Friday, April 19, 2024

మానసిక ఆరోగ్యంపై సంతాన లేమి తీవ్ర ప్రభావం

- Advertisement -
- Advertisement -

దంపతుల మానసిక ఆరోగ్యంపై సంతాన లేమి తీవ్రప్రభావం చూపుతోంది. దేశంలో ఇది ఎంతో అసౌకర్యం, కళంక ప్రాయమైన చర్చగా సాగుతోంది. ఈపరిస్థితి రానురాను పెరిగి హెచ్చరికగా మారుతోంది. వివాహితులైన ఆరు జంటల్లో ఒక జంట వంతున వందత్వానికి గురవుతున్నారు. వీరిలో ఒకశాతం కన్నా తక్కువ మంది వైద్యచికిత్సను ఆశ్రయిస్తున్నారు. అవగాహన లోపించడంతోపాటు సరైన వైద్య చికిత్స అనుసంధానంలో ఇబ్బందులు చాలావరకు ఈ పరిస్థితిని పెంచుతున్నాయి. ఎవరైతే దంపతులు వందత్వంతో గందరగోళం, నిస్పృహ, నిరాశ, ఆందోళన, నిస్సహాయత, అపరాధభావంతో ఉంటారో వారు సంతానలేమికి డయాగ్నసిస్, ట్రీట్‌మెంట్ పొందడం వారి మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపించవచ్చు.

సంతానానికి మహిళే ప్రధాన బాధ్యురాలైనందున సామాజికంగా మహిళలే ఈ విషయంలో తీవ్ర ఒత్తిడికి గురవుతుంటారు. వంద్యత్వ సంబంధ మానసిక అనారోగ్యాన్ని నయం చేయడం చాలా మంది వైద్య నిపుణులకు చేతకావడం లేదు. పిల్లలు కలగక పోవడానికి అనేక కారణాలు. ఈలోటు భవిష్యత్తులో మానసిక ఇబ్బందులకూ దారి తీస్తోంది. ఈ సమస్యలను పరిష్కరించాలనే లక్షంతో గెట్‌ఇంటిమసీ అనే సంస్థ పనిచేస్తోంది. దేశంలో గురుగావ్‌లో జనవరిలో ఈమేరకు సదస్సు నిర్వహించింది. దాదాపు వందమంది వివిధ విభాగాల వైద్య నిపుణులు హాజరయ్యారు. ఈ సమస్యతో మానసికంగా బాధపడుతున్న దంపతుల్లో ముఖ్యంగా మహిళల్లో ఏ విధంగా మానసిక ఆవేదన తొలగించాలన్నదానిపై చర్చించారు.

దీన్ని తీవ్రమైన సమస్యగా కాకుండా సాధారణ సమస్యగా చూడాలని సూచించారు. ఎలాంటి గర్భ నిరోధక సాధనాలు పాటించకుండా ఏడాదిపాటు దాంపత్య జీవితం గడిపినా, సంతానం కలగక పోవడాన్ని సంతానలేమి లేదా వంద్యత్వంగా పరిగణిస్తారు. ప్రపంచం మొత్తం మీద పది నుంచి పదిహేను శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నారని తేలింది. ప్రజలను తీవ్రంగా ఇబ్బందిపాలు చేస్తున్న ఆరోగ్యసమస్యల్లో సంతాన లేమి ఐదో స్థానంలో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనం వెల్లడించింది. భారత దేశంలో సంతానలేమి బారిన పడిన జంటలు దాదాపు రెండు కోట్లు. వీళ్ల మానసికస్థితిపై సంతాన లేమి ప్రభావం ఎక్కువగా కనిపిస్తోందని వైద్య నిపుణులు గుర్తించారు.

సంతాన లేమితో ఒత్తిడి, తీవ్ర ఆవేదన మానసికంగా కుంగదీస్తాయి. ఫలితంగా ఎక్కువ మోతాదులో విడుదలైన ప్రొలాక్టిన్, థైరాయిడ్ హార్మోన్లు అండకణాల విడుదలను, సంతాన సాఫల్యతను వ్యతిరేకంగా ప్రభావితం చేస్తాయి. సంతాన సాఫల్య చికిత్సలు చాలా ఖరీదైనవి కావడంతో మధ్య తరగతి వారికి వాటిని భరించలేక అప్పులపాలవుతున్నారు. సుదీర్ఘకాలంగా కొనసాగే ఆ ఒత్తిడి శరీరాన్ని చికిత్సలకు సహకరించకుండా చేస్తుంది. ప్రత్యుత్పత్తి వ్యవస్థ మీద కూడా వ్యతిరేక ప్రభావాన్ని చూపిస్తుంది. ఇటువంటి దంపతులు కౌన్సెలింగ్‌కు వెళ్లడం ఊరట కలిగిస్తుంది. దీన్ని నిర్లక్షం చేస్తే దంపతుల అనుబంధాలకు ఆటంకాలు వచ్చే పరిస్థితి ఉండవచ్చు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News