Tuesday, May 14, 2024

చంద్రబాబు ‘ఖైదీ నంబర్ 7691 ‘

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టైన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును ఆదివారం అర్థరాత్రి 1.16 సమయంలో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో స్నేహ బ్లాక్‌కు చంద్రబాబును తరలించారు. చంద్రబాబుకు సెంట్రల్ జైల్లో ఖైదీ నంబర్ 7691 కేటాయించారు. శుక్రవారం అర్థరాత్రి మొదలైన హైడ్రామా 48 గంటల ఉత్కంఠ తర్వాత ముగిసింది. ఎసిబి ప్రత్యేక కోర్టు ఉత్తర్వులతో చంద్రబాబును రాజమండ్రి తరలించారు. జ్యూడిషియల్ రిమాండ్ విధించిన వెంటనే చంద్రబాబు తరపు న్యాయవాదులు రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. చంద్రబాబు వయసు రీత్యా ఆయన్ని గృహ నిర్బంధంలో ఉంచాలని కోరారు. ఈ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది.

జైల్లో చంద్రబాబుకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని ఆదేశించింది. రాజమండ్రి జైలుకు చేరిన తర్వాత చంద్రబాబును లోకేష్ పరామర్శించారు. జైలు సిబ్బందికి చంద్రబాబును అప్పగించిన తర్వాత ఎన్‌ఎస్‌జి సిబ్బంది వెనుదిరిగారు. స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో నిధుల దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలతో నమోదైన కేసులో చంద్రబాబు నాయుడును శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత కర్నూలుజిల్లా నంద్యాలలో ఎపి సిఐడి అరెస్ట్ చేసింది. రెండు రోజుల సుదీర్ఘ ఉత్కంఠ తర్వాత చంద్రబాబును ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సెంట్రల్ జైలుకు తరలించారు. మరోవైపు చంద్రబాబును జైలుకు తరలించడంతో రాజమండ్రిలో భద్రత కట్టుదిట్టం చేశారు. రాజమండ్రిలో సెక్షన్ 30 అమలు చేస్తున్నారు. దాదాపు 300మందితో భద్రత ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాష్ట్రమంతట భద్రత కట్టుదిట్టం చేయాలని పోలీస్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, నిరసనలకు అనుమతి లేదని ప్రకటించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News