో కట్టడి చేయవచ్చు. అందువల్ల ఆరోగ్య సేవ వృత్తి నిపుణులపై నేరాల నియంత్రణకు ప్రత్యేక కేంద్ర చట్టం అవసరం లేదు’ అని ఎన్‌టిఎఫ్ తన నివేదికలో వివరించింది. వైద్య వృత్తి నిపుణుల రక్షణకు ప్రత్యేక శాసనం లేని రాష్ట్రాల్లో బిఎన్‌ఎస్ 2023 నిబంధనలను వారిపై దౌర్జన్య సంఘటనల నియంత్రణకు వెంటనే ఉపయోగించవచ్చునని టాస్క్ ఫోర్స్ సిఫార్సు చేసింది.

కేంద్రం సుప్రీం కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఎన్‌టిఎఫ్ నివేదికను పొందుపరచింది. తన సిఫార్సులను స్వల్ప కాలిక, మధ్య కాలిక, దీర్ఘ కాలిక చర్యలుగా విభజించినట్లు ఎన్‌టిఎఫ్ తన సమగ్ర నివేదికలో తెలియజేసింది. ఆరోగ్య సేవ సంస్థల్లో భద్రత కమిటీ ఏర్పాటుతో సహా తగిన భద్రత ఉండేలా చూసేందుకు శిక్షణ పొందిన భద్రత సిబ్బందిని మోహరించాలని, స్థానిక పోలీసులతో వారు సమన్వయం చేసుకోవాలని ఎన్‌టిఎఫ్ స్పష్టం చేసింది. ఆరోగ్య సేవ సంస్తల పరిమాణం,స్వభావం బట్టి నిఘా కోసం తగిన సంఖ్యలో సిసిటివిలు ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని ఎన్‌టిఎఫ్ సిఫార్సు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News