Monday, December 4, 2023

పెరిగిన వేడి..గుడ్లు తేలేస్తున్న కోడి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎండలు మండి పోతున్నాయి. ఉష్ణోగ్రతలు సలసల మంటున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న వేడిగాలుల తీవ్రత కోళ్ల పరిశ్రమకు ప్రతికూలంగా మారింది. శగలు చిమ్మే వేడిగాలులను తట్టుకోలేక షెడ్లలోనే కోళ్లు గుడ్లు తేలేస్తున్నాయి. అసలే వేసవిలో పోల్ట్రీ పరిశ్రమ యాజమాన్యాలు బ్రాయిలర్ కోళ్ల పెంపకాన్ని తగ్గించుకుంటారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా యూనిట్ల నిర్వహణను నియంత్రించుకుంటూ ఉత్పత్తిని తగ్గిస్తుంటారు. అయితే ఈ ఏడాది వేసవిలో ఉష్ణగ్రతలు 45నుంచి 46.9డిగ్రీలకు తాకుతున్నాయి. ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని పలు జిల్లాలు కుతకుతలాడి పోతున్నాయి. దీనికి తగ్గట్టుగానే కోళ్ల సరఫరా తగ్గి మార్కెట్లో కోడి ధర కొండెక్కి కూర్చుంటోంది.

ఆదివారం రాష్ట్ర మార్కెట్లో కోడి మాసం విక్రయ ధరలు భారీగా పెరిగి వినియోగదారులకు గూబగుయ్ మనిపిస్తున్నాయి. ఈ సీజన్‌లో కోడి మాంసం స్కిన్‌లెస్ ధరలు గమనిస్తే కనిష్టంగా రూ.152 రూపాయలనుంచి ప్రారంభమయ్యాయి. ఇవి ఎండలు ముదురుతున్న కొలదీ రోజురోజుకూ పెరుగుతూ వస్తున్నాయి. ఈ ఆదివావారం గరిష్ట స్థాయికి చేరాయి. కిలో స్కిన్‌లెస్ చికెన్ ధర ఏకంగా రూ.270కి పెరిగిపోయింది. బోన్‌లెస్ చికెన్ రూ.490, బ్రెస్ట్‌లెస్ చికెన్ ధర రూ.362, లివర్ గిజర్డ్ ధర రూ.130కి చేరాయి. గత ఏడాది వేసవిలో చికెన్ ధరలు స్కిన్‌లెస్ గరిష్టంగా రూ.300కు చేరుకుని వర్షకాలం ప్రారంభం కాగానే ధరలు తగ్గుతూ వచ్చాయి. ఈ ఏడాది రోహిణి కార్తే ప్రారంభమై మూడు రోజులే అవుతోంది. ఈ కార్తెలో ఎండలు మరింత తీవ్రతరం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఉన్న బ్రాయిలర్ కోళ్ల యూనిట్లను కాపాడుకోవటం ఫౌల్ట్రీ యాజమాన్యాలకు కనాకష్టంగా మారింది. వేసవిలో మార్చి నుంచి జూన్ రెండవ వారం వరకూ కోళ్లను కాపాడుకోవటం సవాలుగా మారింది. ఎండల ధాటి నుంచి కోళ్లను కాపాడుకునేందుకు షెడ్ల చుట్టూ చాపలు కట్టి లోపల చల్లదనం కోసం ప్రతి రెండు గంటలకు ఒక సారి చాపలపైన నీళ్లు చిమ్మాల్సివస్తోంది. మరి కొందరు ఏకంగా షెడ్లలో పెద్ద పెద్ద కూలర్లను ఏర్పాటు చేసుకున్నారు. వాతావరణంలో ఉష్ణోగ్రతలు చల్లబరిచి కోళ్లను కాపాడుకునేందుకు అదనపు కూలీ ఖర్చులు భరించాల్సి వస్తోందని నిర్వాహకులు చెబుతున్నారు. మరికోన్ని చోట్ల వేడిగాలుల తీవ్రతను తట్టుకోలేక కోళ్లు మృతిచెందుతున్నాయి.

ఇటు పెరిగిన నిర్వహణ ఖర్చులు , అటు కోళ్ల మృతితో వస్తున్న నష్టాలు తట్టుకుని నిలదొక్కుకోవాలంటే కోడి ధరలు పెంచక తప్పటం లేదని పౌల్ట్రీ నిర్వాహకులు చెబుతున్నారు. కోళ్లను యూనిట్ల నుంచి రిటైల్ మార్కెట్లో చికెన్ సెంటర్లకు తరలించటంలో మార్గమధ్యంలోనే కొన్ని కోళ్లు మృతి చెందుతున్నాయి. రవాణ చార్జీల ఖర్చులు కూడా అదనంగా భరించాల్సి వస్తోందని చెబుతున్నారు. రాష్ట్రం సరిహద్దుల్లో ఉన్న మహారాష్ట్ర , కర్ణాటక ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూడా కోళ్ల దిగుమతి ఆశించినంతగా ఉండటం లేదు . అక్కడ కూడా పౌల్ట్రీ యాజమాన్యాలు ఇదే విధమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కొవాల్సివస్తోంది.
మరో 40రోజులు ఆగాల్సిందేనా!
కొండెక్కిన కోడి మాంసం ధరలు కిందకు దిగిరావాలంటే వేసవి కాలం గడిచిన తర్వాత మరో 40రోజుల వరకూ ఆగాల్సిందే అని ఫౌల్ట్రీ యాజమాన్యాలు వెల్లడిస్తున్నాయి. కోడిపిల్లను 40రోజుల పాటు మేతపెట్టి మేపితేనే మాసం కటింగ్‌కు అనుకూలంగా ఎదుగుతుంది. జూన్ మొదటి వారంలో కొత్త యూనిట్లు ప్రారంభింస్తే జులై రెండవ వారంలోగాని అవి కోతకు రావు .అప్పటిదాక ఉన్న కోళ్లతోనే సర్దుకోక తప్పదంటున్నారు. ఇట్పికే చికెన్ సరఫరాలో 40శాతం తగ్గింది. ఈ కోరతను ఎదుర్కొవాలంటే మరికొన్నాళ్లపాటు ఆగక తప్పదంటున్నారు. పెరిగిన కోడి మాంసం ధరలు భరించే శక్తిలేని వినియోగదారులు మాసం వినియోగాన్ని కూడా సగానికి సగం తగ్గించుకుంటున్నారు. కిలో కొనుగోలు చేసే వారు అరకిలోతోనే సరిపెట్టుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News