Thursday, September 21, 2023

మను ధర్మాసనాలు?

- Advertisement -
- Advertisement -

భారత రాజ్యాంగం ఇలా చెప్పింది, అలా సూచించింది, ప్రజలందరికీ సమాన హక్కులిచ్చింది, వారిలో శాస్త్రీయ చైతన్యాన్ని పెంచాలని నిర్దేశించింది, బాల్య వివాహాలను నిషేధించింది అని ఇలా ఆ మహద్గ్రంధంలోని మంచిని గురించి పదే పదే చెప్పుకోడం అర్ధంలేని పని అనిపిస్తున్నది.తిరోగామి శక్తులు, అభివృద్ధి నిరోధక వర్గాలు పని కట్టుకొని రాజ్యాంగ సదాశయాలకు, దాని మతాతీత గుణానికి వ్యతిరేకంగా నడచుకొంటూ ప్రచారం సాగిస్తున్న విషాద దృశ్యం ఒక వైపు భయపెడుతుండగా, మరోవైపు రాజ్యాంగం మీదనే ప్రమాణం చేసి ఉన్నత న్యాయ స్థాన పీఠాలపై ఆశీనులైన న్యాయమూర్తులే దాని స్ఫూర్తిని బురదలో కలుపుతూ మాట్లాడడం ఆవేదన కలిగిస్తున్నది. 29 వారాల తన గర్భాన్ని తొలగించుకోడానికి అనుమతించాలని అర్థిస్తూ 16 ఏళ్ళ 11 మాసాల వయసులోని ఒక మైనర్ రేప్ గర్భవతి దాఖలు చేసుకొన్న పిటిషన్‌పై గుజరాత్ హైకోర్టుకు చెందిన జస్టిస్ దవే ధర్మాసనం చేసిన వ్యాఖ్య రాజ్యాంగానికి తలవంపులు తెచ్చేదిగా వుండడం అత్యంత బాధాకరం.

బాలిక, ఆమె గర్భస్థ పిండం ఆరోగ్యంగా వున్నట్టయితే గర్భస్రావానికి తాను అనుమతించేది లేదని స్పష్టం చేసిన జస్టిస్ దవే ఒక వైపు ఆ బాలికను వైద్య పరీక్ష కోసం పంపిస్తూనే మనుస్మృతి గొప్పదనాన్ని వివరిస్తూ మాట్లాడారు. 21 శతాబ్దపు తీరును తృణీకరిస్తూ మను ధర్మాన్ని ఉదహరిస్తూ సాక్షాత్తూ హైకోర్టు న్యాయమూర్తే మాట్లాడడం విడ్డూరం కాదా! ‘మనుస్మృతిని చదవండి, దాని ప్రకారం ఆడపిల్ల 1415 ఏళ్ళ వయసులోనే పెళ్ళి చేసుకొని నాలుగైదు మాసాలు అటుఇటుగా 17 సంవత్సరాలకు బిడ్డను కనాలని చెబుతున్నది’ అని జస్టిస్ దవే ఉద్బోధించారు. కావలిస్తే మీ తల్లినో, అమ్మమ్మనో అడిగి తెలుసుకోండి. ఆడ పిల్లలు మగ పిల్లల కంటే ముందు ఎదుగుతారు అని కూడా అన్నారు. ఆధునిక చట్టం ఆడ పిల్లకు 18 ఏళ్ళను కనీస వివాహ వయసుగా ప్రకటించడాన్ని గౌరవ న్యాయమూర్తి తిరస్కరిస్తున్నట్టు భావించాలా? మహిళలు వంటింటికి, పడకటింటికే పరిమితం కావాలని ఆయన ఆశిస్తున్నారా?

గర్భస్రావ చట్టం ప్రకారం రేప్ వల్ల, వరస కాని వారి వల్ల జరిగే గర్భాల విషయంలో గరిష్ఠంగా 24 వారాల పిండాన్ని తొలగించవచ్చు. ఇతర కొన్ని సందర్భాల్లో 24 వారాలకు పైబడిన గర్భాలను కూడా తొలగించడానికి పెద్ద కోర్టులు అనుమతించవచ్చు. చట్ట పరిస్థితి ఇలా వుండగా గౌరవ న్యాయమూర్తులు రాజ్యాంగం, చట్టంతో పని లేకుండా మనుస్మృతిని రంగంలోకి తీసుకురాడం జాతికి ఎంత మాత్రం మంచి చేయదు. ప్రగతిశీల స్త్రీలను దండనకు గురి చేసే మారుమూల గ్రామీణ ఖాప్ పంచాయతీలే ఇటువంటి సందర్భాల్లో ఈ ఉన్నత న్యాయస్థాన ధర్మాసనాల కంటే నయమని అనిపిస్తే ఆక్షేపించలేము. గత ఏడాది ఒక సభలో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రతిభా సింగ్ మాట్లాడుతూ మనుస్మృతి వంటివి మహిళకు గౌరవప్రదమైన స్థానాన్ని ఇచ్చాయని అన్నారు. ఆమె ప్రకటనను మహిళల హక్కుల ఉద్యమకారిణులు, వారి సంఘాలు తీవ్రంగా విమర్శించాయి.

మహిళను మనుస్మృతి కించపరిచిందని చెప్పడానికి అనేక ఉదాహరణలున్నాయని వారు అన్నారు. స్త్రీ పూర్తిగా కాముక దృష్టితో వుంటుంది కాబట్టి ఆమెను నమ్మకూడదని, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోడానికి అనుమతించకూడదని, అలాగే మగ బిడ్డను కనని భార్యను విడిచిపెట్టాలని, ‘వెలి’ కులానికి చెందిన పురుషుడితో మహిళ కన్న బిడ్డను పూర్తిగా త్యజించాలని మనుస్మృతి చెప్పినట్టు అఖిల భారత ప్రజాస్వామ్య మహిళల సంఘం ఒక ప్రకటనలో పేర్కొన్నది. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. భిన్న మతాలకు చెందిన గ్రంథాలు మహిళను తక్కువగానే చూశాయి. మహిళపై పురుషుని పెత్తనాన్ని ప్రోత్సహించే నీతులనే చెప్పాయి. కాని ప్రజాస్వామిక రాజ్యాంగాలు మాత్రం ఆమెకు పురుషునితో సమానమైన హక్కులను, స్వాతంత్య్రాలను, గౌరవాన్ని ప్రసాదించాయి. ఇందులో భారత రాజ్యాంగం చెప్పుకోదగిన ప్రజాస్వామిక చట్టం. మత, కుల వివక్షను తొలగించడంతో పాటు స్త్రీ, పురుష అసమానత్వానికి శాశ్వత సమాధి కట్టాలని భారత రాజ్యాంగం సంకల్పించింది.

అందుకు అనుగుణమైన అధికరణలను పొందు పరిచింది. రాజ్యాంగం 14 నుంచి 18 వరకు గల అధికరణలన్నీ సమానత్వ హక్కును ప్రసాదిస్తున్నాయి. చట్టం ముందు ప్రజలకు గల సమాన హక్కును రాజ్యం నిరాకరించజాలదని చెబుతున్నాయి. అలాగే జాతి, మతం, కులం, లింగం, పుట్టిన చోటును బట్టి తేడా చూపడానికి వీల్లేదని స్పష్టం చేస్తున్నాయి. మహిళ గర్భాన్ని వద్దనుకొనేటప్పుడు ఆయా పరిస్థితులను బట్టి గరిష్ఠంగా అందుకు అనుమతి ప్రసాదించవచ్చునని చట్టం చెబుతుంటే ఉన్నత న్యాయస్థాన ధర్మాసనాలు ఎప్పుడో కాలం చెల్లిపోయిన స్మృతులను ఉదహరించడం ఏ ఉపద్రవానికి సంకేతమో అనే భయాలు కలగడం సహజం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News