Saturday, April 13, 2024

కార్పొరేట్‌ను పెంచేస్తున్న కొత్త మధ్యతరగతి

- Advertisement -
- Advertisement -

నేను మొన్న మార్చి 24 తారీఖున ఊరికి పోయొస్తూ మా నియోజకవర్గ కేంద్రమైన నకిరేకల్‌లో ఆగాను. అక్కడ టీచర్లతోనూ, పాఠశాలల్లోనూ పొద్దుటి పూటం తా గడిపాను. తీవ్ర నిరాశా నిస్పృహలు అలుముకున్నాయి వాళ్లలో. స్కూళ్లు మూతబడనున్నాయన్నది వాళ్ల మానసిక ఆందోళన. ఆశయం కొద్దీ ఉపాధ్యాయులైన ఎవళ్లకైనా ప్రభకోల్పోతున్న పాఠశాలలను చూస్తుంటే బాధే కలుగుంది. వాళ్లతో మాట్లాడిన తర్వాత, తమ స్కూళ్లకు పునర్వైభవం తెచ్చేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారని అనిపించింది. ప్రయత్న లోపం ఏం లేదు వాళ్ల వైపు నుంచి. సమస్య అంతా వ్యవస్థాగతమే. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి మీద మధ్యలో ఉంటుంది నకిరేకల్.

ఇక్కడ ఒకప్పుడు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు రెండూ ఒకదానికొకటి పోటాపోటీగా నడిచేవి. బడుగు బలహీన వర్గాల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లోనూ, మధ్యతరగతి ధనికుల పిల్లలు ప్రైవేటు పాఠశాలల్లో, కళాశాలల్లో చదివేది. పదోతరగతి, ఇంటర్మీడియట్‌లో మంచిమార్కులు వచ్చేది. ఎం.సెట్‌లో స్టేట్ ర్యాంకులు వచ్చేది. అప్పట్లో గొప్పగా బ్రాండ్ ఇమేజ్‌తో వెలుగొందిన ఆదర్శ విద్యామందిర్, వాసవి నికేతన్ వంటి స్కూళ్లు, కాలేజీలు ఇవాళ చేరేవాళ్లు, చేర్పించేవాళ్లు లేక దీనంగా కొట్టుమిట్టాడుతున్నాయి. స్థానిక అధ్యాపకుల శిక్షణలోనే విద్యనార్జించి ఉన్నత స్థానాలను అధిరోహించిన విద్యార్థులు తాము చదువుకున్న విద్యాసంస్థల దీనావస్థను చూసి ఒకింత చింతిస్తున్నారు. ఇక్కడే ఉపాధ్యాయుడిగా ఎనబైల్లో కెరీర్ ప్రారంభించి ఓ దశాబ్దకాలం పాటు పని చేసిన నేనూ పూర్వ విద్యార్థుల మాదిరిగానే వాటి లోగిలిలో నిలబడి నా వంతుగా కుమిలిపోయాను. ముప్పై ఐదేండ్ల క్రిందట నకిరేకల్ ఒక మేజర్ గ్రామ పంచాయితీ.

ఇప్పుడు ఆదాయం కలిగిన పెద్ద మున్సిపాలిటీ. ప్రజలు పెరిగారు, పరపతి పెరిగింది, పట్టణం విస్తరించింది. కానీ, ప్రభుత్వ, ప్రైవేటు ఏ పాఠశాలల్లో వేటికీ మునుపటంత కళలేదు, కాంతి లేదు. అడ్మిషన్లు లేక ఒకనాటి స్కూళ్లన్నీ ఆకురాలిన మోడుల వలె ఉన్నాయి. తల్లిదండ్రులు పిల్లల్ని సమీప పట్టణాల్లో, నగరాల్లో చదివిస్తున్నారు. టీచర్లూ, లెక్చరర్లూ అక్కడికే బోధకులుగా వెళ్తున్నారు. ఈ సమస్య ఒక్క నకిరేకల్ దే కాదు దరిదాపుగా రాష్ట్రం అంతటా ఇదే పరిస్థితి. మూలాల్లోకి వెళ్తే దేశంలో పుట్టుకొచ్చిన కొత్త మధ్యతరగతి, నగరాలు అక్కడి ఇండస్ట్రీ, మార్కెట్ అవసరాలు, వాటి ప్రాబల్యమే కారణమని తెలుస్తుంది. నియోమిడిల్ క్లాస్ వివరాల్లోకొస్తే, మన దేశంలో నవ మధ్యతరగతి 1980ల చివరన మొదలైంది.

1990 లలో పివి నర్సింహారావు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక సరళీకరణ విధానాల ఫలితంగా క్రమేణా పెరుగుతూ వచ్చింది.గ్రామాల నుంచి ప్రజలు వలస వచ్చి నగరాల్లోనూ, పెద్ద పట్టణాల్లోనూ స్థిరపడి కంపెనీల్లో, కార్ఖానాల్లో పనికి కుదిరారు, చిన్నాచితకా వ్యాపారాలు చేసుకుంటున్నారు. నిర్మాణం, సేవా రంగాల్లో పరిశ్రమ చేసేవాళ్లు రోజువారీ కావొచ్చు, నెలవారీ వేతనాలు కావొచ్చు ఊళ్లల్లో కంటే అధికంగా సంపాదిస్తున్నారు. వీళ్లందరూ ‘కొత్త మధ్యతరగతి’ కిందకు వస్తారు. విద్య, ఆరోగ్యం, సంపాదన, ఇన్సూరెన్స్ ఇత్యాది విషయాలకు ప్రాధాన్యతనిస్తూ ఆర్థికస్వావలంబన దిశగా పేద మధ్యతరగతి నుండి విడివడి సంపన్నుల ఆర్థిక పుష్టిని స్వప్నిస్తూ ఎగువ మధ్యతరగతి వద్ద మొదలై ధనవంతుల అంచుదాకా ‘నియో మిడిల్ క్లాస్’ సాగి వున్నారు. వీళ్లది అన్నింటా కొత్త నడవడి, కొత్త విలువలు. ప్రైవేట్ రంగంలో సేవలకు పారిశ్రమికాభివృద్ధికి పటిష్ఠమైన వర్క్‌ఫోర్స్‌గా నిలిచింది వీళ్లే.వీళ్లు ప్రధానంగా ఐటి, ఫైనాన్స్, టెలికమ్యూనికేషన్స్ వంటి సేవారంగంలోని నిపుణులు, ఎంట్రప్రెన్యుయర్స్, ఉద్యోగులుగా ఉంటూ తమ ఆదాయ స్థాయిలలో గణనీయమైన పెరుగుదలకు చేరుకున్నారు. ఒకదాని తర్వాత ఒకటి మెరుగైన ఉద్యోగ ఉపాధి అవకాశాల ప్రాప్యత ( Access)కూడా వీళ్లకు చేరువైంది.

ఈ ఉపాధి ప్రాప్యతే వాళ్ల మొత్తం జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, కొనసాగింపుకు దోహదపడింది. పర్యవసానంగా ఉద్యోగాలు, ఉపాధి, వృత్తుల స్వభావం సైతం పట్టణీయ ఆదాయానుకూలంగా మారిపోయాయి. అంతకు ముందటి సామ్యవాద భావుకత, ట్రేడ్ యూనియన్ కల్చర్ పూర్తిగా పూర్వపక్షం చేయబడ్డాయి. ప్రత్యామ్నాయంగా పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ (పిపిపి) విధానం వేగం పుంజుకుంది. తరతరాలుగా గ్రామీణ వ్యవస్థలో పాలక వర్గంగా ఉంటూవచ్చిన గ్రామీణ భూస్వాములు తమ రూపం మార్చుకొని పట్టణాల్లో, నగరాల్లో మార్కెటింగ్, రియల్ ఎస్టేట్, కన్‌స్ట్రక్షన్స్, సినిమా, విద్యా వినోద రంగాల్లోకి పెద్దయెత్తున పెట్టుబడులతో ప్రవేశించి వ్యవస్థాపకులు (ఎంట్రప్రెన్యుయర్స్)గా సరికొత్త మాన్యుఫాక్చరింగ్, సర్వీస్ సంస్థలను నెలకొల్పారు.

ఈ మొత్తం మార్పులు మన దేశంలోని వర్గ రాజకీయాలను వర్గ సంబంధాలను సమూలంగా మార్చేశాయి. కొత్త మధ్యతరగతి స్వభావాన్ని కనిపెట్టి ప్రత్యేక ఆర్థిక మండళ్లు(SEZs) అవతరించి ‘ఉత్పత్తి పంపిణీ వినియోగం’ తీరుతెన్నులను తమ చెప్పుచేతుల్లోకి తెచ్చుకున్నాయి.ఆకర్షితులైన మరింత గ్రామీణ యువత, శ్రామికులు నగరాలకు పట్టణాలకు ఉపాధి కోసం అర్బన్ జనాభాతో మిళితమైనారు. గ్రిగ్ ఎకానమీ పుణ్యాన సమకాలీన పేద మధ్యతరగతి నుండి జనాభా నిచ్చెనలో ఓ కొత్త శ్రేణిగా వెలసిన ఈ జనాలు విభిన్నమైన, సంక్లిష్టమైన సమూహంగానూ మారారు. నియో మిడిల్ క్లాస్ ఆర్థిక పరివర్తన కన్స్యూమర్ కల్చర్, కన్స్యూమరిజం కొత్త మధ్యతరగతికి పర్యాయపదమైంది. విలాసవంతమైన వస్తువులు, బ్రాండెడ్ వస్తువులు, విశ్రాంతి, వినోద కార్యకలాపాలపై కొత్త మధ్యతరగతికి డబ్బు వెచ్చించడం అలవాటైంది.

ఉన్నత విద్యను, నైపుణ్యాలను ఇప్పించడంకోసం అధిక మొత్తంలో ఖర్చుచేసే స్తోమత కొత్త మధ్యతరగతికి వచ్చింది. ఎందుకంటే సోషల్ మొబిలిటీలో, పోటీ ఉద్యోగ విఫణిలో ముందంజలో ఉండేందుకు అవసరమైన సాధనంగా పెట్టుబడిగా విద్యను కొత్త మధ్యతరగతి భావిస్తున్నది. అందుకే తమ పిల్లల విద్యపై భారీగా పెట్టుబడి పెట్టడం షురువైంది. నాలెడ్జ్ లేబర్ తయారీ కోసం కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్ సంస్థలు భారీగా వెలిశాయి. మెట్రోపాలిటన్ నీడలో కలయతిరుగుతున్న నియోమిడిల్ క్లాస్ జీవనశైలికి ఆకాంక్షలకు అనుగుణంగా కాలనీలు, బజార్లు రూపుదిద్దుకున్నాయి. గేటెడ్ కమ్యూనిటీలు, షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్‌ల వృద్ధికి సంపన్నుల ఆధ్వర్యంలో వెస్ట్రన్ మోడల్‌లో నగర ప్రభుత్వాలు మౌలిక వసతులు కల్పిస్తున్నాయి.

విద్య వినయ దాయిని, విజ్ఞాన ప్రదాయిని అనేది సాంప్రదాయిక వ్యాఖ్య కాగా, విద్య ఆర్థికోన్నతికి అంతస్థుల చేరికకు పాస్ పోర్ట్ అనేది నియో మిడిల్ క్లాస్ అభిప్రాయం. తాము తక్కువ చదువుకున్నప్పటికినీ తల్లిదండ్రులు కార్పొరేట్ సంస్థల్లో అయ్యే ఖర్చుకు వెనుకాడటం లేదు. అర్బన్ నమూనా కెరీరిజానికి మొగ్గుచూపుతున్నారు. సౌకర్యవంతమైన స్థిరమైన జీవితాన్ని కోరుకుంటున్నారు. సాధారణ బ్లూ కాలర్ ఉద్యోగాలకు స్వస్తిపలికి పై స్థాయి హోదాలకు ప్రాధాన్యతనిస్తున్నారు. జాతీయ బ్రాండ్‌లు, సాంకేతికతలకు ప్రాధాన్యతనిస్తూ ‘బై ఇండియన్ (Buy Indian) సమూహంగా ప్రపంచాన్ని మార్చేస్తున్న ఉత్తేజకరమైన స్టార్టప్లలో పెట్టుబడులకూ దిగుతున్నారు. ఈ వర్గాలను ఆర్థికవేత్తలు’ నేటి ఈ భారతీయ కొత్త మధ్యతరగతిని ఉన్నత విద్యావంతులు, ప్రకృష్ట జ్ఞాన కార్మికులు, అధిక వేతన సంపాదితులు, వినియోగదారులు, భౌతిక జీవనశైలీ అనుసారకుల సమూహంగా, వర్గంగా’ ఫుల్లర్ & నరసింహన్ అభివర్ణించగా, ఎల్.ఫెర్నాండిజ్ ‘విభిన్నత, వైవిధ్యంతో కూడుకున్న బహుళ కల్పనల స్రష్టలుగా, ఎకానమీ నిర్దేశించే సామాజిక నిర్మితిపై ఆధిపత్యం చెలాయించే శక్తులు’గా ఉదహరిస్తారు.

డిజిటల్ విప్లవం మూలాన ఈ శక్తుల వర్గాల ప్రమేయం మారుమూల పల్లెలకూ ప్రాకింది. ప్రధాని నరేంద్ర మోడీ అన్నట్టు ‘దేశంలో పెరుగుతున్న నయా-మధ్య తరగతి భారతీయ ఆకాంక్షలకు శక్తి కేంద్రం (Power House) గా మారింది.’ ప్రభావితులైన గ్రామీణులు స్థానిక స్కూళ్లు కాలేజీలను వదిలి టాలెంట్, టెక్నో, ఫౌండేషన్, గ్లోబల్, ఇంటర్నేషనల్ పేర్లతో సొబగులు పోతున్న కార్పొరేట్ సంస్థల్లోకి తరలిపోతున్నారు. దీన్ని మన రాష్ట్రంలోని ప్రభుత్వ గురుకులాలు కొంత అడ్డుకున్నప్పటికీ, గురుకులాల దెబ్బ సాధారణ ప్రభుత్వ స్కూళ్ల మీదే ఎక్కువ పడింది. నియోమిడిల్ క్లాస్ పుణ్యమా అంటూ కార్పొరేట్ విద్యాసంస్థలు పెరిగి వటవృక్షాలైనాయి. మరి, గ్రామాల్లో చిన్న పట్టణాల్లో స్కూళ్లు కాలేజీలు బ్రతకాలంటే, ప్రభుత్వం అడపాదడపా కాగితం కలపలకు గ్రాంటు ఇవ్వడం కాకుండా పూర్తిగా దత్తత తీసుకుని ‘గ్లోబల్ ఆపర్చునిటీ ఇండెక్స్, నాణ్యత సూచిక’లకు అనుగుణంగా కరికులం డిజైన్ చేసి నడిపించడమే శరణ్యం.

డా. బెల్లియాదయ్య
9848392690

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News