Tuesday, October 15, 2024

కష్ట పడ్డోళ్లకే పదవులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఫ్యామిలీ హెల్త్ ప్రొఫైల్ డిజిటల్ కార్డులు ఇవ్వబోతున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అలాగే రాష్ట్రంలో ఇ క నుంచి ఎక్కడినుంచైనా రేషన్ తీసుకునే అవకాశం కల్పిస్తామన్నారు. మాదాపూర్‌లో ఆదివారం సాయంత్రం ట్రైడెంట్ హోటల్లో జరిగిన కాంగ్రెస్ శాసనసభా పక్షం సమావేశాన్ని ఉద్దేశించి సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం 27 రోజులలో రూ.18వేల కోట్ల రుణమాఫీ చేయలేదని సిఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. రైతును రుణ విముక్తి చేయడమే తమ ప్రభుత్వ లక్షమన్నారు. అయితే అధికారం కోల్పోయిన అసహనంతో ప్రతిపక్షం ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని సిఎం రేవంత్‌రెడ్డి దుయ్యబట్టారు. బీసీ కులగణన చేయాలన్నది రాహుల్‌గాంధీ బలమైన ఆలోచన అని ఆయన ఆలోచన మేరకే బీసీ కమిషన్ చైర్మన్, సభ్యులను నియమించామన్నారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలంటే కచ్చితంగా జనాభా సేకరణ చేయాల్సిందేని రేవంత్‌రెడ్డి అన్నారు. ఎస్సీ వర్గీకరణ అమలుపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నాయకత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించామన్నారు. సుప్రీంకోర్టు తీర్పును అధ్యయనం చేసి ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా తన ఆధ్వర్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సా ధించి అధికారంలోకి వచ్చామని అన్నారు.

లోక్‌సభ ఎన్నికల్లో కూడా మంచి ఫలితాలు సాధించామని అన్నారు. గడిచిన 9 నెలల్లో ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా పని చేస్తున్నానని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఇక నుంచి ఇంచార్జీ మంత్రులు వారానికి రెండు రోజులు జిల్లాల్లో పర్యటించాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వ కార్యక్రమాలను పార్టీ నాయకత్వం ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం పిలుపునిచ్చారు. పార్టీ, ప్రభుత్వం సమన్వయంతో ముందుకెళ్లానని అన్నారు. ప్రజల్లో ఉన్న వారికే డీసీసీ అధ్యక్ష పదవులు ఇవ్వాలని పీసీసీ అధ్యక్షునికి సూచిస్తున్నట్టు పేర్కొన్నారు. పార్టీ అనుబంధ విభాగాలలో పని చేస్తున్నవారికే నామినేటెడ్ పదవులు ఇచ్చామన్నారు. పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు కష్టపడి పని చేసిన వారికే పదవులు ఇవ్వడం జరిగిందన్నారు. కష్టపడి పని చేసే వారికి భవిష్యత్‌లో కూడా అవకాశాలు కల్పిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. పీసీసీ అధ్యక్షునిగా మహేశ్‌కుమార్‌గౌడ్‌ను నియమపించడం పట్ల పార్టీ అగ్రనేతలు మల్లికార్జున్ ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలుపుతూ సీఎల్పీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఈ సందర్భంగా మహేష్‌కుమార్‌గౌడ్‌ను ఎమ్మెల్యేలు సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ఇంచార్జీ దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ కార్యదర్శులు విష్ణుదాసు, విశ్వనాథ్‌తో పాటు పార్టీ లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News