Wednesday, March 22, 2023

కాళేశ్వరంతో ఎడారిగా మారిన నిజాంసాగర్ కు జీవం పోశాం: కెసిఆర్

- Advertisement -

కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎడారిగా మారిన నిజాంసాగర్ ఆయకట్టుకు జీవం పోశాం
గోదావరి జలాలను పల్లెలకు తరలిస్తున్నాం
సమైక్య రాష్ట్రంలో సింగూరు నీళ్లను కోల్పోయాం
సమైక్య పాలనలో సాగు నీటి ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి….
తిమ్మాపూర్‌లోని శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవంలో సిఎం కెసిఆర్
హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎడారిగా మారిన నిజాంసాగర్ ఆయకట్టుకు జీవం పోశామని సిఎం కెసిఆర్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును విమర్శించే వారి నోళ్లు మూయించే విధంగా వేసవిలోనూ మత్తడిపారే విధంగా గోదావరి జలాలను పల్లెలకు తరలిస్తున్నామని ముఖ్యమంత్రి కెసిఆర్ సగర్వంగా చెప్పారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం తిమ్మాపూర్‌లోని శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవంలో సిఎం కెసిఆర్ బుధవారం పాల్గొన్నారు. అంతకుముందు బాన్సువాడకు చేరుకున్న ముఖ్యమంత్రి దంపతులకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఘనస్వాగతం పలకగా, ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో వారికి స్వాగతం పలికారు.

పోచారం, సిఎం కెసిఆర్ దంపతులను పట్టువస్త్రాలతో సన్మానించారు. దేవాలయం తరఫున సిఎం కెసిఆర్‌కు జ్ఞాపికను పోచారం అందచేశారు. ఆ తర్వాత సిఎం కెసిఆర్ దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో సిఎం మొక్కనాటారు. ఈ సందర్భంగా సిఎం సతీమణి శోభ, దాతల సహకారంతో స్వామివారి కోసం తయారు చేయించిన 2 కిలోల బంగారు కిరీటాన్ని సిఎం కెసిఆర్ చేతుల మీదుగా స్వామివారికి సమర్పించారు. అనంతరం సిఎం దంపతులను వేదపండితులు ఆశీర్వదించారు. అనంతరం అదే గ్రామంలో ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో కెసిఆర్ పాల్గొని మాట్లాడారు. సభకు వెళ్లేముందు స్పీకర్ ఆహ్వానం మేరకు మధ్యాహ్న భోజన ఆతిధ్యాన్ని సిఎం స్వీకరించారు.

సింగూరు నీటి కోసం రైతుల ఉద్యమం
ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో మనం సింగూరు నీళ్లు కోల్పోయామని సిఎం కెసిఆర్ తెలిపారు. సమైక్య పాలనలో సాగు నీటి ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయని, సింగూరు నీటి కోసం రైతులు ఉద్యమించారని ఆయన తెలిపారు. సింగూరుపై ఆధారపడిన ఘన్‌పూర్ ఆయకట్టుకు కూడా గతంలో నీళ్లివ్వకపోవడం దారుణ సమస్యగా తాను భావించానని కెసిఆర్ తెలిపారు. గతంలో అలాంటి సమస్యలను చాలా చూశానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటి ముఖ్యమంత్రులు, పెద్దలతో చాలాసార్లు ఈ సమస్య పరిష్కారం కోసం మాట్లాడినా వారు పట్టించుకోక పోగా హేళన చేశారన్నారు.

నిజామాబాద్‌లో పంటలు ఎండినా…
నాడు ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఇతర ఎమ్మెల్యేలతో కలిసి నిజామాబాద్ కలెక్టరేట్ దగ్గర నిరాహార దీక్ష చేపట్టినప్పడు అప్పటి స్థితిగతులను గురించి తెలుసుకోవ డానికి తాను ఇక్కడికి వచ్చానని కెసిఆర్ తెలిపారు. తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నప్పుడు మంజీరానదిపై నిజాంసాగర్‌కు అనుబంధంగా దేవునూరు ప్రాజెక్టును 50 టిఎంసిల సామర్థ్యంతో తలపెట్టారని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాని సామర్థ్యాన్ని 30 టింఎసిలకు కుదించి సింగూరు ప్రాజెక్టును కట్టారని, నాడు మెదక్ -నిజామాబాద్ సరిహద్దులో ఉన్న సింగూరు ప్రాజెక్టు శంకుస్థాపనకు ఈ ప్రాజెక్టుతో తమకే ఎక్కువ ప్రయోజనం కలుగుతుందన్న తలంపుతో నిజామాబాద్ ప్రజలే ఎక్కువగా తరలి వచ్చారని కెసిఆర్ తెలిపారు. నాడు ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలకులు సింగూరు నుంచి హైదరాబాద్‌కు మంచినీళ్లు అందించే పేరుతో నిజామాబాద్‌లో పంటలు ఎండినా సాగునీరు అందించలేదని కెసిఆర్ వాపోయారు. ప్రతి పంటకు ఇక్కడి ఎమ్మెల్యేలు యుద్ధం చేసేవాళ్లని కెసిఆర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News