Tuesday, December 10, 2024

కులగణనతోనే సామాజిక న్యాయం 3.0

- Advertisement -
- Advertisement -

రాజ్యాంగ రక్షణ ఉద్యమం రాహుల్ గాంధీకి పరిమితం కాదు
పదేళ్లుగా దేశంలో రాజ్యాంగం ప్రమాదంలో ఉంది
రాజ్యాంగ రక్షణకు రాహుల్ గాంధీ దేశ వ్యాప్త ఉద్యమం చేపట్టారు
దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల్లో మోడీని ప్రజలు ఓడిస్తున్నారు
వయనాడ్, నాందేడ్ లోక్‌సభ ఉప ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శం
గాంధీ పరివార్ రాజ్యాంగాన్ని కాపాడుతుంటే
మోడీ పరివార్ రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేస్తోంది
ఢిల్లీలో సంవిధాన్ రక్షక్ అభియాన్ కార్యక్రమంలో సిఎం రేవంత్‌రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: రాజ్యాంగ రక్షణ ఉద్యమం కేవలం రాహుల్ గాంధీకి పరిమితమైన అంశంగా అనుకోవద్దని, మనమంతా అందులో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రస్తుత పోరాటం రాజ్యాంగ రక్షకులు రాజ్యాంగ శత్రువుల మధ్యనే ఉందని గుర్తుంచుకోవాలన్నారు. మహాత్మాగాంధీ పరివార్ రాజ్యంగ రక్షణకు పూనుకుంటే మోడీజీ పరివార్ అంటే సంఘ్ పరివార్ రాజ్యాంగాని మార్చాలని చూస్తున్నారని సిఎం విమర్శించారు. జాతీయ రాజ్యాంగ దినోత్సవం (నవంబర్ 26) పురస్కరించుకొని ఢిల్లీలోని తలకటొరా స్టేడియంలో ఏఐసిసి ఆధ్వర్యంలో సంవిధాన్ రక్షక్ అభియాన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే, లోక్ సభ పక్ష నేత రాహుల్ గాంధీ, సిఎం రేవంత్ రెడ్డి తదితర కీలక నేతలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సిఎం రేవంత్ మాట్లాడుతూ పదేళ్లుగా దేశంలో రాజ్యాంగం ప్రమాదంలో ఉందని, రాజ్యాంగ రక్షణకు రాహుల్ గాంధీ దేశ వ్యాప్త ఉద్యమం చేపట్టారన్నారు. రాహుల్ చేపపట్టిన ఉద్యమంలో ప్రజలు భాగస్వాము లైనందునే మోడీ 400 వందల సీట్లు అడిగితే ప్రజలు కేవలం 240 సీట్లకు పరిమితం చేశారని సిఎం అన్నారు. దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల్లో మోడీని ప్రజలు ఓడిస్తున్నారని, వయనాడ్, నాందేడ్ లోక్‌సభ ఉప ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మహారాష్ట్రలో బిజెపి కూటమి గెలిస్తే, జార్ఖండ్లో కాంగ్రెస్ కూటమి గెలిచిందని ఆయన తెలిపారు.

రాష్ట్రంలో కులగణన సర్వే 92 శాతం పూర్తి
అన్ని వర్గాలకు సామాజిక న్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యమని, రాహుల్ గాంధీ నాయకత్వంలో అందరికి సామాజిక న్యాయం జరుగుతోందని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. దేశంలో రాజ్యాంగ పవిత్రతను కాపాడింది కాంగ్రెస్ పార్టీనేనని ఆయన తెలిపారు. గాంధీ పరివార్ రాజ్యాంగాన్ని కాపాడే ప్రయత్నం చేస్తుంటే మోడీ పరివార్ రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ పరిరక్షణలో రాహుల్ గాంధీ వెంట దేశ ప్రజలంతా ఉన్నారన్నారు. ప్రతి ఒక్క వర్గానికి కాంగ్రెస్ న్యాయం చేసిందని ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు కాపాడింది కాంగ్రెస్సే అని ఆయన వ్యాఖ్యానించారు. కుల గణనతోనే ప్రజల సామాజిక, ఆర్థిక పరిస్థితులు తెలుస్తాయని, ఇందుకోసమే దేశవ్యాప్తంగా కుల గుణన కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆయన తెలిపారు. దేశంలో సామాజిక న్యాయాన్ని అందించింది ఒక్క కాంగ్రెస్ పార్టీనేనని ఆయన అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట ప్రకారమే తెలంగాణలో కుల గణన చేపట్టామని కుల గణన సర్వే ఇప్పటి వరకు 92 శాతం పూర్తయ్యిందని ఆయన వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే జనగణన సర్వేలోనూ కులాల లెక్కలు తీయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

కుల సర్వే పూర్తి కాగానే మూడో మహా యుద్ధాన్ని
ప్రధానమంత్రి నెహ్రూ నుంచి ఇందిరా గాంధీ వరకు ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు, బ్యాంకుల జాతీయీకరణ వంటి కార్యక్రమాలతో సామాజిక న్యాయం మొదటి దశ సాధించామన్నారు. ఇక రాజీవ్ గాంధీ హయాంలో 18 ఏళ్లకే ఓటు హక్కు, మండల్ కమిషన్ నివేదిక వంటి కార్యక్ర మాలతో సామాజిక న్యాయం 2.0 పూర్తయిందన్నారు. ప్రస్తుతం సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీల ఆధ్వర్యంలో కుల గణ నకు సామాజిక న్యాయం 3.0 ప్రారంభమైందని ఆయన తెలిపారు. సామాజిక న్యాయం కోసం రాహుల్ గాంధీ మహా యుద్ధం ప్రకటించారని ఆయన బాటలో నడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సామాజిక, ఆర్థిక, కుల సర్వే మొదలుపెట్టిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో కుల సర్వే పూర్తి కాగానే తాము సామాజిక న్యాయం మూడో మహా యుద్ధాన్ని ముందుకు తీసుకెళతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. జితని భాగి దారి, ఉతని హిస్సే దారిని కచ్చితంగా అమలు కావాలని ఆయన అభిప్రాయపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News