సైబర్ నేరాలు అధికంగా ఉన్న రాష్ట్రాల పోలీసులు సమన్వయంతో వీటిని ఛేదిస్తున్నారు. కేవలం అవగాహన ద్వారానే వీటిని కట్టడి చేయడం వీలవుతుందని, తగిన జాగ్రత్తలు పాటిస్తే 60% నేరాలను అరికట్టవచ్చని అధికారులు అంటున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నెంబర్ 1930 కు రోజుకు 2 వేల కాల్స్ వస్తున్నాయి. పోలీసుల దాకా రానివి, చెప్పుకోలేనివి సగానికి పైగా ఉంటాయి. నల్లధనం పోయినవారు చెప్పుకొని కొత్త చిక్కులు తెచ్చుకోరు. యువతి బట్టలు విప్పి తన శరీరాన్ని చూపుతున్న వీడియో ద్వారా రెచ్చగొట్టి నగ్నచిత్రాలు తీసి బ్లాక్ మెయిల్ చేసే ‘హనీ ట్రాప్’ ఫోన్ కాల్స్ ద్వారా నష్టపోయిన వారున్నారు. డబ్బులు పోయినా వీటి గురించి పోలీసులకు చెప్పుకోలేని పరిస్థితి వారిది. జాతీయ స్థాయిలో నేషనల్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్ వర్క్ సిస్టం ఆగస్టు 2019లో ఏర్పడింది. దీనికి దేశంలోని 16 వేలకు పైగా పోలీస్ స్టేషన్లు అనుసంధానమై ఉన్నాయి.
మొబైల్ స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచమే గుప్పిట్లో ఉందనుకొనే రోజులివి. కోరిన పనులన్నీ చేసిపెడుతున్న అదే ఫోన్ జాగ్రత్తగా లేకపోతే బ్యాంకు ఖాతాల్లోని సొమ్మునంతా మన చేతులతోనే దోపిడీ దొంగలకు ధారపోయిస్తుంది. ఇంటర్‌నెట్ ఆధారంగా జరుగుతున్న ఈ మోసాలను కనిపెట్టుకొని ఉండకపోతే ఉన్నదంతా ఊడ్చుకుపోవడం ఖాయం. డబ్బులన్నీ పర్సులు, ఇంటి లాకర్లలోంచి మొబైల్ ఆధారిత బ్యాంకు ఖాతాల్లో భద్రంగా ఉండడంతో దొంగల చూపు అటు తిరిగింది. వేట రూపం మారిపోయింది. ఇప్పుడది కూడా ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ అయిపోయింది. ఎంతో పొదుపుతో కూడబెట్టుకున్న సొమ్ము సైబర్ నేరగాళ్ల మాయమాటలు నమ్మి మోసపోతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఒక్క ఈ మార్చి నెలలోనే తెలంగాణ పౌరులు సైబర్ మోసాల్లో రూ. 150 కోట్లు పోగొట్టుకున్నారంటే వీరి సత్తా ఏంటో తెలుస్తోంది.
నష్టపోయిన వారిలో ఎక్కువగా విశ్రాంత ఉద్యోగులు, గృహిణులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, నిరుద్యోగులు.. ఇలా చదువుకున్నవారే ఉన్నారని పోలీసు రికార్డులు చెబుతున్నాయి. సాలరీలో మిగిలిన మొత్తాన్ని పొదుపుచేసి మంచి లాభాలు గడించాలనే ఉద్యోగుల ప్రణాళిక ఒక్కోసారి మొదటికే మోసమైపోతోంది. బ్యాంకు డిపాజిట్ల కన్నా మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి ద్వారా అధిక లాభం పొందే అవకాశం ఉందని అనుకోవడంలో తప్పులేదు. అయితే కూచున్నచోటే పని అవుతుందని డిజిటల్ ట్రేడింగ్ ప్లాట్ ఫారమ్‌లను నమ్ముతున్నారు. అలా మోసకారక యాప్స్ లను నమ్మి వారు కోరిన విధంగా వ్యవహరించడంతో నష్టం జరిగిపోతోంది. ఎవరో పంపిన మెసేజిని నమ్మి, వారు ఇచ్చిన లింక్‌ను తెరిచి అందులో వివరాలన్నింటినీ బహిర్గతపరచి, చివరకు బ్యాంకు బ్యాలెన్స్‌ను పోగొట్టుకోవడంతో కథ ముగుస్తుంది.
నిజానికి అన్ని ఫండింగ్ సంస్థలు సొంత వెబ్ సైట్ల ద్వారా సురక్షితంగా ఇలాంటి లావాదేవీలు నడుపుతున్నాయి. బూటకపు యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకొని వాటి వలలో పడవద్దు. రూ. వేయి ఒక్క రోజులోనే రెట్టింపు అయినట్లు నమ్మించి, ఆశచూపి చివరకు లక్షల్లో కొంప ముంచుతారు. ఇక్కడ మనుషుల అత్యాశనే కీలకంగా పనిచేస్తోంది. ఆశ మబ్బులా మారి విచక్షణను కమ్మి వేస్తుంది. డబ్బు చేజారిపోయాక ‘నేనేనా ఇంత మోసానికి బలి అయింది. నా తెలివి ఏమైయింది. నలుగురికి చెప్పేవాన్ని ఎలా బోల్తాపడ్డాను’ అనుకొనేవారే ఎక్కువ. సైబర్ మోసాలు ఎన్నో రకాలుగా ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరినీ ముగ్గులో దించే పథకాలు వారి దగ్గరున్నాయి. ఇప్పటికే ఈ మోసాలకు చెందిన కాల్స్, మెసేజ్ లు రానివారు ఒక్కరు కూడా లేరని చెప్పవచ్చు. చివరకు చిన్నగానే, పెద్దగానో వీరి బారినపడకుండా మిగిలేవారి సంఖ్య కూడా తక్కువే ఉంటుంది.
పోయిన సొమ్ము చేతులు మారి చకచకా అందనంత దూరం వెళ్ళిపోతుంది. సైబర్ పోలీసులు ఎంత కష్టపడ్డా ఇప్పటివరకు రికవరీ అయినా సొమ్ము 15% దాటలేదు. మన రాష్ట్రంలో 2021 లో రూ. 36 కోట్ల మోసంలో రికవరీ అయింది 6.5% మాత్రమే. 2022 లో రూ. 169 కోట్లలో 7%, 2023లో 922 కోట్లలో 12% సొమ్మును మాత్రమే కాపాడగలిగారని తెలుస్తోంది. జూన్ 2023లో ఈ నేరాల పరిశోధన కోసం తెలంగాణలో ప్రత్యేకంగా స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏర్పాటైంది. పోలీసు సిబ్బందికి కంప్యూటర్ ఆపరేషన్‌లో శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే వేయి మందికి స్పెషల్ ట్రైనింగ్ ఇప్పించారు. జిల్లా పోలీస్ స్టేషన్‌లలో ఒక విభాగం ప్రత్యేకంగా పని చేస్తోంది.
సైబర్ నేరాలు అధికంగా ఉన్న రాష్ట్రాల పోలీసులు సమన్వయంతో వీటిని ఛేదిస్తున్నారు. కేవలం అవగాహన ద్వారానే వీటిని కట్టడి చేయడం వీలవుతుందని, తగిన జాగ్రత్తలు పాటిస్తే 60% నేరాలను అరికట్టవచ్చని అధికారులు అంటున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నెంబర్ 1930 కు రోజుకు 2 వేల కాల్స్ వస్తున్నాయి. పోలీసుల దాకా రానివి, చెప్పుకోలేనివి సగానికి పైగా ఉంటాయి. నల్లధనం పోయినవారు చెప్పుకొని కొత్త చిక్కులు తెచ్చుకోరు. యువతి బట్టలు విప్పి తన శరీరాన్ని చూపుతున్న వీడియో ద్వారా రెచ్చగొట్టి నగ్నచిత్రాలు తీసి బ్లాక్ మెయిల్ చేసే ‘హనీ ట్రాప్’ ఫోన్ కాల్స్ ద్వారా నష్టపోయిన వారున్నారు. డబ్బులు పోయినా వీటి గురించి పోలీసులకు చెప్పుకోలేని పరిస్థితి వారిది. జాతీయ స్థాయిలో నేషనల్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్ వర్క్ సిస్టం ఆగస్టు 2019లో ఏర్పడింది. దీనికి దేశంలోని 16 వేలకు పైగా పోలీస్ స్టేషన్లు అనుసంధానమై ఉన్నాయి.
పోలీసు వ్యవస్థకు టెలీకమ్యూనికేషన్స్, ఐటి, ఆర్‌బిఐ అన్ని విధాలుగా సహకరిస్తూ నేరాల కట్టడికి తోడ్పడుతున్నాయి. ఒకవైపు ఇలాంటి కాల్ చేసే సిమ్ కార్డులను బ్లాక్ చేస్తూ, మరోవైపు సొమ్ము జమైన బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేస్తూ వీలైనంత ఈ నేరాలను నిరోధించేందుకు కృషి జరుగుతోంది. ఈ నేరాలకు కేంద్రంగా జార్ఖండ్‌ను చెప్పుకోవాలి. అందుకే జార్ఖండ్‌లో కేంద్ర గృహ మంత్రిత్వ శాఖ ‘ప్రతిబింబ్’ అనే వెబ్ పోర్టల్‌ను ఏర్పాటు చేసి సైబర్ కాల్స్ గుర్తించే పని చేపట్టింది. సైబర్ మోసం ఒక సిమ్ కార్డుతో మొదలై ముగుస్తుంది. మరో మోసానికి మరో సిమ్ వాడుతారు. తగిన నిరూపణలు లేకుండా విచ్చలవిడిగా సిమ్ కార్డుల అమ్మకం ఈ మోసాలకు తోడ్పడుతోంది. సిమ్ కార్డు కొనేప్పుడు ఇచ్చే ఐడి ధ్రువీకరణ జరగదు. పేరు, అడ్రస్ సరిగాలేక ఆ ఆధారాలు పనికి రావడం లేదు. నెట్ ఫ్లిక్స్‌లో ఉన్న ‘జాంతారా’ వెబ్ సిరీస్‌లో ఇలాంటి ఎన్నో విషయాలు ఉన్నాయి. టెలీకమ్యూనికేషన్ యాక్ట్, 2023 ప్రకారం మన దేశంలో ఒకరి పేరుపై 9 సిమ్ కార్డులు మించి ఉండకూడదు.
అంతకు మించి ఉన్నా, ఐడిలో తప్పు ఉన్నా రూ. 50 వేల జరిమానా, 3 ఏళ్ల జైలు శిక్ష అని చట్టంలో ఉంది. దీనిని కచ్చితంగా అమలు చేస్తే ఆదిలోనే అరికట్టవచ్చు. సిమ్ కార్డుల నియంత్రణ ఎంతో మేలు చేస్తుంది. సైబర్ నేరాలు మనుషులను ప్రత్యక్షంగా కత్తితో బెదిరించో, ఇళ్ల తాళాలు పగలగొట్టో జరగవు. మనుషులను మురిపించి, మాయచేసి వారి చేతులతోనే జరిపించుకుంటాయి. మోసపోయేవారు కూడా విషయం ఇంకొకరితో పంచుకోకుండా ఒంటరి నిర్ణయాలు తీసుకుంటారు. ఈ మాయకు కారణాలుగా కొందరి డిజిటల్ నిరక్షరాస్యత, ఇంకొందరి అత్యాశ అని చెప్పవచ్చు. మోసపోయాక కాకుండా ముందే కొంత సమయం తీసుకొని ఆలోచిస్తే, సెకండ్ ఒపీనియన్ తీసుకుంటే నష్టపోయిన బాధతప్పడంతో పాటు పోలీసులకు శ్రమ తగ్గించవచ్చు.
బి.నర్సన్ 9440128169