Friday, April 26, 2024

మానుకోగలమా?

- Advertisement -
- Advertisement -

చైనా సేనలు మన భూభాగంలోకి మరింతగా చొచ్చుకు వస్తున్నకొద్దీ కేంద్ర ప్రభుత్వం అక్కడి నుంచి దిగుమతులను పెంచుకొంటూ పోతున్నదని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చేసిన విమర్శను ఒక ప్రతిపక్ష నేత పాలక పక్షంపై విసిరిన రాయిగా పరిగణించి త్రోసిపుచ్చలేము. చైనాతో మనకున్న సరిహద్దు వివాదం ఈనాటిది కాదు, అది ఎప్పుడైనా మనకు అతిపెద్ద ప్రమాదకారి అనే సంగతి మొదటి నుంచి తెలిసిందే. దానిని తట్టుకొని నిలబడడానికి, తిప్పికొట్టడానికి అవసరమైన శక్తియుక్తులను దండిగా సమకూర్చుకోవలసిన బాధ్యత మన పాలకులపై ఆది నుంచి వుంది. కాని అందుకు జరగవలసిన కృషి గరిష్ఠంగా జరగడం లేదు.

సరిహద్దుల్లో చైనాతో ఘర్షణలు సంభవించినప్పుడల్లా మన నేతల భీషణ ప్రతిజ్ఞలు, విమర్శలు మిన్నంటుతాయి. ఆచరణలో మాత్రం చైనాను బలహీనపరచగలిగే విధంగా వివిధ రంగాల్లో స్వావలంబనను పెంచుకునే కృషి ముందుకు జరగదు. ఈ నెల 9వ తేదీన అరుణాచల్‌ప్రదేశ్ సరిహద్దుల్లోని తవాంగ్ వద్ద చైనా సేనలు మన భూభాగంలోకి వచ్చి మన సేనలతో తలపడిన తర్వాత దానికి బుద్ధి చెప్పాలంటే అక్కడి నుంచి మనం చేసుకొంటున్న దిగుమతులను మానుకోవాలనే సూచన బాహాటంగా వినవచ్చింది. ఇది చైనాను ఆర్థికంగా కుంగదీసి సరిహద్దుల్లో దాని దూకుడు తనానికి కళ్ళెం వేస్తుంది. గత ఐదేళ్ళలో చైనా నుంచి మనం చేసుకొన్న దిగుమతులు దాదాపు 29 శాతం పెరిగాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి అనుప్రియాపటేల్ పార్లమెంటుకు గత జులైలో తెలియజేశారు. 2020 జూన్‌లో గాల్వాన్ లోయ సరిహద్దు వద్ద చైనా సేనలు దాడి చేసిన తర్వాత వీటిని తగ్గించడానికి ఏమి చర్యలు తీసుకొంటున్నారు అనే ప్రశ్నకు సమాధానమిస్తూ దేశీయ పరిశ్రమలకు ఉత్పత్తి ఆధార ప్రోత్సాహకాలను ఇవ్వడం ప్రారంభించామని మంత్రి చెప్పారు.

ఆ తర్వాత కూడా చైనా నుంచి దిగుమతుల వరద తగ్గుముఖం పట్టలేదు. పైపెచ్చు పెరిగాయి. ఇవి కేవలం పిల్లల ఆట వస్తువుల వంటి వాటికే పరిమితం కాకుండా అత్యంత ప్రధానమైన పారిశ్రామిక అవసర సామగ్రిని కూడా చైనా నుంచి దిగుమతి చేసుకోక తప్పని పరిస్థితి నేడు స్థిరపడిపోయింది. జంతు, శాక కొవ్వులు, సేంద్రియ, సేంద్రియేతర రసాయనాలు, ఖనిజ ఇంధనాలు, ఎరువులు, ప్లాస్టిక్, ప్లాస్టిక్ ఉత్పత్తులు, కాగితం, పేపర్ బోర్డు, పత్తి, జౌళి, వస్త్రాలు, చెప్పులు, గాజు, గాజు సామగ్రి, ఇనుము, ఉక్కు, రాగి, అణురియాక్టర్లు, బాయిలర్లు, యంత్రాలు, యంత్ర పరికరాలు, విద్యుత్ యంత్రాలు, ఫర్నిచర్ వగైరాలు వీటిలో వున్నాయి. ఈ జాబితాను గమనిస్తూ వుంటే చైనా మీద మనం ఎంతగా ఆధారపడి వున్నామో అర్థమవుతుంది. ఇవి చాలక హర్‌ఘర్ తిరంగ (ఇంటింటికీ మువ్వన్నెల జెండా) కార్యక్రమానికి అవసరమైన జెండాలను కూడా చైనా నుంచి దిగుమతి చేసుకోడం తీవ్ర విమర్శలకు గురైంది.

స్వాతంత్య్రానంతర భారత చరిత్రలో భారీ పరిశ్రమల స్థాపన జరిగింది. దేశీయోత్పత్తులను పెంచుకొనే కృషి జరగలేదనడానికి వీలు లేదు. కాని అది స్వాలంబనను సాధించే స్థాయిలో జరగడం లేదు. పార్లమెంటులో ఎదురులేని సంఖ్యాబలంతో ప్రభుత్వాన్ని బిజెపి ఏర్పాటు చేసి ఎనిమిదేళ్ళు గడిచాయి. ఇంత సుదీర్ఘ కాలం సాగిన సుస్థిర పాలనలో కమలనాథులు దేశంలో ఉత్పత్తిని గణనీయంగా పెంచడానికి, దేశీయ అవసరాలను తీర్చడానికి, చైనా వస్తువులతో పోటీ పడి విదేశీ మార్కెట్లను విశేషంగా ఆకర్షించడానికి చేసింది ఏమీ లేదు. అదే సమయంలో మత వైషమ్యాలను రెచ్చగొట్టడానికి, రాష్ట్రాల్లోని బిజెపియేతర పార్టీల ప్రభుత్వాలను కూల్చడానికి వారు చెయ్యనిదంటూ లేదు.

అలాగే ఒకప్పుడు అత్యంత సమర్థవంతంగా పని చేసి ప్రశంసలందుకొన్న ప్రభుత్వ రంగ పరిశ్రమలను కారుచవకగా ప్రైవేటు కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో చైనాతో ఆర్థికంగా పోటీపడే శక్తి భారత దేశానికి ఏ విధంగా సంక్రమిస్తుంది? పిహెచ్‌డి చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అనే సంస్థ చేసిన విశ్లేషణ ప్రకారం చైనా నుంచి దిగుమతులను 40 శాతం మేరకు తగ్గించుకొనే శక్తి సామర్థాలు మనకున్నాయి. అంటే 35 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులను చైనా నుంచి మానుకొనే సామర్థం వుంది. చైనా ఉత్పత్తులు నాణ్యమైనవి కావడంతోపాటు చవకగా లభిస్తూ వుండడం వల్ల దేశదేశాలూ వాటిని తప్పనిసరై దిగుమతి చేసుకొంటున్నాయి. అలాగే అన్ని విధాలైన అనుకూల వాతావరణం నెలకొన్నందున బహుళ జాతి కార్పొరేట్ సంస్థ లు తమ పరిశ్రమలను చైనాలో నెలకొల్పుతున్నాయి. సైకిల్ విడి భాగాలు, వ్యవసాయాధార ఉత్పత్తులు, హస్తకళల సామగ్రి, ఔషధాలు, సౌందర్య సాధనాలు, వినియోగ ఎలెక్ట్రానిక్ వస్తువులు, తోలు సామగ్రి వంటి వాటిని మన దేశంలో విరివిగా ఉత్పత్తి చేయవచ్చునని చెబుతున్నారు. అందుకు తగిన రీతిలో దేశంలోని యువతరానికి గట్టి శిక్షణ ఇచ్చి తాము అదే పనిగా మేపుతున్న కార్పొరేట్ రంగాన్ని ఆ వైపుగా నడిపించే నిజాయితీ మన పాలకులకు లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News