మరోసారి కరోనా మహమ్మారి కలకలం సృష్టిస్తోంది. దేశంలో అంతకంతకూ పెరుగుతున్న కేసుల సంఖ్య సహజంగానే అందరిలోనూ ఆందోళన కలిగిస్తోంది. ఐదేళ్ల కిందట విశ్వమంతటా విస్తరించి, లక్షలాది ప్రాణాలను కబళించిన ఈ పెనువ్యాధి పేరు వింటే ఇప్పటికీ వెన్నులో వణుకు పుడుతుంది. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 వైరస్‌కు బలైన వారి సంఖ్య 70 లక్షల పైచిలుకే. అంతటి ప్రాణాంతక వ్యాధి కోరలు సాచి వస్తోందంటే ఎవరికి మాత్రం భయం కలగదు? సింగపూర్, హాంకాంగ్ దేశాలలో మొదలైన ఈ వైరస్ వ్యాప్తి రెండు వారాలు గడిచేసరికి ఇండియా గడప దాటి లోపలకు ప్రవేశించింది. ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు తదితర రాష్ట్రాలలో పదుల సంఖ్యలో ఈ వైరస్ బారినపడినట్లు వార్తలు వినవస్తున్నాయి.
ఒక్క కేరళలోనే 430 కేసులు బయటపడినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో ఒక వైద్యుడికే కరోనా సోకినట్లు వచ్చిన వార్తలు కలవరం కలిగిస్తున్నాయి. ఇప్పటివరకూ వెయ్యికి పైగానే కేసులు వెలుగు చూసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ లెక్కగట్టింది. గతంలో మారణహోమం సృష్టించిన ఒమిక్రాన్ వైరస్సే ఇప్పుడూ వ్యాపిస్తున్నా, దాని ఉప వేరియంట్లే ప్రధానంగా వ్యాప్తిలో ఉన్నాయని, వాటివల్ల ప్రమాద తీవ్రత అంతగా ఉండదనీ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) డైరెక్టర్ జనరల్ స్వయంగా పేర్కొనడం ఉపశమనం కలిగించే విషయం. ఒకప్పుడు రెండు రోజుల్లోనే వైరస్‌ల సంఖ్య రెట్టింపు అయ్యేవి.
కాగా ప్రస్తుతం వాటి వ్యాప్తిలోనూ, సంఖ్యలోనూ వేగం కనిపించడం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎల్‌ఎఫ్ 7, ఎన్ బి 1.8.1 అనే కొత్త వేరియంట్లు ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్నట్లు ఇండియన్ జెనోమ్ కన్సార్షియం గుర్తించింది. ప్రపంచ ఆరోగ్యసంస్థ సైతం ఇప్పటివరకూ ఎలాంటి మార్గదర్శకాలూ విడుదల చేయకపోవడాన్ని బట్టి చూస్తే ఇప్పటి వైరస్ ప్రభావం అంతంత మాత్రమేనని స్పష్టమవుతోంది. వాతావరణ పరిస్థితులు, సామూహికంగా మసలడం, ప్రయాణాలు పెరగడం వంటివి కేసుల పెరుగుదలకు కారణం కావచ్చనేది వైద్యనిపుణుల అనుమానం. గతంలో కోవిడ్ ప్రబలినప్పుడు అంతా అయోమయ వాతావరణం నెలకొని ఉండేది. ఏ జబ్బో, ఎలా సోకిందో అర్థం కావడానికి చాలా రోజులు పట్టింది.
కరోనా వైరస్‌ను గుర్తించేలోగానే ఒకరినుంచి ఒకరికి పాకి, ప్రపంచమంతటా విస్తరించి మానవాళిని చుట్టుముట్టి ప్రాణాలు బలితీసుకుంది.అకస్మాత్తుగా ఊడిపడిన ఈ వైరస్ భరతం పట్టే విధంగా వ్యాక్సిన్ రూపొందించేందుకూ చాలా రోజులే పట్టింది. కరోనా నేర్పిన గుణపాఠాలతో ప్రపంచ ఆరోగ్య సంస్థతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్య పరిశోధనా సంస్థలు సైతం చెట్టుకొకటి, పుట్టకొకటిగా పుట్టుకొస్తున్న ప్రాణాంతక వైరస్‌లపై అనుక్షణం ఒక కన్నువేసి ఉంచుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా వ్యాపిస్తున్న కరోనా వైరస్ వల్ల అంతగా ప్రమాదం లేదంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థతోపాటు కేంద్ర ఆరోగ్య వైద్యశాఖ ఇస్తున్న భరోసాను విశ్వసించవచ్చు.
అలాగే, ప్రస్తుతం కరోనా బారినపడినవారు రుచి, వాసన కోల్పోకపోవడం ఊరట కలిగించే విషయం. అలాగని ప్రాథమిక జాగ్రత్తలు పాటించకపోవడం ప్రాణాంతకంగా పరిణమించవచ్చు. వ్యక్తిగత శుభ్రత పాటించడం, ఒకరినుంచి ఒకరు కనీసం ఐదారు అడుగుల దూరం మసలడం, మాస్కు ధరించడం, వీలైనంత వరకూ సామూహిక ప్రయాణాలకు స్వస్తి చెప్పడం వంటి స్వీయ జాగ్రత్తలు పాటించడం అత్యవసరం. దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారికి, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికీ ఈ వైరస్ సోకే ప్రమాదం ఉందంటూ వైద్య నిపుణులు చేస్తున్న హెచ్చరికలు గమనార్హం. గొంతు నొప్పి, దగ్గు, అలసట, జ్వరం వంటి కరోనా ప్రాథమిక లక్షణాలు ఉన్నట్లు గమనిస్తే, వెంటనే వైద్యుల్ని సంప్రదించడం ఉత్తమం. నిర్లక్ష్యం చేస్తే పక్కనున్నవారికి కూడా వైరస్ సోకే ప్రమాదం ఉందన్న సంగతి విస్మరించరాదు.
మరోవైపు ప్రభుత్వాలు సైతం కరోనా వైరస్ నివారణకు వినియోగించే మందులతో ఆస్పత్రులను, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పరిపుష్టం చేయాలి. కీడెంచి మేలెంచమన్నట్లు ప్రస్తుతానికి బూస్టర్ డోస్‌లు అవసరం లేదని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ చెబుతున్నా, పరిస్థితి చేయి దాటితే వినియోగించేందుకు టీకాలను సిద్ధంగా ఉంచడం మేలు. గతంలో టీకాలు తీసుకోనివారిని గుర్తించి వారికి తక్షణం టీకాలు ఇప్పించేందుకు కార్యాచరణ ఆరంభించాలి. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో వ్యాధుల విజృంభణ పెరుగుతుందన్న వాస్తవాన్ని గమనంలో ఉంచుకుని, వైద్య ఆరోగ్య శాఖాధికారులు నడుం బిగించడం శ్రేయస్కరం.