Saturday, December 14, 2024

కృష్ణయ్యర్‌పై సిజెఐ వ్యాఖ్య అవాంఛితం

- Advertisement -
- Advertisement -

అలా చేసి ఉండాల్సింది కాదు
సుప్రీం జడ్జీలు నాగరత్న, ధులియా

న్యూఢిల్లీ : జస్టిస్ కృష్ణయ్యర్ సిద్ధాంతం రాజ్యాంగం విస్తృత, సరళీకృత స్ఫూర్తికి ‘అపచారం’ చేసిందని ప్రైవేట్ ఆస్తులకు సంబంధించిన తన తీర్పులో భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) డివై చంద్రచూడ్ వ్యాఖ్యానించడం పట్ల సుప్రీం కోర్టు న్యాయమూర్తులు బివి నాగరత్న, సుధాంశు ధులియా మంగళవారం ఆక్షేపణ వ్యక్తం చేశారు. సిజెఐ అభిప్రాయాలు అవాంఛితమైనవి, అన్యాయమైనవని జస్టిస్ నాగరత్న పేర్కొనగా, జస్టిస్ ధులియా ఆ వ్యాఖ్యల పట్ల అసమ్మతి వ్యక్తం చేశారు.

ఆయన విమర్శ పరుషమైనదని, అలా అని ఉండవలసింది కాదని జస్టిస్ ధులియా అన్నారు. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు హృషికేశ్ రాయ్, బివి నాగరత్న, సుధాంశు ధులియా, జెబి పార్దీవాలా, మనోజ్ మిశ్రా, రాజేశ్ బిందాల్, సతీష్ చంద్ర శర్మ, అగస్టీన్ జార్జి మసీహ్‌తో కూడిన తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనం ఆ తీర్పును వెలువరించింది. రాజ్యాంగం 39 (బి) అధికరణం కింద పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ప్రైవేట్ యాజమాన్యంలోని అన్ని ఆస్తులను సమీకరించవచ్చునని గతంలో జస్టిస్ అయ్యర్ ఇచ్చిన తీర్పును సిజెఐ ప్రకటించిన మెజారిటీ తీర్పు తోసిపుచ్చింది. బెంచ్ తరఫున తన కోసం, ఆరుగురు ఇతర జడ్జీల తరఫున సిజెఐ తీర్పు రాశారు.

సిజెఐ సంతకం చేసిన మెజారిటీ తీర్పును జస్టిస్ నాగరత్న పాక్షికంగా విభేదించారు, కానీ జస్టిస్ ధులియా అన్ని అంశాలపై వ్యతిరేకత తెలియజేశారు. ‘ఈ న్యాయస్థానం పాత్ర ఆర్థిక విధానాన్ని నిర్దేశించడం కాదు, కానీ ‘ఆర్థిక ప్రజాస్వామ్యం’ కోసం ఒక పునాది నిర్మాణానికి రాజ్యాంగ రూపకర్తల ఉద్దేశానికి వీలు కల్పించడమే. కృష్ణయ్యర్ సిద్ధాంతం రాజ్యాంగం విస్తృత, సరళీకృత స్ఫూర్తికి అపచారం చేసింది’ అన్న చంద్రచూడ్ మాటలను జస్టిస్ నాగరత్న విడిగా 130 పేజీల తీర్పులో ఉటంకించారు. ప్రభుత్వ ఆర్థిక విధానాల్లో మార్పు కారణంగా ఈ కోర్టు మాజీ న్యాయమూర్తులను రాజ్యాంగానికి ‘అపచారం’ చేశారని ముద్ర వేయరాదు జస్టిస్ నాగరత్న అన్నారు. ‘కృష్ణయ్యర్ సిద్ధాంతంపై ఆ వ్యాఖ్యలకు నా తీవ్ర అసమ్మతి తెలియజేయాలి. ఆ విమర్శ పరుషమైనది, దానిని నివారించి ఉండవలసింది’ అని జస్టిస్ ధులియా పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News