Friday, April 26, 2024

కాళేశ్వరం సాకారంతో..నిజాంసాగర్ నిండుకుండ

- Advertisement -
- Advertisement -

కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎడారిగా మారిన నిజాంసాగర్ ఆయకట్టుకు జీవం పోశామని సిఎం కెసిఆర్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును విమర్శించే వారి నోళ్లు మూయించే విధంగా వేసవిలోనూ మత్తడిపారే విధంగా గోదావరి జలాలను పల్లెలకు తరలిస్తున్నామని ముఖ్యమంత్రి కెసిఆర్ సగర్వంగా చెప్పారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం తిమ్మాపూర్‌లోని శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవంలో సిఎం కెసిఆర్ బుధవారం పాల్గొన్నారు. అంతకుముందు బాన్సువాడకు చేరుకున్న ముఖ్యమంత్రి దంపతులకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఘనస్వాగతం పలకగా, ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో వారికి స్వాగతం పలికారు.

పోచారం, సిఎం కెసిఆర్ దంపతులను పట్టువస్త్రాలతో సన్మానించారు. దేవాలయం తరఫున సిఎం కెసిఆర్‌కు జ్ఞాపికను పోచారం అందచేశారు. ఆ తర్వాత సిఎం కెసిఆర్ దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో సిఎం మొక్కనాటారు. ఈ సందర్భంగా సిఎం సతీమణి శోభ, దాతల సహకారంతో స్వామివారి కోసం తయారు చేయించిన 2 కిలోల బంగారు కిరీటాన్ని సిఎం కెసిఆర్ చేతుల మీదుగా స్వామివారికి సమర్పించారు. అనంతరం సిఎం దంపతులను వేదపండితులు ఆశీర్వదించారు. అనంతరం అదే గ్రామంలో ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో కెసిఆర్ పాల్గొని మాట్లాడారు. సభకు వెళ్లేముందు స్పీకర్ ఆహ్వానం మేరకు మధ్యాహ్న భోజన ఆతిధ్యాన్ని సిఎం స్వీకరించారు.
సింగూరు నీటి కోసం రైతుల ఉద్యమం
ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో మనం సింగూరు నీళ్లు కోల్పోయామని సిఎం కెసిఆర్ తెలిపారు. సమైక్య పాలనలో సాగు నీటి ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయని, సింగూరు నీటి కోసం రైతులు ఉద్యమించారని ఆయన తెలిపారు. సింగూరుపై ఆధారపడిన ఘన్‌పూర్ ఆయకట్టుకు కూడా గతంలో నీళ్లివ్వకపోవడం దారుణ సమస్యగా తాను భావించానని కెసిఆర్ తెలిపారు. గతంలో అలాంటి సమస్యలను చాలా చూశానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటి ముఖ్యమంత్రులు, పెద్దలతో చాలాసార్లు ఈ సమస్య పరిష్కారం కోసం మాట్లాడినా వారు పట్టించుకోక పోగా హేళన చేశారన్నారు.
నిజామాబాద్‌లో పంటలు ఎండినా…
నాడు ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఇతర ఎమ్మెల్యేలతో కలిసి నిజామాబాద్ కలెక్టరేట్ దగ్గర నిరాహార దీక్ష చేపట్టినప్పడు అప్పటి స్థితిగతులను గురించి తెలుసుకోవ డానికి తాను ఇక్కడికి వచ్చానని కెసిఆర్ తెలిపారు. తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నప్పుడు మంజీరానదిపై నిజాంసాగర్‌కు అనుబంధంగా దేవునూరు ప్రాజెక్టును 50 టిఎంసిల సామర్థ్యంతో తలపెట్టారని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాని సామర్థ్యాన్ని 30 టింఎసిలకు కుదించి సింగూరు ప్రాజెక్టును కట్టారని, నాడు మెదక్ -నిజామాబాద్ సరిహద్దులో ఉన్న సింగూరు ప్రాజెక్టు శంకుస్థాపనకు ఈ ప్రాజెక్టుతో తమకే ఎక్కువ ప్రయోజనం కలుగుతుందన్న తలంపుతో నిజామాబాద్ ప్రజలే ఎక్కువగా తరలి వచ్చారని కెసిఆర్ తెలిపారు. నాడు ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలకులు సింగూరు నుంచి హైదరాబాద్‌కు మంచినీళ్లు అందించే పేరుతో నిజామాబాద్‌లో పంటలు ఎండినా సాగునీరు అందించలేదని కెసిఆర్ వాపోయారు. ప్రతి పంటకు ఇక్కడి ఎమ్మెల్యేలు యుద్ధం చేసేవాళ్లని కెసిఆర్ తెలిపారు.
పోచారం మాటలను రామకృష్ణారావు గుర్తు చేస్తారు….
నాడు బోధన సబ్ కలెక్టర్‌గా ఉన్న నేటి ఫైనాన్స్ కార్యదర్శి రామకృష్ణా రావు బాన్సువాడ మీదుగా పోతుంటే బతికున్నప్పుడు మంచినీళ్లు ఇచ్చి గంజి పోసైనా సరే బతికియ్యండి, కానీ చచ్చిపోయాక మీరు బిర్యానీ పెట్టి లాభమేందని నాడు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్న మాటలను రామకృష్ణారావు నేటికీ గుర్తు చేస్తారని సిఎం కెసిఆర్ తెలిపారు. ఈ మట్టిలోనే పుట్టి, ఈ మట్టిలోనే పెరిగిన బిడ్డ పోచారం శ్రీనివాస్ రెడ్డి అని, అన్ని వర్గాల ప్రజలను సమభావంతో చూసే గొప్ప వ్యక్తిత్వం ఆయనదని, ఆత్మ గల వ్యక్తి పోచారం అని కెసిఆర్ ప్రశంసించారు. నాడు ఉప ఎన్నిక వచ్చినప్పుడు సభకు హాజరయ్యేందుకు పోతుంటే పోచారం శ్రీనివాస్ రెడ్డి గెలుస్తాడని బాన్సువాడకు 15 కిమీ. దూరంలో ఉన్న మక్కచేళ్లలో ఉన్న లంబాడా బిడ్డలు చెప్పారని, తన స్థాయిని కూడా విస్మరించి వినయ, విధేయలతో తన నియోజకవర్గం బాన్సువాడ ప్రజల అవసరాలను తీర్చేందుకు నిరంతరం శ్రమించే వ్యక్తి పోచారం శ్రీనివాస్ రెడ్డి అని ఆయన తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ఆషామాషీగా కట్టలేదు
తెలంగాణ ఉద్యమం చేపట్టడానికి ఉన్న కారణాల్లో నిజాంసాగర్ నీళ్లు కూడా ఒకటని ఆయన అన్నారు. తన మనస్సులో తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష పురుడు పోసుకోవటానికి నిజాంసాగర్‌కు పట్టిన దుస్థితి కూడా కారణమని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. సమైక్య పాలనలో ఇలాంటి ఎన్నో సమస్యలకు ఎంత ప్రయత్నించినా పరిష్కారం దొరకలేన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఆషామాషీగా కట్టలేదని, నిజాంసాగర్ ఎప్పటికీ ఎండిపోయే ప్రశ్నే రాదని కెసిఆర్ పేర్కొన్నారు.
పొలాలు, చెరువులతో ఆహ్లాదకరంగా…
స్వామివారి కరుణ బాన్సువాడ మీద, యావత్ తెలంగాణ ప్రజానీకం మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. వేంకటేశ్వర స్వామి గుడి అభివృద్ధి కోసం రూ.7 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు సిఎం ప్రకటించారు. ఆలయం కోసం ఎన్ని చేసినా తక్కువేనని, గుడి అభివృద్ధి కోసం ఇప్పటికే రూ.23 కోట్లు కేటాయించినట్లు పోచారం శ్రీనివాస్ చెప్పారని, దానికి అదనంగా నిధులను కేటాయిస్తున్నానని, ఈ నిధులతో గుడిని మరింత అభివృద్ధి చేయాలని సిఎం కెసిఆర్ సూచించారు. గతంలో తాను తిమ్మాపూర్‌కు వచ్చినప్పుడు వేంకటేశ్వస్వామి గుడి ఒక మాదిరిగా ఉండేదని, ఇప్పుడు గుడిచుట్టూ పొలాలు, చెరువుతో ఆహ్లాదకరంగా మారిందని ఆయన పేర్కొన్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డిగారు తన మిత్రులతో కలిసి ఈ సత్కారాన్ని పూర్తి చేశారని వారు కోరుకున్న దాని కంటే గొప్పగా ఈ పుణ్యక్షేత్రం రూపుదిద్దుకుందని కెసిఆర్ ప్రశంసించారు. భగవంతుడు ఆయన సేవ మనతో చేయించుకుంటాడని, మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోసెస్ అని చెప్పినట్లు భగవంతునికి శ్రీనివాస్ రెడ్డి మీద, బాన్సువాడ మీద దయ కలిగింది కాబట్టే తనను కూడా పిలిపించుకొని సేవ చేయించుకున్నాడని, మనం చేసింది ఏమీ లేదని కెసిఆర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News