కమీషన్ల కోసమే ప్రాణహిత ప్రాజెక్టు ప్రాంతాన్ని మార్చారు
సిడబ్లుసి లేఖను పట్టించుకోలేదు
రిటైర్డ్ ఇంజినీర్ల నివేదిక అనుకూలంగా లేదని తొక్కి పెట్టారు
నిజాం ప్రభువు కన్నా శ్రీమంతుడు కావాలన్నదే కెసిఆర్ కోరిక
హరీశ్‌రావు తప్పు చేశారని ఘోష్ నివేదిక చెప్పింది
శిక్షించాల్సి వస్తే..వాళ్లను ఉరి తీయాలి: అసెంబ్లీలో సిఎం రేవంత్‌ర వ్యాఖ్యలు
గూగుల్ మ్యాప్‌లో చూసి ప్రాజెక్టు కట్టారు : పొంగులేటి
మన తెలంగాణ/హైదరాబాద్ : కమీషన్ల కోసమే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ప్రాంతాన్ని మార్చారని, ప్రాణహిత, చేవెళ్లకు అన్ని అనుమతులున్నా ప్రాజెక్టు ని ర్మాణ ప్రాంతాన్ని ఉద్దేశపూర్వకంగానే మా ర్చారని సిఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. త ప్పులను బయటపెట్టినందుకే బిఆర్‌ఎస్ నా యకులు జస్టిష్ ఘోష్ కమిషన్ నివేదికను త ప్పుబడుతున్నారని సిఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బిఆర్‌ఎస్ నాయకులు నిజాయితీపరులైతే ఏ విచారణ కావాలో చెప్పాలని సిట్, సి ఐడి, సిబిఐ ఇందులో మీకు ఏ విచారణ కావాలో తే ల్చుకోవాలని హరీష్ రావుకు సిఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కాళేశ్వరంపై జస్టిస్ పిసి ఘోష్ నివేదికపై ఆదివారం అసెంబ్లీలో వాడీ వేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా సిఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ప్రాణహిత, చేవెళ్లలో నీళ్లున్నాయని అప్పటి కేంద్రమంత్రి చెప్పారని, 205టిఎంసీల నీళ్లు ఉన్నాయని హైడ్రాలజీ క్లియరెన్స్ ఇచ్చిందని ఉమాభారతి లేఖ కూడా ఇచ్చారని, దానికి సంబంధించి హరీష్ రావు ఎండార్స్ చేసిన లేఖ ఇదిగో అంటూ సిఎం రేవంత్ రెడ్డి సభ ముందుంచారు. ప్రాణహితలో నీళ్లు ఉన్నాయని 2009లోనే సిడబ్లూసి లేఖ ఇచ్చిందని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రాణహిత ప్రాజెక్టు కట్టుకోవచ్చని 2009లో కేంద్ర ప్రభుత్వం చెప్పినా గత ప్రభుత్వం పట్టించుకోకుండా ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని మార్చిందని సిఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.
ధనాశ, దురాశతోనే లొకేషన్‌ను కెసిఆర్ మార్చారు
తెలంగాణ ప్రజల సొమ్ము రూ.లక్ష కోట్లను దోచుకునేందుకే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని సిఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ఆనాడు మహారాష్ట్రతో చర్చ జరిగింది కేవలం ప్రాజెక్టు ఎత్తు గురించే అని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. కావాలనే హరీష్ రావు పదే పదే తప్పుడు సమాచారం ఇస్తున్నారని సిఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. తుమ్మిడిహట్టి వద్ద నీళ్లు ఉన్నాయని చెప్పినా ఎందుకు వినలేదని బిఆర్‌ఎస్ నేతలను సిఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టుకు మహారాష్ట్ర అభ్యంతరం చెప్పలేదని, 148 మీటర్ల ఎత్తులో కట్టుకోమని మహారాష్ట్ర కూడా చెప్పిందని, అయినా వినకుండా ప్రాజెక్టు లొకేషన్‌ను మార్చారని సిఎం రేవంత్ తెలిపారు. కెసిఆర్‌కు ధనాశ, దురాశ కలగడం వల్లే లొకేషన్‌ను మార్చారని సిఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. మాజీ సిఎం కెసిఆర్ లక్ష కోట్లు కొల్లగొట్టాలని ప్రణాళిక వేసుకున్నారని సిఎం రేవంత్ అన్నారు. పొగతాగడం ఆరోగ్యానికి హానికరం అని రాసినట్లే ప్రాజెక్టు కడితే హానికరం, నిరుపయోగమని అధికారులు పదే పదే చెప్పారని, అయినా వినకుండా దోచుకోవడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టు కట్టారని సిఎం రేవంత్ అన్నారు. నిజాం ప్రభువు కంటే శ్రీమంతుడు కావాలన్నదే కెసిఆర్ కోరిక అని సిఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రాణహిత-చేవెళ్లలో నీళ్లు ఉన్నాయని అప్పటి కేంద్రమంత్రి ఉమా భారతి స్పష్టంగా చెప్పారని సిఎం రేవంత్ పేర్కొన్నారు.
హరీష్ రావు వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలి
అసంపూర్తి సమాచారంతో హరీష్ రావు తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టించాలని ప్రయత్నిస్తున్నారని సిఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ప్రాణహిత చేవెళ్లలో నీరు అందుబాటులో ఉంది, హైడ్రాలజీ అనుమతులు ఇస్తున్నామని ఆనాటి కేంద్ర మంత్రి ఉమా భారతి 24.-10.2014 న స్పష్టంగా చెప్పారని, 205 టిఎంసీల నీరు అందుబాటులో ఉందని కేంద్రం లెటర్ రాస్తే హరీష్ రావు మళ్లీ పరిశీలించాలని కేంద్రానికి లేఖ రాశారని సిఎం రేవంత్ ఆరోపించారు. పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికలో వాస్తవాలను బయటపెట్టారనే వారిపై విషం చిమ్ముతున్నారని, హరీష్ రావు తప్పు చేశారని నివేదికలోని పేజీ నెంబర్ 98లో స్పష్టంగా పొందుపరిచారని సిఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. దీనిపై విచారణకు సిబిఐ కావాలా, సిబి సిఐడిల విచారణ కావాలో చెప్పకుండా సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని సిఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసంపూర్తి సమాచారంతో తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిన హరీష్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని సిఎం సభను కోరారు. నిజాం కంటే ధనవంతుడు కావాలన్న దుర్బుద్ధితో కెసిఆర్ ప్రాజెక్టు రీడిజైన్ చేశారని, మేడిగడ్డ దగ్గర కట్టాలని కెసిఆర్, హరీష్‌రావులు ముందే నిర్ణయించుకున్నాక రిటైర్డ్ ఇంజనీర్లతో కమిటీని నియమించారని ఆయన తెలిపారు. రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ నివేదిక వారికి అనుకూలంగా లేదని ఆ నివేదికను తొక్కిపెట్టి వాళ్లు అనుకున్న చోట ప్రాజెక్టు కట్టారని సిఎం రేవంత్ ఆరోపించారు. తుమ్మిడిహట్టి దగ్గర ఇచ్చిన వార్నింగ్ క్లాజ్ ను మేడిగడ్డ విషయంలోనూ పేర్కొన్నారని, దీనికి శిక్షించాల్సి వస్తే వాళ్లని ఉరి తీయాలని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కాళేశ్వరం బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని సిఎం రేవంత్ స్పష్టం చేశారు. నివేదికలో పేర్కొన్న ఎవరినీ వదిలిపెట్టేది లేదన్నారు.