Friday, March 1, 2024

కంపెనీల పురుగు మందుల వ్యాపారం!

- Advertisement -
- Advertisement -

ఆహార పంటల ఉత్పత్తిలో రసాయనిక ఎరువులు, పురుగు మందుల వినియోగం తీవ్రరూపం దాల్చింది.అవి లేకుండా దిగుబడులు రాని పరిస్థితి ప్రపంచ వ్యాపితంగా ఏర్పడింది. పురుగుమందుల వినియోగం నిరంతరం సేద్యంలో పెరుగుతూ ఉండటంతో వాటి ఉత్పత్తులు గణనీయంగా పెరుగుతున్నాయి. వినియోగం పెరుగుదల బడా పురుగు మందుల కంపెనీలకు లాభాల బాట పట్టిస్తున్నది. గత మూడు దశాబ్దాల్లో పురుగు మందుల వాడకం చాలా ఎక్కువగా వుంది. ప్రపంచ వ్యాపితంగా 2019లో వ్యవసాయ పురుగు మందుల వాడకం 4.19 బిలియన్ మెట్రిక్ టన్నులకు చేరుకుంది. ఇది హెక్టార్‌కు 2.69 కిలో గ్రాములుగా ఉంది. ప్రపంచ వ్యాపితంగా వినియోగించే పురుగుమందుల్లో సగానికి పైగా వినియోగించే ప్రాంతం ఆసియా పసిపిక్. పంట భూమిలో అత్యధికంగా పురుగు మందుల వినియోగించే ప్రాంతం ఆసియా, అమెరికా. భారత దేశంలో పరుగు మందుల తయారీ 1952లో ప్రారంభమైంది. బెంజిన్ హెక్సాక్లోరైడ్, దాని తర్వాత డిడిటి ఉత్పత్తి జరిగింది. 1958లో భారత దేశం 5 వేల మెట్రిక్ టన్నుల పురుగుమందుల ఉత్పత్తి జరిగింది. 1990ల మధ్య కాలంలో 145 పురుగు మందుల నమోదుతో ఉత్పత్తి 85 వేల టన్నులకు పెరిగింది.

క్రమంగా 90 వేల టన్నుల వార్షిక ఉత్పత్తితో ఆసియాలో పురుగు మందులు ఉత్పత్తి చేసే ప్రముఖ దేశాల్లో భారత దేశం ఒకటిగా ఉంది. భారత దేశం ప్రధానం వ్యవసాయ ఉత్పత్తిదారుగా ఉంది. దీనిపై 100 కోట్ల దాకా ప్రజలు ఉపాధి పొందుతున్నారు. భారత దేశ రైతు సేద్యం ఇప్పటికీ వెనకబడే ఉంది. పాలకుల చేయూత లేకపోవడమే దానికి కారణంగా వుంది. పంటలకు చీడపీడల బెడద రైతాంగాన్ని వెన్నంటి వస్తూనే ఉంది. మొదట తెగుళ్ల నివారణకు రైతాంగం సాంప్రదాయ పద్ధతుల్లో బూడిద, వేప పిండి, వేప పసరు మొదలైనవి రైతాంగం వినియోగించారు.ఆ తర్వాత డిడిటి ఎక్కువ ఉపయోగించారు. 1966లో భారత పాలకులు సస్యవిప్లవం ప్రకటించి అధిక దిగుబడుల కోసం హైబ్రిడ్ విత్తనాలు దిగుమతి చేసుకున్నారు. ఆ విత్తనాలతో పాటు వాటి నుంచి వచ్చే కొత్త తెగుళ్లు దిగుమతి అయ్యాయి. వాటి నివారణకు ఆ కంపెనీలే పురుగుమందులను దేశానికి పంపాయి.ఆ విధంగా రసాయనిక పురుగు మందులు సేద్యంలోకి ప్రవేశించాయి.

పురుగు మందుల ఉత్పత్తి: తెగుళ్ల నుంచి పంటను కాపాడుకోవడానికి విపరీతంగా రసాయనిక పురుగు మందులను వినియోగిస్తున్నారు. 2015- 2022 మధ్య భారత దేశం అంతటా ఉత్పత్తి చేయబడిన పురుగు మందుల పరిమాణం 1000 వేల మెట్రిక్ టన్నులుగా 16- మే -2023న స్టాటిస్టా రీసెర్చ్ డిపార్ట్‌మెంట్ ప్రచురించింది. 2022 ఆర్థిక సంవత్సరంలో 229 వేల మెట్రిక్ టన్నుల పురుగు మందులు ఉత్పత్తి జరిగిందంటే సేద్యంలో పురుగు మందుల వాడకం ఎంత మోతాదులో జరుగుతున్నదో అర్ధమవుతుంది. 2020-2022 సంవత్సరాల్లో భారత ప్రభుత్వం ప్రచురించిన డేటా ప్రకారం వార్షిక పురుగు మందుల వాడకం 40 వేల మెట్రిక్ టన్నులగా ఉంది.
భారతీయ మార్కెట్: పురుగు మందుల ఉత్పత్తిలో కీలక రసాయనం అయిన మాలిక్యూల్స్ తయారు చేసే కంపెనీలు భారత్ లో దాదాపు 80 దాకా ఉన్నాయి. ఫార్మలేషన్ (తుది ఉత్పాదన) రూపొందించే కంపెనీలు 2 వేలు ఉన్నాయి. మాలిక్యూల్స్ తయారీకి కావాల్సిన ముడి సరుకు విదేశాల నుండి దిగుమతి అవుతుంది. దీని ధర కంపెనీల ఇష్టానుసారంగా ఉంటుంది. ఫలితంగా పాకిస్థాన్, బంగ్లాదేశ్ కంటే భారత దేశంలో పురుగు మందుల ధర 40% ఎక్కువ. దేశంలో18 వేల కోట్ల రూపాయల పురుగు మందుల వ్యాపారం జరుగుతున్నది. 50 లక్షల మంది ఈ రంగంలో ఉన్నారు.

ప్రమాదకర బిల్లు: పురుగు మందుల తయారీలో వున్న భారతీయ కంపెనీల మనుగడ సంక్షోభంలో పడే పరిస్థితి ఏర్పడింది. మోడీ ప్రభుత్వం పెస్టిసైడ్ మేనేజ్‌మెంట్ బిల్లు 2017 తీసుకు వచ్చింది. ఈ బిల్లు బహుళ జాతి కంపెనీలకు మరింతగా సహకారాన్ని అందిస్తుంది. ఈ బిల్లు అమలులోకి వస్తే దేశీయ కంపెనీల మనుగడ కష్టమని పరిశ్రమ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఇక్కడి మార్కెట్లో ఎంఎన్‌సిలు 40% దాకా ఒప్పందాలు చేసుకున్నాయి.
నమోదు కాకున్నా విక్రయాలు: ఇన్‌సెక్టిసైడ్స్ యాక్టు 1968 ప్రకారం భారత్‌లో విదేశీ కంపెనీలు పరుగుల మందులు విక్రయించాలంటే సెంట్రల్ ఇన్ సెక్టిసైడ్స్ బోర్డు అండ్ రిజర్వేషన్ కమిటీలో మాలిక్యూల్ (రసాయనం) నమోదు తప్పనిసరి. అది సెక్షన్ 9(3) కింద నమోదు జరుగుతుంది. ఇదే మాలిక్యూల్ భారత కంపెనీలు తయారు చేయాలంటే సెక్షన్ 9(4)కింద దరకాస్తు చేయాలి. రిజస్ట్రేషన్ లేకుండానే 2007 నుంచి భారత్‌లో పలు విదేశీ కంపెనీలు 127 ఉత్పత్తులను విక్రయిస్తున్నాయి. వీటి వ్యాపారం సాలీనా రూ. 7 వేల కోట్లు. మోడీ ప్రభుత్వం వీటిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కనీసం నాణ్యతను కూడా పరీక్షించడం లేదు.

సుమారు 100 మాలిక్యూల్స్‌ను ఎంఎన్‌సిలు తమ చేతుల్లో పెట్టుకుని భారత్ మార్కెట్‌ను శాసిస్తున్నాయి. ఎంఎన్‌సిల చేతుల్లో వున్న ఫార్మేషన్‌ను భారతీయ కంపెనీలు తయారు చేసేందుకు వీలుగా ఉన్న ఇన్ సెక్టిసైడ్స్ యాక్టులో ఉన్న 9(4) నిబంధనకు మోడీ ప్రభుత్వం తెచ్చిన బిల్లు ప్రమాదంగా ఉంది. యాక్టులో వున్న 9(4) కొనసాగించాలని దేశీయ కంపెనీలు డిమాండ్ చేస్తున్నాయి. దాన్ని కొనసాగించకపోతే భారత కంపెనీల మనుగడ ప్రశ్నార్ధకమవుతుంది.
బడా కంపెనీల లాభాలు: పురుగు మందుల వ్యపారంలో సింజెంటా ప్రపంచంలోనే అగ్రగామిగా వుంది. పురుగు మందుల అమ్మకాల్లో దాదాపు 13.3 బిలియన్ల అమెరికన్ డాలర్లను ఆర్జించింది. ఈ అమ్మకాల్లో భారత దేశంలో దీని వాటా 3%గా వుంది. దీన్ని 10 శాతానికి పెంచాలని భావిస్తున్నది. దీని తర్వాత రెండవ అతి పెద్ద పురుగు మందుల కంపెనీ బేయర్స్ క్రాప్ సైన్స్. ఇది బేయర్స్ ఎజి ఉప కంపెనీ. దీని పురుగు మందుల అమ్మకాలు 11.3 బిలియన్ల అమెరికా డాలర్లు. 2021లో విత్తనాలు, పురుగు మందుల అమ్మకాలతో సహా దీని ఆదాయం 20 బిలియన్ల యూరోలుగా ఉంది. భారత దేశంలో దీని వ్యాపా రం విస్తరించి వుంది.

బడా కంపెనీలన్నీ గుత్తాధిపత్యం కోసం విలీనాలు, కొనుగోళ్ళకు సిద్ధమయ్యాయి. డే కెమికల్ ఇ డిపాంట్, దె నిమోరస్ మధ్య 2017లో విలీనం జరిగింది. 2018లో మోన్ శాంటోను బేయర్ కొనుగోలు చేసింది.
రసాయన పురుగు మందుల వినియోగం వలన పొలాల నుంచి ప్రవహించే నీరు స్థానిక నీటి వనరులైన చెరువుల, సరస్సుల్లోకి ప్రవేశించి వాటిని కలుషితం చేస్తాయి. ఈ నీటితో జీవరాసులు చనిపోతాయి. అనేక సర్వేల ప్రకారం పెద్ద ఎత్తున చేపలు చనిపోవడానికి పురుగు మందులే ప్రధాన కారణం. తీవ్రమైన పర్యావరణ సమస్యలు ఏర్పడుతున్నాయి. అంతేకాకుండా విష పూరిత పురుగు మందులను పైర్లపై చల్లడం వలన ఆహారోత్పత్తుల్లో విషం చేరి ప్రజలు అనేక రోగాలకు గురై చనిపోతున్నారు. పురుగు మందులు పిచికారి చేసే కూలీలు విష వాయువులు పీల్చడంతో ప్రాణాలు కోల్పోతున్నారు.
వేల సంఖ్యలో ఇలాంటి మరణాలు సంభవించాయి. ప్రజల ప్రాణాలకు విలువ ఇవ్వని బడా కంపెనీలు, ప్రజల ప్రాణాలకు ప్రమాదకరమైన అత్యంత విష పూరిత పురుగు మందులు తయారు చేసి కోట్లాది రూపాయలు లాభాలు పొందుతున్నారు.

వాటి ధరలు విపరీతంగా వుండడంతో సేద్యపు ఖర్చులు పెరిగి రైతాంగం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెరిగిన సేద్యపు ఖర్చులకు అనుగుణంగా పంటలకు ధరలు లభించక పోవడంతో అప్పుల పాలై ప్రాణాలు కోల్పోతున్నారు. విష పూరిత పురుగు మందులపై కఠినమైన ఆంక్షలు విధించాలని, విదేశీ దిగుమతులను పరిమితం చేయాలని, వాటి నాణ్యతను పరీక్షించిన తర్వాతే అనుమతించాలని, దేశ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పురుగు మందులను ప్రభుత్వ సంస్థలే ఉత్పత్తి చేయాలని యావన్మంది రైతాంగం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉద్యమించాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News