Thursday, February 22, 2024

80 ఏళ్లలో మొదటిసారి దళితుల ఆలయ ప్రవేశం

- Advertisement -
- Advertisement -

చెన్నై: ఎట్టకేలకు దళితుల కల నెరవేరింది. దాదాపు 80 ఏళ్ల క్రితం తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా తెన్ముడియనూర్ గ్రామంలో నిర్మించిన ముత్తుమారియమ్మన్ ఆలయాన్ని తమ జీవితకాలంలో ఒక్కసారైనా దర్శించుకోవాలన్న ఆ ఎస్‌సి ప్రజల కోరికను జిల్లా ఎస్‌పి మురుగేష్ నెరవేర్చారు.

హిందూ రిలీజియస్ అండ్ ఎండోమెంట్స్ దిపార్ట్‌మెంట్(హెచ్‌ఆర్ అండ్ సిఇ) పరిధిలోని ఈ ఆలయంలోకి దళితుల ప్రవేశంపై నిషేధం ఉంది. తమకు ఆలయ ప్రవేశం కల్పించాలంటూ అనేక దశాబ్దాలుగా దళితులు చేస్తున్న అభ్యర్థనలను ఆ గ్రామంలోఇ అగ్రవర్ణాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. కాగా..సోమవారం అగ్రకులాలకు చెందిన దాదాపు వెయ్యి మంది గ్రామ మహిళలు ఆలయం వెలుపల నిలబడి తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తుండగా జిల్లా కలెక్టర్ బి మురుగేష్, జిల్లా ఎస్‌పి కె కార్తికేయన్ సారథ్యంలో దళితులు ఆలయ ప్రవేశం చేశారు.

గత 80 ఏళ్లలో మొట్టమొదటిసారి దళితులు ట్రాక్టర్లలో టన్నుల కొద్దీ పూలు, పండ్లు వెంటపెట్టుకుని ఊరేగింపుగా ఆలయంలోకి ప్రవేశించి జిల్లా అధికారుల సమక్షంలో అమ్మవారికి పూజలు చేశారు. అయితే..దళితులకు ఆలయ ప్రవేశం కల్పించాలన్న అధికారుల నిర్ణయంపై గ్రామానికి చెందిన అగ్రకులాల ప్రజలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తూ దళితులతో గొడవకు దిగడంతో ఆలయంలో గడచిన రెండు రోజులుగా మూతపడింది. 12 రోజులపాటు జరిగే వార్షిక ఉత్సవాల సందర్భంగా తమకు ఆలయంలోకి ప్రవేశం కల్పించాలని కోరుతూ దళితులు హెచ్‌ఆర్ అండ్ సిఇ శాఖకు దరఖాస్తు చేసుకున్న దరిమిలా ఈ గొడవ జరిగింది.

దీనిపై దర్యాప్తు జరిపిన సంబంధిత శాఖ అధికారులు దళితులకు సోమవారం ఆలయ ప్రవేశం కల్పించాలని నిర్ణయం తీసుకోవడంపై గ్రామంలోని అగ్రకులాల ప్రజలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో పోలీసులను పెద్ద ఎత్తున మోహరించిన అధికారులు దళితుల చేత ఆలయ ప్రవేశం చేయించారు. ఇక నుంచి ఆలయంలోకి అన్ని కులాల వారికి ప్రవేశం ఉంటుందని, ఎవరైనా వివక్ష ప్రదర్శిస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్, ఎస్‌పి ఈ సందర్భంగా తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News