Sunday, April 28, 2024

పథకాల అమలుపై రాష్ట్రాలను ఆదేశించలేము :సుప్రీంకోర్టు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రభుత్వ విధాన నిర్ణయాలను పరిశీలించడంలో న్యాయ సమీక్ష పరిధి చాలా పరిమితమని, మరింత మెరుగైన, తెలివైన, న్యాయమైన ప్రత్యామ్నాయం ఉన్నదన్న కారణంతో ఫలానా విధానాన్ని లేదా పథకాన్ని అమలు చేయాలని రాష్ట్రాలను న్యాయస్థానాలు ఆదేశించలేవని సుప్రీంకోర్టు తెలిపింది. ఆకలిని పారదోలి పౌష్టికాహారాన్ని అందచేయడానికి కమ్యూనిటీ కిచెన్లు((సామూహిక వంటశాలలు) పథకం రూపొందిచాలని కోరుతూ దాఖలైన ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ విషయంలో ఎటువంటి ఆదేశాలను జారీచేయడానికి నిరాకరించిన సుప్రీంకోర్టు జాతీయ ఆహార భద్రతా చట్టం వంటి సంక్షేమ పథకాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని తెలిపింది.

ప్రభుత్వ విధానం చట్టబద్ధత మాత్రమే న్యాయ సమీక్షను ఎదుర్కొంటుందే తప్ప విధానంలోని మంచి చెడ్డలు కాదని జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిథాల్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. విధానాలలోని ఉచితానుచితాలు, ంచి చెడ్డలు వంటివి న్యాయ సమీక్ష పరిధిలోకి రావని, విధానాలను రూపొందించి అమలు చేసే బాధ్యత కలిగిన ప్రభుత్వాలకు న్యాయస్థానాలు ఈ విషయంలో సూచనలు ఇవ్వలేవని ధర్మాసనం తెలిపింది. మరింత మెరుగైనవన్న కారణంతో నిర్దిష్టమైన విధానాన్ని కాని పథకాన్ని కాని అమలు చేయాలంటూ రాష్ట్రాలను కోర్టులు ఆదేశించలేవని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రత్యామ్నాయ సంక్షేమ పథకాలను అమలు జరిగేలా చూసే స్వేచ్ఛ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకే ఉందని సుప్రీంకోర్టు తెలిపింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News