Saturday, April 13, 2024

పాఠశాల విద్యపై విఫల ప్రయోగం

- Advertisement -
- Advertisement -

నిరంతరం సమగ్ర మూల్యాంకనం (సిసిఇ) వల్ల విద్యార్థులకు ఏమాత్రం ఉపయోగం లేదని దేశంలోని 27 రాష్ట్రాలతో పాటు దీనిని 2009లో ప్రారంభించిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్‌ఇ) సిసిఇ వైఫల్యాలను ముందే పసిగట్టి 2017 నాటికే రద్దు చేసినా, 2012లో ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దీనిని రద్దు చేసినా ఇది విఫలమవుతున్నదని నివేదికలు వచ్చే సందర్భంలో పూర్వ పద్ధతులను పునరుద్ధ్దరించుకుంటున్న సమయం లో తెలంగాణ 11 సంవత్సరాలు దానిపై ఎటువంటి సమీక్షలు నిర్వహించకుండా, ఆయా రాష్ట్రాలు రద్దు చేయడానికి పేర్కొన్న ఏ కారణాన్ని కూడా అధ్యయనం చేయకుండా పాఠశాల విద్యలో దీనిని కొనసాగిస్తుండటం వల్ల రోజు రోజు ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సంఖ్య తో పాటు విద్యా ప్రమాణాలు పడిపోయి పతనం అంచుకు చేరుకున్నాయి. ఒక విధానాన్ని ప్రవేశపెట్టేటప్పుడు అది ఎక్కడైనా విజయం సాధించిందా అని పరిశీలించిన అనంతరం మన రాష్ట్రంలో కూడా ప్రయోగాత్మకంగా కొన్ని పాఠశాలల్లో ప్రారంభించి దానిని విస్తరించాలి.

ఇదేది లేకుండానే సిసిఇలో భాగంగా ఒకసారి పరీక్షలలో, మరోసారి పాఠ్యపుస్తకాలలో, చివరకు ఉపాధ్యాయుల బోధనలో సంస్కరణలని ఎవరికీ అంతుబట్టని, అర్థంకాని గందరగోళ విధానాలతో ఇటు ఉపాధ్యాయులను, అటు విద్యార్థులను గజిబిజికి దీనిని ప్రవేశపెట్టిన ఎన్‌సిఇఆర్‌టి గురిచేస్తున్నది.గతంలో యూనివర్శిటీ, ఆర్‌ఐఇ, సీఫెల్ లాంటి ఉన్నత విద్యా సంస్థలలో పని చేసి సుదీర్ఘ బోధనానుభవం కలిగిన ఉన్నత విద్యావంతులతో విద్యార్థుల స్థాయికి తగ్గట్టుగా వారి పరిణతి పెంచే విధంగా పుస్తకాలు, పాఠ్యాంశాలు రాయించేవారు. 10 వ తరగతి వరకు ఉండే పాఠ్యపుస్తకాలు సెంట్రల్, స్టేట్ పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడే ప్రామాణికత కలిగి ఉండేవి. సిసిఇలో అర్హత, అనుభవం లేని కాపీ, పేస్ట్ మేధావులను రచయితలుగా మార్చడంతో, తమ పైత్యాన్నంత పాఠ్యాంశాలుగా రాయడంతో బోధించాల్సిన సిలబస్ విపరీతంగా పెరిగిపోయి పాఠ్యాంశాల తయారీలో పూర్తిగా శాస్త్రీయత లోపించి విద్యార్థులకు అటు అర్థంకాక,

ఇటు చదువు రాక విద్యా వ్యవస్థ సర్వనాశనమైంది. అక్షరాల నుండి, పదాలు, వాక్యాలు నేర్చుకొనే విధానానికి స్వస్తి చెప్పి, వాక్యాల నుండి పదాలు, అక్షరాలు నేర్చుకోవాలని కొత్తగా సూత్రీకరించడంతో మొత్తం బెడిసికొట్టి పేద విద్యార్థులకు చదువు రాకుండా పోయింది. మీరు చదువు గిట్లనే నేర్చుకున్నారా అయ్యా అంటే ఏ సమాధానం రాదు! బ్యాగ్ బరువు తగ్గించాలని కమిషన్‌లు చెబుతూ, నో బ్యాగ్ డేలు జరుపుతుంటే విపరీతమైన సిలబస్ పెంచి బ్యాగు బరువు పెంచారు. ఇంటర్, డిగ్రీ, పిజి పాఠ్యపుస్తకాలతో లింక్ తెగిపోయింది. ఇవి చదివితే మెడికల్, ఐఐటి సీట్లు అటుంచి ఐటిఐ సీటు కూడా రాదు.
తెలుగు, హిందీ, ఇంగ్లీష్, గణితం, సైన్స్, సాంఘిక సబ్జెక్ట్‌లతో పాటు 1. కళలు, సాంస్కృతిక విద్య, 2.ఆరోగ్య, వ్యాయామ విద్య, 3. పని, కంప్యూటర్ విద్య, 4. విలువల విద్య, జీవన నైపుణ్యాలు లాంటి సహ పాఠ్యాంశాలను ప్రారంభించి విద్యార్థిపై భారం పెంచి, బోధకులను నియమించకపోవడంతో ఈ 11 సంవత్సరాల కాలంలో ఏ పాఠశాలలో వీటిని బోధించకుండానే మార్క్స్ వేస్తున్నారు.

జాయ్ ఫుల్ లర్నింగ్ పేరుతో ప్రారంభించబడిన ఈ ప్రోగ్రాం విద్యార్థికి ఏ జాయ్ లేకుండా చేయడమేకాక యాంత్రికంగా మార్చింది. ఉపాధ్యాయుడు ఒక గైడ్‌గా, ఏమి బోధించకుండా ఉండాలట! విద్యార్థే అంతా అర్థం చేసుకోవడం, నేర్చుకోవడం ఎలా సాధ్యం? ఈ విధంగా భారం పెంచి అద్భుతమైన విద్యార్థిని సృష్టించబోతున్నామని అందమైన అబద్ధంతో సమాజాన్ని నమ్మించి సిసిఇని ప్రవేశపెట్టినవారు మోసం చేస్తున్నారు.పరీక్షల్లో సంస్కరణల పేరిట వాటి సంఖ్యను తగ్గించలేదు సరికదా, ఎప్పుడంటే అప్పుడు విద్యార్థికి చెప్పకుండా పరీక్ష పెట్టవచ్చు అనడం ఉపాధ్యాయుడిని, విద్యార్థిని గందరగోళానికి గురిచేయడమే కాకుండా సమయం వృథా అవుతున్నది! ప్రశ్నాపత్రం మొత్తం మార్చి పాఠ్యాంశం బయటి నుండి ప్రశ్నలు ఇచ్చి చిన్న పిల్లలను రాయమంటే ఎలా రాస్తారు? పాఠశాలల్లో నిరంతం ఇచ్చే అన్ని సబ్జెక్ట్‌ల ప్రాజెక్ట్ పనులతో విద్యార్థి కంప్యూటర్ సెంటర్స్ చుట్టే తిరుగుతూ

వేల రూపాయలను దోచిపెడుతున్నదని తల్లిదండ్రులు అభిప్రాయపడటం మా యూనియన్ అధ్యయనంలో తేలింది. ఈ విధానంలో ప్రవేశపెట్టిన పనుల వలన విద్యార్థిపై మానసిక ఒత్తిడి బాగా పెరిగి చదవడం, రాయండంలో వెనుకబడుతున్నాడు. పాఠశాలల్లో, ఇంటి దగ్గర కూడా విద్యార్థికి ప్రైవేట్ జీవితాన్ని ఈ విధానం దోచేసింది. దిన, వార, మాస పత్రికలు, గ్రంథాలయాలు, ల్యాబ్‌లు, ఇంటర్నెట్ లాంటి సౌకర్యాలు అందుబాటులో లేని చోట ప్రాజెక్ట్ పనులు ఎలా సాధ్యం? అంతేకాదు ప్రతి ఉపాధ్యాయుడు తమ తమ సబ్జెక్ట్‌లకు చెందిన పనులను పదే పదే అడగడంతో ఆ బాధలు భరించలేక విద్యార్థులు పాఠశాలకు రోజుల తరబడి హాజరు కావడంలేదనేది మా యూనియన్ అధ్యయనంలో తేలింది.సిసిఇలో గ్రేడింగ్ పద్ధతి చాలా విచిత్రంగా ఉంటుంది. ఈ విధానంలో ఎక్కడ కూడా ఒక సబ్జెక్ట్‌లో మార్కులు ఎన్ని వచ్చాయో ఎవ్వరికీ తెలియనివ్వరు. అన్ని సబ్జెక్ట్‌లలో 92పైబడి మార్కులు వచ్చి ఒక దానిలో 92కు లోపల వస్తే అతని సిజిపిఎ(క్యుమ్యులేటివ్ గ్రేడ్ పాయింట్స్ ఆవరేజ్) 10/10 వచ్చే అవకాశం లేదు. 10/10 సిజిపిఎ వచ్చిన విద్యార్థి కంటే 9.8, 9.7 సిజిపిఎ వచ్చిన విద్యార్థికి మొత్తం మార్కులు ఎక్కువగా కూడా ఉండే అవకాశం ఉంది.

దీనిని బట్టి అర్థమయ్యేదేమిటంటే మార్కులు ఎక్కువ వచ్చిన వాని కంటే కూడా 10/10 సిజిపిఎ వచ్చిన విద్యార్థిని తెలివైన విద్యార్థిగా ఈ విధానం ద్వారా దీనిని ప్రవేశపెట్టిన గుడ్డి మేధావులు గుర్తిస్తున్నారు. ఇది ప్రైవేటు పాఠశాలల ప్రచారానికి బాగా ఉపయోగపడుతున్నది.ఇప్పటికైనా ప్రభుత్వం పాఠశాల విద్యపై చేస్తున్న ప్రయోగాలను ఆపి సిసిఇని రద్దు పరిచి సెమిస్టర్ విధానం లేదా పాత విధానం ప్రవేశపెడుతూ, కొత్త పాఠ్యపుస్తకాలను నిపుణులతో రాయించి, విద్యార్థిపై బ్యాగు బరువును, పరీక్షల భారాన్ని తగ్గించి చదవడానికి, రాయడానికి ప్రాధాన్యత ఇచ్చినపుడే పాఠశాల విద్యా వ్యవస్థ గాడినపడి విద్యార్థులకు నాలుగు అక్షరాలు వస్తాయి. పాపం చిన్న పిల్లలకు వాళ్ళపై జరుగుతున్న ప్రయోగాలు తెలియవు. వాళ్ళ అభిప్రాయాలు అడిగేవాళ్ళు లేరు, వాళ్ళకు తెలియజెప్పెవాళ్ళు లేరు. వాళ్ళకు గొంతులేదు. వాళ్ళ జీవితాలతో చెలగాటమాడుతున్న ఈ ప్రయోగాల విషయంలో కళాశాల విద్యార్థుల్లాగా వాళ్ళకు ధర్నాలు, రాస్తారోకోలు చేయడం తెలియదు. విద్యావంతులారా, ఉపాధ్యాయులారా, విద్యార్థి సంఘాల మిత్రులారా ఇప్పటికైనా ఈ గొంతులేని పాఠశాల విద్యార్థుల పక్షాన మాట్లాడండి. లేకపోతే చరిత్ర మనల్ని క్షమించకపోవచ్చు!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News