Tuesday, October 15, 2024

కోల్‌కతాలో కొనసాగుతున్న ప్రతిష్టంభన

- Advertisement -
- Advertisement -

వైద్యులు విధుల్లో తిరిగి చేరాలన్న సిఎం మమత
రాజీ ప్రసక్తి లేదన్న నిరసనకారులు
వైద్యుల నిరసన స్థలానికి హఠాత్తుగా వెళ్లిన మమతా బెనర్జీ
నిద్ర లేని రాత్రుళ్లు గడుపుతున్నానన్న సిఎం

కోల్‌కతా : కోల్‌కతాలోని ఆర్‌జి కర్ వైద్య కళాశాల, ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం ఘటనపై జూనియర్ డాక్టర్ల నిరసనతో ప్రతిష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారం వారి నిరసన ప్రదేశాన్ని ఆకస్మికంగా సందర్శించారు. వారి డిమాండ్లను పరిశీలిస్తానని, ఎవరైనా దోషులుగా తేలితే చర్య తీసుకుంటానని జూడాలకు సిఎం మమత హామీ ఇచ్చారు. సాల్ట్ లేక్‌లో స్వస్థ భవన్ వెలుపల ‘మాకు న్యాయం కావాలి’ అనే నినాదాల మధ్య నిరసనకారులైన డాక్టర్లను ఉద్దేశించి మమత ప్రసంగిస్తూ, వారిపై తాను ఎటువంటి చర్యలూ తీసుకోబోనని, ఎందుకంటే ప్రజాస్వామిక ఉద్యమం అణచివేతలో తనకు నమ్మకం లేదని స్పష్టం చేశారు.

‘బెంగాల్ ఉత్తర ప్రదేశ్ కాదు’ అని ఆమె అన్నారు. అయితే, ఆమె అక్కడి నుంచి నిష్క్రమించిన తరువాత నిరసనకారులైన డాక్టర్లు మాట్లాడుతూ, చర్చలు జరిగేంత వరకు తమ డిమాండ్లపై రాజీకి తాము సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. వారు ఆ విధంగా ప్రతిష్టంభన కొనసాగుతుందని సంకేతాలు వదిలారు. డిజిపి రాజీవ్ కుమార్ వెంట రాగా మమతా బెనర్జీ మధ్యాహ్నం సుమారు ఒంటి గంట ప్రాంతంలో సెక్టర్ 5లోని డాక్టర్ల నిరసన ప్రదేశాన్ని చేరుకుని, అక్కడివారిని ఆశ్చర్యంలో ముంచెత్తారు. వర్షాల మధ్య జూనియర్ డాక్టర్లు రోడ్టుపై ఆందోళన చేస్తున్నందున తాను నిద్ర లేని రాత్రుళ్లు గడుపుతున్నానని ఆమె చెప్పారు. ‘నేను ముఖ్యమంత్రిగా కాకుండా మీ దీదీ (అక్క)గా మిమ్మల్ని కలిసేందుకు వచ్చాను’ అని మమత తెలిపారు. ‘మీ డిమాండ్లను అధ్యయనం చేసి, ఎవరైనా దోషిగా తేలితే చర్య తీసుకుంటానని మీకు హామీ ఇస్తున్నా’ అని ఆమె చెప్పారు.

తిరిగి విధుల్లో చేరవలసిందిగా నిరసనకారులైన డాక్టర్లకు మమత విజ్ఞప్తి చేశారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల సంక్షేమ కమిటీలను తక్షణం రద్దు చేసినట్లు కూడా ఆమె ప్రకటించారు. ‘ఈ సంక్షోభం పరిష్కారానికి ఇది నా తుది ప్రయత్నం’ అని మమత చెప్పారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయం స్వస్థ భవన్ వెలుపల జూనియర్ డాక్టర్లు పలు కోర్కెలతో మంగళవారం నుంచి మకాం వేసి ఉన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో భద్రతను మెరుగుపరచడం, ఆర్‌జి కర్ వైద్య కళాశాల, ఆసుపత్రిలో డాక్టర్‌పై హత్యాచారం ఘటనకు సంబంధించి ఉన్నతాధికారులను తొలగించడం మొదలైనవి వారు కోరుతున్నారు. జూనియర్ డాక్టర్లు ఒక నెలకు పైగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనితో రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థ దెబ్బ తిన్నది. నిరసనల కారణంగా చికిత్స అందకపోవడంతో 29 మంది వ్యక్తులు మరణించారని ప్రభుత్వం వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News