Saturday, August 16, 2025

మీ పెట్టుబడులకు నాదీ భరోసా: సిఎం రేవంత్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

నేను కూడా మధ్యతరగతి నుంచే వచ్చా
తాను కూడా ఒక రియల్టర్‌నే.. అపోహలకు లొంగవద్దు
తెలివితేటలకు, చిత్తశుద్ధికి సంబంధం లేదు
ఈ రోజుల్లో భాష వచ్చిన వాళ్లు కూడా బాత్రూంలు కడుగుతున్నారు
భాషకు, చిత్తశుద్ధికి సంబంధం లేదు
రోజుకు 18 గంటలు పనిచేస్తున్నా
క్రెడాయ్ 2025 ప్రాపర్టీ షోలో సిఎం రేవంత్‌రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: మీ పెట్టుబడులకు నాదీ భరోసా అని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. తాను కూడా మధ్యతరగతి నుంచే వచ్చానని, తనకు కష్టనషాలు తెలుసనీ ఆయన తెలిపారు. తాను కూడా ఒక రియల్టర్‌నేనని కోకాపేట్‌లో ఒకప్పుడు రూ.8 లక్షలకు ఎకరం కొన్నానని, ఇప్పుడు ఒక ఎకరం రూ.100 కోట్లు అయ్యిందని ఆయన తెలిపారు. శుక్రవారం హైటెక్స్ లో క్రెడాయ్ 2025 ప్రాపర్టీ షోకు సిఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రాపర్టీ షోను ఆయన ప్రారంభించి, స్టాల్స్ ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజోపయోగా పాలసీని తీసుకురావడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆయన పేర్కొన్నారు. అపోహలకు లొంగవద్దని, పార్టీల మధ్య విమర్శలు సహజమని ఆయన తెలిపారు. తెలివితేటలకు, చిత్తశుద్ధికి సంబంధం లేదన్నారు. ఈ రోజుల్లో భాష వచ్చిన వాడు కూడా బాత్రూంలు కడుగుతున్నారని, భాషకు, చిత్తశుద్ధికి సంబంధం లేదని సిఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. రోజుకు 18 గంటలు పనిచేస్తున్నానని ఆయన తెలిపారు. కాలుష్యరహిత నగరంగా ఫ్యూచర్‌సిటీ నిర్మాణం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

ఫ్యూచర్ సిటీ అంటే ఫోర్ బ్రదర్ సిటీ అని కొందరు ఆరోపణలు
భూమి అనేది సెంటిమెంట్, దానిని ఎంత ముందుకు తీసుకుపోతే అంత మంచిదని ఆయన తెలిపారు. అనుమతులతో పాటు లాభాలు చూపించే బాధ్యత తనదని, ఇక్కడ పెట్టుబడులు పెట్టి సమాజానికి ఉపయోగపడాలని క్రెడాయ్ ప్రతినిధులను సిఎం రేవంత్‌రెడ్డి కోరారు. అపోహలు సృష్టించి అభివృద్ధిని అడ్డుకోవాలని కొందరు చూస్తున్నారని క్రెడాయ్ ద్వారా వాటిని పటాపంచలు చేస్తామని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని సిఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సరైన ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామని, కానీ కొందరు అపోహలు సృష్టించి అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని సిఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారినప్పుడు అనుమానాలు, అపోహలు సర్వ సాధారణమని ఆయన అన్నారు. ఫ్యూచర్ సిటీ అంటే ఫోర్ బ్రదర్ సిటీ అని కొందరు ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి రెండు రకాలుగా ఉంటుందని, పాలసీ మ్యాటర్స్, డెవలప్‌మెంట్, నూతన నిర్మాణాలు, పారదర్శకమైన విధానాలు, ప్రజలకు అందుబాటులో ఉండాలన్న తపనతోనే తాము ముందుకు సాగుతున్నట్టు ఆయన తెలిపారు. పెట్టుబడులను ఆకర్షించినప్పుడే అభివృద్ధి సాధ్యం అవుతుందని, కులీకుతుబ్ షాల నుంచి వైఎస్ వరకు ఎందరో అభివృద్ధి సాధించారని, వారందరి కృషి వల్లనే మనం ముందుకు సాగుతున్నామన్నారు.

వారి మాటలు నమ్మవద్దు, నష్ట పోవద్దు….
నగరంలో హైటెక్స్ కు పునాది వేసింది రాజీవ్ గాంధీ, నేదురుమల్లి జనార్ధన్ రెడ్డిలని, దానిని కొనసాగించింది చంద్రబాబు నాయుడు అని సిఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధినే కోరుకుంటుందని, పెట్టుబడులను ఆకర్షించేందుకు, అన్ని రంగాలకు లాభాలు వచ్చేందుకు కృషి చేస్తామని, అది మా ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. పొలిటికల్ పార్టీలకు సొంత ఎజెండా ఉంటుందని, రాజకీయాల్లో ఒకే కుర్చీ కోసం పోటీ ఉండడం సహజమేనని, అది కుటుంబం అయినా కులం అయినా ఏదైనా ఒకటేనని ఆయన అన్నారు. రాజకీయ పార్టీలు సృష్టించే అపోహలుంటే వాటిని రియల్టర్లు, బిల్డర్లు తొలగించుకోవాలని ఇది తన విజ్ఞప్తిని, లేదంటే మీరే నష్ట పోతారని సిఎం రేవంత్ సూచించారు. విదేశీ పెట్టుబడులు ఆకర్షిస్తున్న తాము మిమ్మల్ని ఎందుకు ప్రోత్సహించమని ఆయన ప్రశ్నించారు. అపోహలు సృష్టించే వారి మాటలను నమ్మితే మీరు ఇలాగే ఉంటారని, వారి మాటలు నమ్మవద్దని, నష్ట పోకండని సిఎం రేవంత్ సలహా ఇచ్చారు.

సిఎంగా ప్రతి ఒక్కరిని సంతోష పెట్టలేను
సిఎంగా ప్రతి ఒక్కరిని తాను సంతోష పెట్టలేనని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. తాను మధ్య తరగతి ఆలోచనలు ఉన్నవాడినని, తనది పెట్టుబడిదారి మనస్తత్వం కాదని ఆయన పేర్కొన్నారు. సగటు మధ్య తరగతి ఆలోచన ఉన్న సిఎంను అని, కొల్లగొట్టి విదేశాలకు తరలించాలన్న ఆలోచన ఉన్న సిఎంను కాదని ఆయన అన్నారు. గతంలో సూపర్ లగ్జరీ సదుపాయాలు పొందిన వారు ఇబ్బందులు పడితే తానేం చేయలేనని, ప్రజలకు ఉపయోగపడేది ఉంటే చెప్పాలని ఆయన సూచించారు. దానికోసం కృషి చేస్తానని, తనకు కొన్ని పరిమితులు ఉన్నాయన్న విషయం గుర్తు పెట్టుకోవాలని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. వైఎస్‌ఆర్ సిఎంగా తగిన సదుపాయాలు కల్పించి ఉండకపోతే ఇవాళ హైదరాబాద్ ఇలా ఉండేది కాదని, అభివృద్ధి చేస్తే కొంతమందికైనా లబ్ధి చేకూరుతుందని గుర్తుంచుకోవాలని సిఎం రేవంత్ రెడ్డి కోరారు.

మెట్రో విస్తరణ చేయకపోవడం వల్ల 10 ఏళ్లు వెనక్కి
కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి వల్లే మెట్రో వచ్చిందని, మెట్రో విస్తరణ చేయకపోవడం వల్ల 10 ఏళ్లు వెనక్కి పోయామని, గత ప్రభుత్వం మెట్రోను విస్తరించి ఉంటే ఇవాళ ట్రాఫిక్ జామ్‌లు తప్పేవని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మల్టీయుటీలిటీ ఉండేలా మెట్రో ఏర్పాట్లు ఉండాలని, మెట్రో రీ డిజైన్ చేస్తున్నామని ఆయన తెలిపారు. బిహెచ్‌ఈఎల్, పఠాన్‌చెరు వరకు మెట్రో అవసరం ఉందని, మేడ్చల్, శామీర్‌పేట్ వరకు మెట్రో విస్తరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. లాస్ట్ మెయిల్ కనెక్టువిటీ అవసరం ఉందని సిఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. ప్రతిసారి సిఎం ఢిల్లీకి పోయారని అర్రాస్ పాడినట్లు లెక్కలు వేస్తున్నారని, అనుమతులు ఎక్కడ లభిస్తాయో అక్కడికే వెళ్లాలని ఆయన తెలిపారు. అలా కాదని తాను ఇంకో దగ్గరకు వెళితే అనుమతులు ఎలా వస్తాయని సిఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.

ఢిల్లీలో సిఎంకు బంగ్లాను ఫాంహౌస్ లాగా వాడుకోవాలా..?
ఢిల్లీలో సిఎంకు బంగ్లా ఎందుకు ఇచ్చారు..? దానిని ఫాంహౌస్‌లాగా వాడుకోవాలని ఇవ్వలేదని, అనుమతుల విషయంలో ఢిల్లీకి వచ్చిన ప్రతిసారి అక్కడ ఉండాలని ఇచ్చారని సిఎం రేవంత్ పేర్కొన్నారు. గత ప్రభుత్వం కాళేశ్వరం కోసం లక్షల కోట్ల అప్పులు తెచ్చిందని, 12 సంవత్సరాల పరిమితికి అధిక ఇంట్రెస్ట్‌కు అప్పులు తెచ్చి కుప్పలు పెట్టిందని ఆయన ఆరోపించారు. ఇప్పటి వరకు రూ.32 వేల కోట్ల అప్పులు కట్టామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. రూపాయి పెట్టుబడితే 42 పైసలు వస్తున్నాయని, లాభాలు పక్కన పెడితే గతంలో తెచ్చిన అప్పులకు మిత్తులు కడుతున్నామని ఆయన వాపోయారు.
రూ. 26వేల కోట్లను 35 సంవత్సరాలకు చెల్లించేలా కేంద్రాన్ని ఒప్పించామని, అభివృద్ధి కోసం రూ.2 లక్షల కోట్లు కావాలని ప్రధానిని అడిగామని సిఎం తెలిపారు.

తెలంగాణలో ఒకే ఒక ఎయిర్‌పోర్ట్ ఉంది
ఆంధ్రప్రదేశ్ లో 6,7 ఎయిర్ పోర్ట్ లు ఉన్నాయని, మహారాష్ట్రలో 40 ఎయిర్ పోర్ట్‌లు ఉన్నాయని, కానీ, తెలంగాణలో మాత్రం ఒకే ఒక ఎయిర్ పోర్ట్ ఉందని, 80వేల పుస్తకాలను చదివిన మేధావులకు ఈ విషయం తెలియదా అని సిఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేంద్రాన్ని ఒప్పించి ఆదిలాబాద్, వరంగల్‌లో రెండు కొత్త ఎయిర్ పోర్టులు తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందని ఆయన అన్నారు. మేధావులు ఎయిర్ పోర్ట్‌లు వస్తే మరింత అభివృద్ధి సాధ్యం అవుతుందని దీంతోపాటు రీజనల్ రింగ్‌రోడ్డును తీసుకువస్తున్నామన్నారు. ఔటర్ రింగ్ రోడ్డుకు రీజనల్ రింగ్ రోడ్డుకు కనెక్టివ్ రేడియల్ రోడ్లు వేస్తున్నామని, అలాగే శాటిలైట్ సిటీ ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సిఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. కృష్ణా, గోదావరి నదుల నుంచి సమస్య వస్తే ప్రత్యామ్నాయంగా రింగ్ బండ్ కడుతున్నామన్నారు. పోర్ట్‌లకు అనుసంధానం కోసం 8 లైన్ ఎక్స్‌ప్రెస్ హైవేల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశామని సిఎం రేవంత్ తెలిపారు. విజన్ 2047తో ముందుకు వెళ్తున్నామని అన్నారు.

సోషల్ మీడియాలో రియల్టర్‌లే తప్పుడు ప్రచారం
అర్బన్, సెమీ అర్బన్, రూరల్ ఇలా అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం తీవ్రంగా కృషి చేస్తున్నామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ మ్యాప్ ముందు పెట్టుకుంటే అన్నీ అందులోనే కనిపిస్తాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. నాళాలు, చెరువులను మనమే ఆక్రమించామని, అవి ఉండే చోటుకి మనం వెళ్తున్నామని, అవి మన దగ్గరకు వచ్చాయని ఆయన అన్నారు. అందుకే హైడ్రా తీసుకువచ్చామని హైడ్రా వల్ల కొంతమందికి నష్టం వస్తుందని, యుద్ధం వస్తే సైనికులు మాత్రమే కాదు అమాయకులు కూడా చనిపోవడం సర్వ సాధారణమని సిఎం రేవంత్ వివరించారు. నాలాలను అభివృద్ధి చేస్తుంటే డబ్బులు పెట్టి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దానిని మీరు ఫార్వర్డ్ చేస్తున్నారని, దానివల్ల మీకే నష్టం అని రియల్టర్లను ఉద్దేశించి సిఎం వ్యాఖ్యానించారు. బతుకమ్మ కుంట, సున్నం చెరువు అభివృద్ధి వల్ల ప్రజలకే లాభమని, మన నగరాన్ని గొప్ప నగరంగా మారుస్తామని సిఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

సమాజం కోసం సంపాదించింది ఎవరూ తీసుకుపోలేరు
ఎవరు ఏది కట్టినా అది అక్కడే ఉంటుందని, సంపాదించింది ఎవరైనా తీసుకుపోవచ్చు, కానీ, సమాజం కోసం సంపాదించింది ఎవరూ తీసుకుపోరని సిఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. తాను చేసిన మంచి పనులు 1,000 ఏళ్ల కాలం అందరికీ గుర్తు ఉండాలని, గ్రామీణ నేపథ్యం, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన తనకు ఇక్కడి పరిస్థితులు తెలుసని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, క్రెడాయ్ నేషనల్ అధ్యక్షుడు రాంరెడ్డి, హైదరాబాద్ క్రెడాయ్ అధ్యక్షుడు జయదీప్ రెడ్డి, అనిల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రెడ్డి, జగన్నాథ రావు, క్రాంతికిరణ్ రెడ్డి, కుర్రా శ్రీనాథ్, మనోజ్‌కుమార్ అగర్వాల్, వై.రవి ప్రసాద్, నితిష్‌రెడ్డి, సంజయ్‌కుమార్, శ్రీరామ్ ముసునూర్, ఇతర క్రెడాయ్ ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News