Saturday, September 21, 2024

రేవంత్ రెడ్డి తదుపరి రాజకీయ మజిలీ బిజెపియే: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

ఆ పార్టీలో చేరడం ఖాయం
మోదీని పల్లెత్తు మాట అనడానికి రేవంత్ భయపడుతున్నారు
బిజెపి జెండా కప్పుకొని చనిపోతానని ప్రధానితో రేవంత్ చెప్పినట్లు తెలిసింది
ప్రధానితో ఈ విషయం చెప్పింది వాస్తవమా..? కాదా..?
సిఎం రేవంత్ రెడ్డి వివరణ ఇవ్వాలి: బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్ : రేవంత్ రెడ్డి తదుపరి రాజకీయ మజిలీ బిజెపియేనని, ఆ పార్టీలో చేరడం ఖాయమని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి బిజెపిలో చేరతానని ప్రధానమంత్రి మోదీకి మాట ఇచ్చినట్లు తనకు సమాచారం ఉందని తెలిపారు. ప్రధాని మోదీని పల్లెత్తు మాట అనడానికి రేవంత్ రెడ్డి భయపడుతున్నారని, అసెంబ్లీలోనూ తాను ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు చెప్పారు.

తన రాజకీయ అరంగేట్రం ఎబివిపిలో ప్రారంభం అయిందని, బిజెపి జెండా కప్పుకొని చనిపోతానని ప్రధానితో రేవంత్ చెప్పినట్లు తెలిసిందని అన్నారు. ప్రధానమంత్రితో ఈ విషయం చెప్పింది వాస్తవమా..? కాదా..? రేవంత్ రెడ్డి వివరణ ఇవ్వాలని అన్నారు. తెలంగాణ భవన్‌లో శనివారం కెటిఆర్ విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. అదానీ అంశంలో కాంగ్రెస్ పార్టీ నిరసనలకు పిలుపు ఇచ్చిందని, అందులోనూ రేవంత్ రెడ్డి పాల్గొంటారా.. లేదా..? చెప్పాలని కెటిఆర్ అడిగారు. దేశంలో అదానీకి పెద్దపీట వేస్తున్న కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మాత్రమేనని ఆరోపించారు. సిద్దిపేటలో ఎంఎల్‌ఎ హరీశ్‌రావు క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడిని కెటిఆర్ ఖండించారు. ప్రభుత్వ ఆస్తులపై కాంగ్రెస్ నేతలు దాడులు చేస్తే పోలీసులు ఏం చేస్తున్నారని అడిగారు.

ప్రభుత్వ ఆస్తులపై దాడి చేసిన వారిపై కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. సిఎంకు సంబంధించిన మీడియా వాళ్లు ఒక ఐపీఎస్ అధికారిపై దాదాపుగా దాడికి వెళ్లారని, ఆ ఘటనపై ముఖ్యమంత్రి వివరణ ఇవ్వాలని కోరారు. కెసిఆర్ సమక్షంలో లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని ఫాక్స్‌కాన్ గతంలో ఒప్పందం చేసుకొందని గుర్తు చేశారు. ఇప్పుడు బెంగళూరులో అతి పెద్ద ప్లాంటు అంటున్నారు… మరి తెలంగాణలో విస్తరణ హుష్ కాకి అయిందా..? అని కెటిఆర్ ప్రశ్నించారు. చూస్తోంటే ఫాక్స్ కాన్ విస్తరణ ఆగిపోయినట్లుందని, సిఎం చేస్తున్న ప్రచారం ఆధారంగా ఫాక్స్‌కాన్ కూడా వెళ్లిపోయిందా..? అని అడిగారు.దీనిపై రేవంత్ రెడ్డి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుభరోసాపై రైతుల్లో భరోసా పోయిందని, రుణమాఫీ తరహాలోనే రైతు భరోసా చేస్తారని అనుకుంటున్నారని అన్నారు.

రుణమాఫీ కోసం ప్రత్యక్ష కార్యాచరణ చేపట్టి పోరాటాలు చేస్తాం
రుణమాఫీ కోసం ప్రత్యక్ష కార్యాచరణ చేపట్టి పోరాటాలు చేస్తామని కెటిఆర్ వెల్లడించారు. రుణమాఫీ డొల్లగా తేలిపోయిందని, రెండు రోజుల తర్వాత క్షేత్రస్థాయి నుంచి వివరాలు సేకరిస్తామని తెలిపారు. రుణమాఫీ కాని వివరాలు సేకరించి కలెక్టర్, అధికారులకు అందిస్తామని ప్రభుత్వం అప్పటికీ న్యాయం చేయకపోతే ప్రభుత్వ పెద్దలు, ముఖ్యులకు వివరాలు అందిస్తామని బిఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కెటిఆర్ వెల్లడించారు. అప్పటికీ స్పందించకపోతే ప్రత్యక్ష కార్యాచరణ చేపట్టి, పోరాటాలు చేస్తామని పేర్కొన్నారు.

రైతులకు న్యాయం జరగాలన్నదే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి, మంత్రుల నియోజకవర్గాల్లో కూడా వివరాలు సేకరిస్తామన్నారు. 60 శాతం రైతులకు రుణమాఫీ కాలేదని, వారు ఆశాభావంగా ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం కూడా అందరికీ న్యాయం చేస్తుందన్న ఆశాభావంతో ఉన్నట్లు కెటిఆర్ చెప్పారు. అన్ని స్థాయిల నేతలు ఇంటింటికి తిరిగి వివరాలు సేకరిస్తామని, వారం రోజుల్లో వివరాల సేకరణ పూర్తి చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు.

ఒక ఏడాది కడుపు కట్టుకుంటే రూ.41 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని సిఎం మొదట చెప్పారని, రుణమాఫీ రూ.49 వేల కోట్ల దగ్గర ప్రారంభం అయి రూ.17 వేల కోట్ల దగ్గర ముగించారంటూ ఎద్దేవా చేశారు. 28 లక్షల కుటుంబాలకు అన్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి ఇంటిని తట్టి రుణమాఫీ గురించి వివరాలు తీసుకుంటామని, దాదాపుగా మిగిలిన 28 లక్షల మంది రైతుల వివరాలు తీసుకొని వంద శాతం రుణమాఫీ అయిందని అంటున్నారని కెటిఆర్ తప్పుబట్టారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News