Tuesday, July 16, 2024

ఎకరాకు రూ.10వేలు

- Advertisement -
- Advertisement -

ఖమ్మం బ్యూరో: అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు రాష్ట్ర ము ఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు భరోసా నిచ్చారు. నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరానికి రూ.10వేల సాయాన్ని ప్రకటించారు. ఇప్పటివర కు అందిన ప్రాథమిక అంచనా మేరకు రాష్ట్రంలో 2.28లక్షల ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతినగా ఎకరానికి రూ.10వేల చొప్పున మొత్తం రూ.228 కోట్ల నిధులను గంటలో చేస్తామని ము ఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. రాష్ట్రంలో ఇటివల కురిసిన వడగండ్ల వర్షంతో దెబ్బతిన్న పంటలను ముఖ్యమంత్రి కెసిఆర్ గురువారం ఖమ్మం జిల్లాలో పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భం గా సిఎం ఏరియల్ సర్వే కూడా చేశారు. తొలుత ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రావినూతల, గా ర్లపాడు గ్రామాల్లో మధ్యాహ్నం పర్యటించి అక్కడ భారీగా దెబ్బతిన్న మొక్కజొన్న పంటను పరిశీలించి స్థానిక రైతులతో మాట్లాడారు.

అనంతరం రావినూతల గ్రామంలో హెలీప్యాడ్ వద్ద ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ముఖ్యమంత్రి మా ట్లాడుతూ ప్రకృతి విపత్తుల వల్ల దెబ్బతిన్న పంటలకు ఇన్‌పుట్ సబ్సిడీ కింద ఎకరానికి రూ.3333 చెల్లించేవిధంగా పాతకాలం నాటి జీవోలు ఉన్నాయని వాటిని మార్చుతూ ఏ పంట దెబ్బతిన్నా ఇకపై ఎకరానికి రూ.10వేల సాయాన్ని దేశంలో ఎక్కడ ఇవ్వని విధంగా తెలంగాణలో అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.దీనిని పంట నష్టపరిహారం అని కాకుండా రైతులకు సహాయ పునరావస చర్యలో భాగంగా ఈ సాయాన్ని అందిస్తామన్నారు. వాస్తవానికి రైతులకు ఇచ్చే దాన్ని నష్టపరిహారం అనరని.. సహాయ పునరావాస చర్యలు అని అంటారని సిఎం చెప్పారు.

గతంలో నిర్దేశించిన ఇన్‌పుట్ సబ్సిడీలు ఏ మూలకు సరిపోదన్నారు. గాలివాన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మొక్కజొన్న 1,29,446 ఎకరాల్లో, వరి 72,709, మామిడి 8,865, ఇతర పంటలు అన్ని కలిసి 17,238 ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి రైతు సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయని, లక్షల కోట్ల పెట్టుబడి పెట్టి సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేశామని,ఉచిత విద్యుత్, ఉచిత సాగునీరు అందిస్తున్నామని దీనివల్ల వ్యవసాయ రంగం ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుని రైతులు స్థిరపడే పరిస్థితికి వస్తున్నారని. అప్పుల నుంచి కూడా తేరుకుంటున్నారని“ ఆయన అన్నారు
వ్యవసాయం రంగంలో తెలంగాణ నెంబర్ వన్
వ్యవసాయం దండగ అని చెప్పే మూర్ఖులు ఇప్పటికీ చాలామంది ఉన్నారు. ఈ మాటలు చెప్పేవాళ్లలో ఆర్థికవేత్తలు కూడా ఉన్నారు. కానీ మేం గర్వంగా చెబుతున్నాం. ఇవాళ తెలంగాణ భారతదేశంలోనే నంబర్‌వన్‌గా ఉంది. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కంటే కూడా అత్యధికంగా తలసరి ఆదాయం రూ. 3,05,000తో ఉంది.జీఎస్‌డీపీ పెరిగితేనే తలసరి ఆదాయం పెరుగుతుంది. జీఎస్‌డీపీ పెరుగుదలతో వ్యవసాయం పాత్రే అధికంగా ఉంది. కొన్ని సందర్భాల్లో ఈ వాటా 21 శాతం ఉంది. సరాసరిగా 16 శాతం వరకు ఉంది” అని సిఎం కెసిఆర్ తెలిపారు. అద్భుతమైన వ్యవసాయ రాష్ట్రంగా తెలంగాణ అభివృద్ధి చెందిందని.. ఇది మనకు చాలా గర్వకారణమని తెలిపారు.

రైతులు ఏవిధంగా నిరాశకు గురికావద్దు.. ప్రభుత్వం అండదండగా ఉంటుందని ఆయన అన్నారు. భారత దేశవ్యాప్తంగా 50లక్షల ఎకరాల్లో వరి పంటను సాగు చేస్తే ఒక తెలంగాణ రాష్ట్రంలోనే 56 లక్షల ఎకరాల్లో వరి పంటను సాగు చేస్తున్నారని, వ్యవసాయ రంగంతోపాటు అనేక అనుబంధ రంగాల్లో లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్నా ఈ రంగం ఇంకా అద్భుతమైన వ్యవసాయ రంగంగా రూపుదాల్చాల్సిన అవసరం ఉందని ఈ సందర్బంగా ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.

దేశంలో ఎక్కడ లేనివిధంగా ఎకరానికి రూ.10వేల పంట సాయం
తెలంగాణ ప్రభుత్వం ఉచిత కరెంట్, ఉచిత నీళ్లు, వాటర్ సెస్ బకాయి రద్దు చేసి రైతులను ఆదుకోవడం వల్ల వ్యవసాయం ఇప్పుడిప్పుడే బాగుపడుతుంది.ఆ స్థితిని దెబ్బతీయనివ్వకూడదు కాబట్టి వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం కానివ్వం. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు నిరాశపడొద్దు. ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుంది. నష్టపరిహారం అనేది ప్రపంచంలో ఎవరూ ఇయ్యలేరు. రైతులు మళ్లీ పుంజుకుని, వ్యవసాయం చేసేందుకు వీలుగా సహాయసహకారాలు అందించాలి. అందుకే ఎకరానికి 10వేలు ప్రకటిస్తున్నా. వెంటనే వీటిని అందజేస్తాం”అని సి ఎం ప్రకటించారు. ఎక్కడ లేనివిధంగా దేశంలోనే మొదటిసారిగా ఒక తెలగాణ రాష్ట్రంలోనే పంట సాయంగా ఎకరానికి రూ.10వేలు అందించబోతున్నామని ఆయన స్పష్టం చేశారు.
పంట పరిహారం కౌలు రైతులకే అందేవిధంగా చర్యలు
స్థానిక మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్థానిక ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు కౌలు రైతులను కూడా ఆదుకుంటాం. ఈ డబ్బును నేరుగా రైతులకు ఇవ్వకుండా.. ప్రతి రైతుతో పాటు కౌలు రైతులను కూడా పిలిపించి ఆదుకునేలా ఆదేశాలిస్తాం. పంటకు పెట్టుబడి పెట్టింది కౌలు రైతులే కాబట్టి నేరుగా వాళ్లకే న్యాయం జరిగేలా చూస్తాం. ఈ సెగ్మెంట్ రైతులకు న్యాయ జరిగేలా జిల్లా కలెక్టర్‌కు ప్రత్యేకమైన అదేశాలను జారీ చేస్తాం అని సిఎం అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని, జరిగిన నష్టానికి రైతులు ఏ మాత్రం చింతించకుండా.. రబ్బర్ బంతి తిరిగొచ్చినట్లుగా.. భవిష్యత్తులో ఉన్నతమైన పంటలను పండించే ఆలోచనతో రైతులు ముందుకు పోవాలి.

ఎట్టిపరిస్థితుల్లో ధైర్యాన్ని వీడొద్దు” అని ముఖ్యమంత్రి కెసిఆర్ రైతుల్లో భరోసా నింపారు. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రాజ్యసభ సభ్యడు జోగినేపల్లి సంతోష్ కుమార్, వద్దిరాజు రవిచంద్ర, ఎంఎల్‌సిలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, తాతా మధు, ఎంఎవఎలు సండ్ర వెంకటవీరయ్య, కందాళ ఉపేందర్ రెడ్డి, రాములు నాయక్, జడ్‌పి చైర్మన్ లింగాల కమల్ రాజు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, రాష్ట్ర సిపిఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, మాజీ శాసన సభ్యులు డాక్టర్ చంద్రావతి, మదన్‌లాల్, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతకుమారి, రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితాసబర్వాల్, జిల్లా కలెక్టర్ గౌతమ్,

అదనపు కలెక్టర్లు మధుసూదన్, మొగిలి స్నేహలత, ట్రైనీ కలెక్టర్ గుప్త, ఖమ్మం మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురబీ, రైతు బంధు జిల్లా కో ఆర్డినేటర్ నల్లమల్ల వెంకటేశ్వరరావు, వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ విజయనిర్మల తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు హెలిప్యాడ్ వద్ద ఏర్పాటు చేసిన పంట నష్టంపై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను సిఎం తిలకించారు. ఈ సందర్భంగా హెలిప్యాడ్ వద్ద మంత్రులు, ఎంపిలు, ఎంఎల్‌ఎలు, అధికారులు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News