సంగారెడ్డి: పాశమైలారం బాధిత కుటుంబాలకు ఆర్థికంగా తక్షణ సాయం కల్పించాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సిగాచి ప్రమాదం దురదృష్టకరమని, అత్యంత విషాద ఘటన అని సానుభూతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తక్షణమే రూ.లక్ష, క్షతగాత్రులకు రూ.50 వేలు సాయం అందించాలన్నారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి నష్టపరిహారం ఇప్పిస్తామని, క్షతగాత్రుల వైద్య ఖర్చులు తామే భరిస్తామన్న ఫ్యాక్టరీ యాజమాన్యం పేర్కొందన్నారు. సిగాచి పరిశ్రమ ప్రమాద స్థలాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. అనంతరం ఆస్పత్రిలో రేవంత్ బాధితులను పరామర్శించారు. సిఎం వెంట మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. పాశమైలారంలో సిగాచిని పరిశీలించిన అనంతరం అధికారులతో సిఎం రేవంత్ సమీక్ష జరిపారు.
పరిశ్రమ అనుమతులు, భద్రతా ప్రమాణాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పరిశ్రమ బోర్డు సభ్యులు ఎవరా? అని అడిగి తెలుసుకున్నారు. పరిశ్రమను తనిఖీ చేశారా అని ఫ్యాక్టరీస్ డైరెక్టర్‌ను రేవంత్ ప్రశ్నించారు. తాజా ప్రమాదంపై నిపుణులతో విచారణ జరిపి పూర్తి నివేదిక ఇవ్వాలని సిఎం ఆదేశించారు. ఇప్పటికే తనిఖీ చేసిన అధికారులతో కాకుండా కొత్త వారితో విచారణ జరిపించాలని ఆదేశాలు జారీ చేశారు.ఇది నష్టపరిహారం కాదని అధికారులకు రేవంత్ తెలిపారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని, ఖర్చును భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. మృతులు, గాయపడిన వారి పిల్లల చదువుల బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రమాదానికి సంబంధించి ప్రాథమిక సమాచారం తమ దగ్గర ఉందని, విచారణ జరిగి నివేదిక వచ్చాక పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.