Saturday, August 16, 2025

వాటర్ వార్.. మళ్లీ రాజుకున్న తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం

- Advertisement -
- Advertisement -

నదీ జలాల నీటి వాటాలపై తెలుగు రాష్ట్రాల సిఎం హాట్ కామెంట్స్
చర్చనీయాంశంగా మారిన ముఖ్యమంత్రుల వ్యాఖ్యలు
బనకచర్లపై తగ్గేది లేదన్న ఎపి సిఎం చంద్రబాబు
ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడే ప్రసక్తే లేదన్న తెలంగాణ సిఎం రేవంత్‌రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదం మరోసారి రాజుకుంది. నదీ జలాల నీటి వాటాలపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేళ ఎపి, తెలంగాణ సిఎంల మధ్య మాటల తూటాలు పేలాయి. విజయవాడ, హైదరాబాద్‌లో జెండా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో భాగంగా గోదావరి, కృష్ణా జలాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎపి సిఎం చంద్రబాబు నాయుడు విమర్శలు చేసుకున్నారు. బనకచర్లపై తగ్గేది లేదని, ఈ ప్రాజెక్టుతో ఏ రాష్ట్రానికి నష్టం జరగదని సిఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. బనకచర్ల ప్రాజెక్ట్ వల్ల ఎవరికీ నష్టం జరగదని… ఈ ప్రాజెక్టుపై ఎవరూ అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదని చంద్రబాబు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ అంశంపై ప్రతిస్పందించారు. కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణకు ఉన్న హక్కుల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు ప్రతి నీటి చుక్క కోసం తమ ప్రభుత్వం పోరాటం చేస్తుందని తేల్చిచెప్పారు. తమ అవసరాలు తీరాకే ఇతరులకు నీరిస్తామని, గోదావరి -కృష్ణాలో వాటాలు దక్కాల్సిందేనని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని పునరుద్ఘాటించారు. పొరుగు రాష్ట్రంతో స్నేహపూర్వక సంబంధాలు కోరుకుంటామని, అయితే హక్కుల విషయానికి వస్తే మాత్రం వెనక్కి తగ్గేది లేదని గట్టిగా హెచ్చరించారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం తెలంగాణ రైతుల ప్రయోజనాలను కాపాడటంలో ఎలాంటి రాజీకి తావులేదని సిఎం భరోసా ఇచ్చారు.

వరదను భరించాలి గానీ .. ఆ నీటిని వాడవద్దా..?: చంద్రబాబు
బనకచర్లపై ఎవరూ అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు మరోమారు పునరుద్ఘాటించారు. సముద్రంలోకి వృథాగా పోయే నీటినే వాడుకుంటామని స్పష్టం చేసారు. స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో బనకచర్ల ప్రాజెక్టు అంశాన్ని ప్రస్తావించిన చంద్రబాబు కీలకమైన అంశాన్ని ప్రస్తావించారు. ఎగువ రాష్ట్రాల నుంచి వచ్చే వరద నీటితో నష్టాలనూ భరిస్తున్నామని గుర్తుచేస్తూ , అదే వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరమేంటని ప్రశ్నించారు. వరదను భరించాలి కానీ, ఆ నీటిని వాడుకోవద్దా..? అని అడిగారు.గోదావరి వరద జలాలనే వాడుకునే ఈ బనకచర్ల ప్రాజెక్టును నిర్మించి తీరతామంటూ తన మునపటి వాదననే స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలలో స్పష్టం చేయడం ద్వారా చంద్రబాబు మరోసారి బనకచర్ల ప్రాజెక్ట్‌పై తెలంగాణ రాష్ట్రానికి తేల్చి చెప్పినట్లైంది.

నీటి వాటా హక్కులపై రాజీ లేదు : సిఎం రేవంత్‌రెడ్డి
బనకచర్ల విషయంలో తగ్గేదిలేదని చంద్రబాబు స్పష్టం చేస్తే, తెలంగాణ నీటివాటా హక్కుపై రాజీలేదని తెలంగాణ సిఎం రేవంత్‌రెడ్డి తేల్చి చెప్పారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో సిఎం రేవంత్‌రెడ్డి నీటి వాటాల అంశాన్ని ప్రస్తావించారు. బనకచర్ల ప్రాజెక్ట్‌పై ఎపి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై కౌంటర్ ఇచ్చారు. కృష్ణా, గోదావరి నదుల్లో నీటివాటా హక్కుపై రాజీలేదని స్పష్టం చేశారు. తెలంగాణకు రావాల్సిన నీళ్ల వాటా దక్కించుకుంటామని అన్నారు. మన అవసరాలు తీరాకే మిగతా రాష్ట్రాలకు నీరు అందిస్తామని చెప్పారు. కెసిఆర్ ప్రభుత్వం వైఖరి కారణంగా తెలంగాణ జలాల విషయంలో నష్టపోయిందని, గత ప్రభుత్వం లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం కూలిపోయిందని విమర్శించారు.

ఆచితూచి వ్యవహరిస్తున్న కేంద్రం
బనకచర్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఆచితూచి వ్యవహరిస్తోంది. రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలంగా చేసేందుకు వరద జలాల వినియోగం కోసమే బనకచర్ల నిర్మాణమంటూ అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వంపై చంద్రబాబు ఒత్తిడి చేస్తున్నారు. ఎన్‌డిఎ ప్రభుత్వంలో తెలుగుదేశం కీలక భాగస్వామి కావడం, ఎపిలోనూ కూటమి ప్రభుత్వం ఉండటంతో ఈ ప్రాజెక్టు విషయంలో కేంద్రం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే బనకచర్ల విషయంపై తాము ఆ సమావేశంలో చర్చించలేదని తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. రెండు రాష్ట్రాలు చర్చలతో నీటి వాటాలు పరిష్కరించు కోవాలంటూ కేంద్రం మధ్యస్థంగా వ్యవహరిస్తోంది. తాజాగా ఇద్దరు ముఖ్యమంత్రులూ బనకచర్లపై తమతమ వైఖరిపైనే తేల్చి చెప్పారు. దాంతో బనకచర్ల ప్రాజెక్టుపై భవిష్యత్తులో ఇరు రాష్ట్రాలు ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నాయి, ఈ అంశంపై కేంద్రం ఎలా వ్యవహరించనున్నది అనేది చర్చనీయాంశంగా మారింది.

కొనసాగుతున్న తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలు
రాష్ట్ర విభజన తర్వాత నుంచి కృష్ణా, గోదావరి నదుల జల వాటాలపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎపిలో టిడిపి ప్రభుత్వం, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గోదావరి- బనకచర్ల లింక్ ప్రాజెక్టు అంశం ఇరు రాష్ట్రాల మధ్య రాజకీయ ఉద్రిక్తతలకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలపై ఇటీవల కేంద్ర జలశక్తి మంత్రి కార్యాలయంలో, సీఆర్ పాటిల్ అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. ఈ భేటీలో ఎపి సిఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, నిమ్మల రామానాయుడు హాజరయ్యారు.

అయితే, గోదావరి – బనకచర్ల ప్రాజెక్టుపైనే సమావేశంలో చర్చించాలని ఎపి ప్రతిపాదించగా.. అసలు బనకచర్లపై చర్చే అవసరం అవసరం లేదని తెలంగాణ సర్కార్ కేంద్రానికి రాసిన లేఖలో తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. రెండు రాష్ట్రాలు తమ తమ డిమాండ్లపై పట్టుబడుతుండటంతో కేంద్ర ప్రభుత్వ సమన్వయ పాత్ర కీలకంగా మారనుంది. గోదావరి జల వివాద ట్రిబ్యునల్, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం -2014 నిబంధనలను ఉల్లంఘిస్తుందని, తెలంగాణకు రావాల్సిన నీటి వాటాలను హరిస్తుందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తోంది. తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై చర్చించడానికి అంగీకరించేది లేదని కేంద్రానికి పలుమార్లు లేఖలు రాశారు. ఈ అంశంపై కేంద్ర మంత్రి నడ్డాను స్వయంగా కలిసి కూడా వివరించారు. కేంద్ర పర్యావరణ కమిటీ బనకచర్ల ప్రాజెక్టును వ్యతిరేకించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News