విక్టరీ డే ముఖ్య అతిధి..పుతిన్‌తో కీలక చర్చలు
అమెరికాతో టారీఫ్ జగడాల దశలో కీలకం
ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో ప్రాధాన్యత
బీజింగ్ / మాస్కో : అంతర్జాతీయ స్థాయిలో అత్యంత కీలక పరిణామం చోటుచేసుకొంటోంది. చైనా అగ్రనేత జి జింపింగ్ ఈ నెల 7 వ తేదీ నుంచి 10 వ తేదీవరకూ రష్యాలో పర్యటిస్తారు. రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్‌తో పలు కీలక విషయాలపై చర్చిస్తారని రెండు దేశాల అధికారులు వేర్వేరుగా ఆదివారం తెలిపారు. మాస్కోలో జరిగే రష్యా విక్టరీ డే పరేడ్ లో చైనా అధినేత ముఖ్య అతిధిగా పాల్గొంటారు. అంతర్జాతీయ ,ప్రాంతీయ విషయాలు , ప్రత్యేకించి ఉక్రెయిన్ రష్యా యుద్ధం, అమెరికా టారిఫ్ బెదిరింపుల మధ్యలో ప్రపంచ అగ్రనేతల భేటీ జరుగుతుంది. గతంలో చైనా అధినేత జి బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు 2024 అక్టోబర్‌లో రష్యా వెళ్లారు. తరువాత ఆయన రష్యాకు వెళ్లడం ఇదే మొదటిసారి.
డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్ష పీఠంపైకి వచ్చిన తరువాత చైనా నేత రష్యాలో పర్యటించేందుకు వెళ్లడం ఇదే తొలిసారి. పుతిన్‌తోచైనా అధినేత అత్యంత వ్యూహాత్మక సంప్రదింపులు జరుపుతారని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి తెలిపారు. రష్యా విజయోత్సవ సభకు ప్రపంచ నేతలు పలువురు హాజరు కానున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీకి కూడా ఆహ్వానం అందింది. అయితే ప్రధానికి బదులు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విక్టరీ డేకు వెళ్లుతారు. అయితే కవాతు ఉత్సవానికి ఆయన హాజరు కాబోరు. ఆయన బదులుగా రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్ భారతదేశం తరఫున కార్యక్రమానికి హాజరవుతారని అధికారులు తెలిపారు.
రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీపై అప్పటి సోవియట్ యూనియన్ విజయం సాధించిన సందర్భాన్ని విక్టరీ డేగా నిర్వహిస్తారు. అంతర్జాతీయ స్థాయిలో పలు దేశాలపై , ప్రత్యేకించి చైనాపై ట్రంప్ సుంకాల కత్తి వేలాడుతోంది. ఇరు దేశాల మధ్య పరస్పరం విపరీత స్థాయిలో టారిఫ్‌లు విధింపు జరుగుతూ పోతోంది. దీనితో దిగజారుతున్న అంతర్జాతీయ వాణిజ్య వ్యాపార రంగ పరిణామాల మధ్య రష్యా చైనా మధ్య చర్చలు కీలక మైలురాయి అవుతాయని విశ్లేషిస్తున్నారు.