Wednesday, April 24, 2024

ఆర్థిక విధానాలపై అదానీ ప్రాబల్యం!

- Advertisement -
- Advertisement -

Controversy over handing over of energy project contract to Gautam Adani

 

మన పొరుగు దేశం శ్రీలంకలో ఎనర్జీ ప్రాజెక్ట్ కాంట్రాక్టు గౌతమ్ అదానీ గ్రూప్‌కు అప్పగించడంపై పెను వివాదం చెలరేగింది. దానిని రద్దు చేయాలని అక్కడి ప్రతిపక్షాలతో పాటు సాధారణ ప్రజలు సహితం పెద్ద ఎత్తున నిరసనలు జరుపుతున్నారు. టెండర్లు పిలవకుండా అదానీ గ్రూప్‌కు ఆ కాంట్రాక్టు ఇవ్వడం వెనుక భారత ప్రధాని నరేంద్ర మోడీ వత్తిడి ఉన్నదంటూ తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. భారత ప్రధాని మోడీ ఒత్తిడి మేరకు అధ్యక్షుడు గొటబయ రాజపక్స ఈ పని చేశారని, ఈ నేపథ్యంలో అదానీకి ఈ ప్రాజెక్టుకు అప్పగించారని శ్రీలంక సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ (సిఇబి) చైర్మన్ ఎంఎంసి ఫెర్డినాండో పేర్కొనడంతో పెను దుమారం చెలరేగింది.

ఈ విషయాన్ని తనకు రాజపక్స చెప్పారంటూ పార్లమెంట్ ప్యానల్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ కమిటీ (సిఒపిఇ) బహిరంగ విచారణలో పేర్కొనడం తీవ్రమైన అంశమే. అయితే ఈ ఆరోపణలను రాజపక్స ఖండించిన తర్వాత తన వ్యాఖ్యలను ఫెర్డినాండో తక్షణమే వెనక్కు తీసుకోవడమే కాకుండా, బహిరంగ క్షమాపణలు చెప్పారు. ఆ తర్వాత తన ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఈ మొత్తం ఉదంతంలో వాస్తవాలు ఏమిటన్నది అట్లాగే ఉంచితే, అంతర్జాతీయంగా భారత దేశ ప్రతిష్ఠను మంటగరిపే విధంగా ఉన్నదని చెప్పవచ్చు. అయినా, ఈ విషయమై భారత ప్రధాని మౌనం పాటించడమే కాకుండా, భారత ప్రభుత్వం, అధికార పక్షం బిజెపి సహితం పట్టించుకొన్నట్లే వ్యవహరిస్తున్నాయి.

ఏదేమైనా గత కొంత కాలంగా భారత ఆర్ధిక విధానాల రూపకల్పనలో అదానీ కీలక పాత్ర వహిస్తున్నట్లు పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకు అనేక ఉదంతాలు ప్రత్యక్షం అవుతున్నాయి. భారత ప్రభుత్వం వివిధ దేశాలతో చేసుకొనే ఆర్ధిక సంబంధ అవగాహన ఒప్పందాలలో సహితం ఆయన పాత్రయే విమర్శలు చెలరేగుతున్నాయి. అంతకు ముందు దేశంలో బొగ్గు సరఫరాలో ఇబ్బందుల కారణంగా తీవ్రమైన విద్యుత్ కొరతను పలు ప్రాంతాలు ఎదుర్కొన్నాయి. ప్రపంచ బొగ్గు నిల్వలలో 9.5 శాతంతో ఐదవ స్థానంలో ఉంది. ఇక బొగ్గు ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉంది. అయితే స్వదేశంలో బొగ్గు ఉత్పత్తిలో కోత విధించి, ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకోవాలని నిర్ణయించడంతోనే విద్యుత్ కొరత ఏర్పడటం గమనార్హం.

ఆత్మనిర్భర్ భారత్ అంటూ దేశంలో అందుబాటులో ఉన్న బొగ్గు నిల్వలను పక్కన పెట్టి, విదేశీ దిగుమతులపై ఆధార పడటం విస్మయం కలిగిస్తుంది. అందుకు కూడా అదానీ ఆస్ట్రేలియాలో బొగ్గు గనులను కొనుగోలు చేయడమే కారణంగా విమర్శలు చెలరేగాయి. ఆ తర్వాతనే గత ఏప్రిల్‌లో భారత దేశం ఆస్ట్రేలియాతో వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసింది. దీనిలో భారతదేశం బొగ్గు దిగుమతి సుంకం లేకుండా చేసింది. దానితో ఆస్ట్రేలియా నుంచి బొగ్గు సరఫరా చేసే రూ. 8308 కోట్ల విలువైన కాంట్రాక్టు అదానీకి లభించింది. అదానీ బొగ్గునే కొనుగోలు చేయాలని తమపై వత్తిడి ఉన్నట్లు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోపించడం ఈ సందర్భంగా గమనార్హం.

గతంలో తమకు ఎటువంటి ప్రమేయం లేని ఓడరేవులు, విమానాశ్రయాలు వంటి భారీ ప్రాజెక్ట్ లు ఇప్పుడు దేశంలో ఆదానీ గ్రూప్‌కు విస్తృతంగా దాఖలు అవుతున్నాయి. టెండర్లలో పోటీపడి, కొత్తగా వాటిని నిర్మిస్తే ఎవ్వరికీ అభ్యంతరం ఉండదు. ఆ విధంగా కాకుండా, అప్పటికే నిర్మాణంలో ఉన్నవాటిని దాఖలు చేస్తుండటం జరుగుతున్నది. కొన్ని ప్రభుత్వ ఆధీనంలో ఉన్నవాటిని ప్రైవేటీకరణ పేరుతో కారుచవకగా అందించడం, ప్రైవేట్ రంగంలో ఉన్నవాటిని ఆదాయ పన్ను దాడుల అనంతరం తక్కువ ధరకు దాఖలయ్యే విధంగా చూడటం జరుగుతున్నది. మొత్తం మీద ప్రభుత్వ అండదండలతో కేవలం ఎనిమిదేళ్ల కాలంలో దేశంలోనే కాకుండా మొత్తం ఆసియాలో అత్యంత సంపన్నులలో మొదటి వరుసలో ఉండే స్థాయికి ఎదిగారు.

ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్ధిక సంస్కరణలు ప్రజల జీవన ప్రమాణాలు పెరిగేందుకు దోహదపడాలి. లేదా పారిశ్రామిక సంపద పెరిగే విధంగా ఉండాలి. కానీ ఉపాధి అవకాశాలు తగ్గిపోవడం, ద్రవ్యోల్బణం వంటి పరిణామాలను చూస్తుంటే దేశంలో ఆర్ధిక పురోగతి ఆశించిన రీతిలో లేదని చెప్పవచ్చు. మొత్తం ప్రపంచ పెట్టుబడిదారీ దేశాలలో ఎక్కడ కూడా సంపద పెరుగుదల కేవలం ఒకరిద్దరు కార్పొరేట్ సంస్థలకు మాత్రమే ప్రయోజనం కలిగించే విధంగా జరగలేదని ఆర్ధిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కానీ, కేవలం భారతదేశంలో మాత్రమే కేవలం రెండు కార్పొరేట్ సంస్థలు మొత్తం ఆర్ధిక వ్యవస్థలో శరవేగంగా విజృంభిస్తున్నాయి. అందుకు వారి సామర్థ్యం కన్నా ప్రభుత్వ విధానపర సహకారమే కారణమని అందరూ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అదానీ గ్రూప్ ఎదుగుదల సహితం మన దేశం అనుసరిస్తున్న ఆర్ధిక విధానాలను ప్రశ్నార్ధకం చేస్తున్నది.

అదానీ గ్రూప్ బ్యాంకులకు ఎగ్గొట్టిన బకాయిలు రూ. 4.5 లక్షల కోట్ల వరకు ఉన్నాయని మాజీ ఎంపి డా. సుబ్రహ్మణ్యన్ స్వామి పేర్కొన్నారు. 2016 నుండి ప్రతి రెండేళ్లకు సంపద రెట్టింపుగా పెరుగుతుండగా, బ్యాంకులకు రుణాలు మాత్రం ఎందుకు చెల్లించడం లేదని ఆయన ప్రశ్నించరు. ఆరు విమానాశ్రయాలను కొనుగోలు చేసిన ఆయన కొద్దీ రోజులలో అన్ని బ్యాంకులను కూడా కొంటారేమో అంటూ డా. స్వామి ఎద్దేవా చేశారు. కొన్ని లక్షల కోట్లు బ్యాంకులకు బకాయిలు చెల్లించకుండా ఉన్నప్పటికీ బ్యాంకులు ప్రశ్నించలేకపోతున్నది. పైగా, ప్రభుత్వమే బాడ్ బ్యాంక్ అంటూ ఏర్పాటు చేసి, ప్రభుత్వ నిధులతో అటువంటి ఘరానా బకాయిలను మాఫీ చేయడం ద్వారా బ్యాంకుల కార్యకలాపాలు కుంటుపడకుండా కాపాడుకునే ప్రయత్నం జరుగుతున్నది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని పుష్కర కాలం నాటి కేసులో రోజుల తరబడి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రశ్నిస్తూ ఉండడం వెనుక కూడా అదానీ ప్రమేయం ఉండవచ్చని మోహన్ గురుస్వామి పేర్కొన్నారు. అయితే, మరికొందరు నూపుర్ శర్మ వ్యాఖ్యలతో గల్ఫ్ దేశాలతో ప్రధాని పెంచుకున్న సంబంధ బాంధవ్యాలు విఘాతం కలగడంతో దేశ ప్రజల దృష్టి ఆ విషయం నుంచి మళ్లించే ప్రయత్నంగా పేర్కొంటున్నారు.

గాంధీ కుటుంబంపై నేషనల్ హెరాల్డ్ ఆర్ధిక వ్యవహారాల గురించి కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సుబ్రమణియన్ స్వామి కేసు దర్యాప్తులో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆసక్తి చూపడం లేదం టూ గతంలో స్వయంగా ప్రధానికి లేఖ కూడా రాసారు. ఛత్తీస్‌గఢ్‌లో వారికి మంచి ఆదాయం సమకూరుస్తున్న హస్దేమో గనుల తవ్వకం గురించి స్థానిక గిరిజన ప్రజలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. వారికి రాహుల్ భరోసా ఇవ్వడంతో వెంటనే అక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం తగు చర్య తీసుకోవలసి వచ్చింది. ఈ సందర్భంగా రాహుల్ ఓ మాటన్నారు. ఈ దేశంలో అదానీ ఆర్ధిక సామ్రాజ్యాన్ని అడ్డుకునే ప్రయత్నం ఎవ్వరు చేసినా తగు మూల్యం చెల్లించాల్సి వస్తుందనే సంకేతం ఇస్తూ ‘నేను మీకు మద్దతు ఇస్తున్నందుకు నేను భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని నాకు తెలుసు. అయితే ఈ విధంగా జరుగవలసిందే’ అంటూ స్పష్టం చేశారు. ఆయన అనుమానం చెందినట్లే కొద్ది రోజులకే ఇడీ నోటీసులు సోనియా, రాహుల్‌లకు వచ్చాయి. ‘సులభతర వాణిజ్యం’ అవకాశాలు కల్పించడం అంటే మొత్తం వాణిజ్య అవకాశాలు పారదర్శకంగా, అందరికీ సమాన అవకాశాలు కలిగించే విధంగా ఉండడంగా భావిస్తాము. కానీ ఎంపిక చేసిన వారికి మాత్రమే విశేష ప్రాధాన్యత లభించే విధానాలు కాలేవు. భారత ఆర్ధిక విధానాలలో అటువంటి పారదర్శకత లోపిస్తున్నట్లు భావించవలసి వస్తున్నది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News