వివాహం చేసుకుంటానని నమ్మించి డబ్బులు తీసుకుని యువకుడిని మోసం చేసిన సంఘటన హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బహదూర్‌పుర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాధితుడు సైబర్ నేరస్థుల మాటలను నమ్మి రూ.21.73లక్షలు పంపించాడు. పోలీసుల కథనం ప్రకారం… బహదుర్‌పుర పోలీస్ స్టేషన్ పరిధిలోకి చెందిన యువకుడికి సైబర్ నేరస్థులు 2023లో వాట్సాప్‌లో పరిచయం అయ్యారు. అప్పటి నుంచి బాధితుడితో నిందితులు తరచూ ఛాటింగ్ చేస్తున్నారు. సైబర్ నేరస్థులు యువతిగా నమ్మించేందుకు వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్‌ను పాకిస్థాన్‌కు చెందిన సినీనటీ ఫొటో పెట్టారు. దానిని చూసిన బాధితుడు తనతో యువతి, ఆమె సోదరి ఛాటింగ్ చేస్తున్నట్లుగా నమ్మాడు. తర్వాత నిందితులు బాధితుడిని మ్యాట్రీమోని గ్రూప్‌లో యాడ్ చేశారు.అప్పటి నుంచి వివాహం చేసుకుంటానని బాధితుడితో ఛాటింగ్ చేసేవారు.
ఇది నమ్మిన బాధితుడు వారి తల్లికి అనారోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పి నకిలీ డాక్యుమెంట్స్ వాట్సాప్‌లో పంపించారు, అది నిజమని నమ్మిన బాధితుడు డబ్బులు పంపించాడు. కొద్ది రోజుల తర్వాత నిందితులు డబ్బులను తిరిగి బాధితుడికి పంపించారు. బాధితుడు తమను నమ్ముతున్నట్లు గుర్తించిన నిందితులు తమ ప్లాన్‌ను అమలు చేశారు. ఇంటికి తీసుకున్న రుణం తీర్చాలని, తల్లీ చికిత్స చేయించాలని, డబ్బులు ఇస్తే మళ్లీ ఇస్తామని చెప్పారు. గతంలో డబ్బులు తిరిగి ఇవ్వడంతో బాధితుడు నమ్మి రూ.21.73లు పలుమార్లు సైబర్ నేరస్థులు చెప్పిన బ్యాంక్ ఖాతాలకు పంపించాడు. కొద్ది రోజుల తర్వాత నిందితుల నుంచి ఎలాంటి రెస్పాండ్ రాకపోవడంతో పలుమార్లు వారికి ఫోన్ చేశాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతోపాటు వాట్సాప్‌ను డిలిట్ చేయడంతో తాను మోస పోయానని గ్రహించాడు. వెంటనే బహదుర్‌పుర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.