Thursday, April 25, 2024

ఎపి సిఎం జగన్‌తో చిరు భేటీ

- Advertisement -
- Advertisement -

ఎపిలో టికెట్ ధరలతో పాటు చిత్ర పరిశ్రమలోని సమస్యలపై చర్చ

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ చాలా సంతృప్తికరంగా జరిగిందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. తాడేపల్లిలోని ఏపి సిఎం క్యాంప్ కార్యాలయంలో జగన్‌ను చిరంజీవి కలిశారు. దాదాపు గంటన్నర సాగిన ఈ భేటీలో సినీ పరిశ్రమకు సంబంధించిన అనేక అంశాలపై వారు చర్చించారు. అనంతరం చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ “ఈ సమావేశం ఎంతో సంతృప్తికరంగా సాగింది. సిఎం జగన్ నన్ను ఓ సోదరుడిలా పండగవేళ ఆహ్వానించి ఆప్యాయంగా మాట్లాడారు. ఆయన మాట తీరు బాగా నచ్చింది. ఆయన సతీమణి భారతి స్వయంగా భోజనం వడ్డించడం ఆనందంగా అనిపించింది. ఏపిలో సినిమా టికెట్ ధరల విషయంలో కొన్ని రోజులుగా ఒక మీమాంస ఉంది. దీని వల్ల పరిశ్రమలో అగమ్యగోచర పరిస్థితి ఏర్పడింది.

ఏం జరుగుతుందోననే అసంతృప్తి ఓ వైపు.. ఇండస్ట్రీకి మంచి చేద్దామనేదే తమ ఉద్దేశం అని చెబుతున్న ప్రభుత్వం ఒక వైపు. కొలిక్కిరాని ఈ సమస్య జటిలమవుతున్న నేపథ్యంలో సిఎం జగన్ ప్రత్యేకంగా నన్ను పిలిచారు. ఒక సమస్య గురించి నిర్ణయం తీసుకునే ముందు ఒక కోణంలోనే వినటంకాదు రెండో కోణంలోనూ వినాలని అన్నారు. ఆయన నాపై పెట్టిన నమ్మకం, భరోసా ఎంతో బాధ్యతగా అనిపించింది” అని అన్నారు. “సామాన్య ప్రజలకు వినోదం అందుబాటులో ఉండాలనే ఆయన ప్రయత్నాన్ని అభినందిస్తూ, పరిశ్రమలో ఉన్న సాధక బాధకాలు, ఎగ్జిబిషన్ రంగంలో థియేటర్ యజమానులు పడుతున్న కష్టాలను ఆయన వివరించాను. ఆయన సానుకూలంగా స్పందించారు.

ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని, కమిటీతో మాట్లాడి పరిశ్రమకు మంచి జరిగేలా ఓ నిర్ణయం తీసుకుంటామని మాటిచ్చారు. ఇక దయ చేసి పరిశ్రమకు సంబంధించిన ఎవరూ కూడా మాటలు జారవద్దు. నా మాట మన్నించి సంయమనం పాటించండి. వారం, పది రోజుల్లో ఏపిలో అందరికీ ఆమోదంగా ఉండే జీఓ వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా”అని చెప్పారు.

అంతా మంచే జరుగుతుంది: నాగార్జున

ఏపి సిఎం జగన్‌ను కలవడానికి మెగాస్టార్ చిరంజీవి రమ్మంటే తనకు కుదరదని చెప్పానని స్టార్ హీరో నాగార్జున వెల్లడించారు. తాను బంగార్రాజు సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నానన్నారు. “మాకు ఏపిలో టికెట్ ధరలు ఓకే అనిపించాయి. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనైనా ‘బంగార్రాజు’ సినిమాను రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నాం” అని నాగార్జున వెల్లడించారు. ఇక సిఎం జగన్‌తో చిరంజీవికి సన్నిహిత సంబంధాలున్నాయని… చిత్ర పరిశ్రమకు అంతా మంచే జరుగుతుందని ఆయన అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News