Friday, July 18, 2025

ఆయిల్ ఫామ్ సాగుతో రైతు భవిష్యత్తుకు భరోసా

- Advertisement -
- Advertisement -

 ఆయిల్ ఫామ్ సాగుతో తెలంగాణ పచ్చబడాలి
 రైతుల ఆదాయం పెరగాలి.. ఆనందంగా ఉండాలి..
 నర్మెటలో ఆగష్టు 15న ఆయిల్ ఫామ్ ప్యాక్టరీ ప్రారంభించనున్న సిఎం రేవంత్ రెడ్డి
 మెగా ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ కార్యక్రమంలో పాల్గోన్న మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, పొన్నం ప్రభాకర్

మన తెలంగాణ/కోహెడ: ఆయిల్ ఫామ్ సాగుతో రైతు భవిష్యత్తుకు భరోసా ఉంటుందని, ఆయిల్ పామ్ సాగుతో తెలంగాణ పచ్చబడాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నాగేశ్వర్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ శివారులోని ఏనుగు రామారావు వ్యవసాయ క్షేత్రంలో 50 ఎకరాల్లో “మేగా ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ డ్రైవ్‌” కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి, మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ప్రారంభించి.. ఆయిల్ ఫామ్ మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి తుమ్మల ప్రసంగించారు. తొలుత ఆయిల్ ఫామ్ సాగు చేసి ఆదాయం పొందుతున్న రైతులతో ముఖాముఖి నిర్వహించి.. రైతుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.

ప్రతి రైతు ఆదాయం వచ్చే పంటలపై దృష్టి సారించాలన్నారు. వర్షాలు ఉన్నా లేకున్నా, ఎండలు కొట్టినా కొట్టకున్న ఆయిల్ ఫామ్ సాగులో ఏలాంటి ఇబ్బందులు లేవన్నారు. ఒక ఎకరం వరి పొలానికి సరిపడే నీటితో.. 5 ఎకరాల ఆయిల్ ఫామ్ సాగు చేయచ్చని తెలిపారు. ఆయిల్ ఫామ్ సాగులో అంతరుపంటలు వేస్తే ఆదాయం సమకూరుతుందని వివరించారు. ఆయిల్ ఫామ్ సాగులో ఖమ్మం తర్వాత సిద్దిపేట జిల్లాలోనే అత్యధిక సాగు జరుగుతుందని చెప్పారు. ప్రజా పాలన ప్రభుత్వంలో 12 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేసేవిధంగా టార్గేట్ పెట్టుకున్నామని తెలిపారు. ఆగష్టు 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నర్మేటలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ప్రారంభించనున్నట్లు స్ఫష్టం చేశారు. ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్న రైతుల వ్యవసాయ క్షేత్రం నుంచి ఫ్యాక్టరీ వరకు దూరాన్ని లెక్కంచి ట్రాన్స్‌పోర్టు కిరాయిని సైతం ప్రభుత్వమే చెల్లించనున్నట్లు వెల్లడించారు. ఇతర దేశాల నుంచి వచ్చే ఆయిల్ ఉత్పత్తుల మీద సుంకం తగ్గించారని, దాని ప్రభావంతో రూ.2 వేలు ఆదాయం ప్రస్తుతం రైతుకు తగ్గిందని చెప్పారు.

ఇదేవిషయంపై దక్షిణ భారత మంత్రులను తీసుకొని ప్రధాని నరేంద్రమోడిని కలుస్తానని, రూ.25 వేలు క్వింటాల్‌కు ఇస్తే.. దేశానికి సరిపడా ఫామ్ ఆయిల్ ఉత్పత్తి చేస్తామని ప్రధానికి చెప్పనున్నట్లు మంత్రి నాగేశ్వర్‌రావు వివరించారు. త్వరలో హుస్నాబాద్ నియోజకవర్గంలో రిఫైన్డ్ ఆయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆయిల్ ఫామ్ కటింగ్‌పై శిక్షణ ఇవ్వాలని, కటింగ్ చేసే వారి జీతం కలెక్టర్ జీతం కంటే ఎక్కువ ఉంటుందని తెలిపారు. ఆయిల్ ఫామ్ సాగుతో రైతుల ఆదాయం పెరగాలని, ఆనందంగా జీవించాలని కోరుకున్నారు. వ్యవసాయంలో రైతులు నెంబర్ వన్‌గా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయిల్ ఫామ్ కార్పోరేషన్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి, హర్టికల్చర్ డైరెక్టర్ యాస్మిన్ బాషా, జిల్లా కలెక్టర్ హైమావతి, అదనపు కలెక్టర్ గరీమా అగర్వా, ఎఎంసి చైర్‌పర్సన్ బోయిని నిర్మల, వైస్ చైర్మన్ భీంరెడ్డి తిరుపతి రెడ్ది తదితరులున్నారు.

ఆయిల్ ఫామ్ సాగులో హుస్నాబాద్ ఆదర్శం కావాలి: మంత్రి పొన్నం 
ఆయిల్ ఫామ్ సాగులో హుస్నాబాద్ నియోజకవర్గం రాష్ట్రానికే ఆదర్శం కావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు. ఆయిల్ ఫామ్ సాగులో ఏలాంటి బెడద ఉండదని, అకాల వర్షాలకు నష్టం వాటిల్లదని తెలిపారు. 10 ఎకరాలు కలిగిన రైతు కనీసం 5 ఎకరాల్లో ఆయిల్ ఫామ్‌ను సాగు చేయాలని సూచించారు.

ఇటీవల గుజరాత్ వెళ్లినప్పుడు అమూల్ పాల ఉత్పత్తి ఫ్యాక్టరీని సందర్శించానని, మన దేశంలో పాల ఉత్పత్తిని పెంచడానికి వర్గీస్ కురియన్ కీలకపాత్ర పోషించడాని గుర్తు చేశారు. అదేవిధంగా మన రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ సాగులో పెంచడానికి మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు కీలకంగా వ్యవహరిస్తున్నారని మంత్రి పొన్నం వ్యాఖ్యానించారు. మంత్రి తుమ్మల 30 సంవత్సరాల నుంచి ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్నారని అపార అనుభవం ఉందని, ఆయిల్ ఫామ్ సాగులో కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నారని కొనియాడారు. మన దేశంలో ఆయిల్ ఫామ్ సాగు తక్కువ చేస్తుండటంతో.. ఆయిల్ ఉత్పత్తులు భారీ ఎత్తున దిగుమతి చేసుకుంటున్నామని చెప్పారు. రైతులు వరి సాగుతో పాటు, ఆయిల్ ఫామ్ సాగు వైపు మారాలని పిలుపునిచ్చారు. ఇక హుస్నాబాద్ నియోజకవర్గంలో ఒక గుంట భూమి కూడా బీడు ఉండద్దని రైతులకు సూచించారు. గౌరవెళ్లి ప్రాజెక్టు ద్వారా నీరు ఇచ్చే బాధ్యత తనదేనని స్ఫష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News