మన తెలంగాణ/సిటీ బ్యూరో: చారిత్రక ‘గాం ధీ’ ఆసుపత్రిలో మృత్యుఘంటికలు మోగుతున్నాయి. వైద్యం కోసం వస్తే ప్రాణాలు పోయే దుస్థితి ఏర్పడింది. ఉన్నతాధికారుల పర్యవేక్ష ణా లోపానికి తోడు కొందరు వైద్యాధికారుల ని ర్లక్షం… ఇంకొందరు వైద్యుల అనుభవలేమి తో పసిపిల్లలు, వారి తల్లులు,గర్భిణీలు పిట్ట ల్లా రాలిపోతున్నారు. ఒక్క ఆగస్టు నెలలోనే 62 మంది పసిపిల్లలు, బాలింతలు మృతి చెం దడం రాజధానిలో తీవ్ర క లకలం రేపుతోంది. ఎంతో మంది ప్రాణాలు కా పాడి దేశవ్యాప్తంగా ఖ్యాతి గడించిన గాంధీ ఆసుపత్రిలో కొందరి ని ర్లక్షం ఎంతోమంది ప్రాణాల ను బలికొంటుందన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ప్ర జాప్రతినిధులకు విన్నవించినా పట్టించుకునేవా రే లేకపోవడంతో
మృత్యుబారిన పడేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. నగరంలోని గాంధీ ఆసుపత్రికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుంచి నిరుపేదలు అనేకమంది వైద్యసేవలకోసం వస్తుంటారు. అయితే, ఇక్కడ కొన్నిరోజులుగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆసుపత్రికి రావాలంటేనే జంకుతున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ పూర్తిగా లోపించడం ఆసుపత్రిలో సరైన వైద్యం అందించకపోవడంవల్లే నిత్యం మృత్యువాత పడుతున్నారన్న విమర్శలు కోకొల్లలుగా వినిపిస్తున్నాయి. అనుభవమున్న సీనియర్ వైద్యులను జిల్లాలకు సాగనంపడంతో విషమపరిస్థితుల్లో ఆసుపత్రికి వచ్చిన వారిని అనుభవంలేని వైద్యులకు అప్పగించడం కూడా పెనుసమస్యగా మారుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రోగులకు అందిస్తున్న వైద్యసేవలనుగానీ, సమస్యలుగానీ ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం, రివ్యూలు నిర్వహించకపోవడంవల్లే ఈ దుస్థితి ఏర్పడిందన్న గుసగుసలూ వినిపిస్తున్నాయి. ఆగస్టు నెలలో పురిటినొప్పులతో ఆసుపత్రిలో చేరిన వారిలో 48 మంది పసిపిల్లలు, 14 మంది గర్బిణీలు,బాలింతలు మృతిచెందినట్లు ఆసుపత్రివర్గాల రికార్డులు చెబుతున్నాయి. ఇందులో నగరంతో పాటు వివిధ జిల్లాలకు చెందిన నిరుపేదలు ఉన్నారు. ఆగస్టు 2న ఒకరు, 6న ఇద్దరు, 7న ఇద్దరు,9న ఒకరు, 11న ఇద్దరు, 12న ఇద్దరు, 13న ఐదుగురు, 14న ఒకరు, 16న ముగ్గురు,17న నలుగురు, 18న ఇద్దరు, 20న ఒకరు, 23న ముగ్గురు, 24న ముగ్గురు, 26న ఒకరు, 27న ఒకరు, 28న ఇద్దరు, 30న ముగ్గురుతో పాటు మరో ఏడుగురు ఆచూకి లేని పసిపిల్లలు మృతిచెందినట్లు తెలుస్తోంది. అలాగే, ఆగస్టు 5వ తేదీన ఇద్దరు గర్బిణీలు, 6,7,9,17,తేదీలలో ఒక్కొక్కరు,
19న ఇద్దరు, 20న ఒకరు, 23,26,27,28,30, తేదీలలో ఒక్కొక్కరు చొప్పున గర్బిణీలు మృత్యువాతన పడినట్లు రికార్డుల ద్వారా తెలిసింది. ఆసుపత్రిలో నెలకొన్న పలు సమస్యలతో సరైన వైద్యం అందక మృతుల సంఖ్య పెరుగుతున్నా అధికార యంత్రాంగం పట్టనట్టు వ్యవహరిస్తుందని సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. రోడ్డు ప్రమాదాలతో చావుబతుకుల మధ్య పోరాడుతూ ఆసుపత్రికి వచ్చిన వారి పరిస్థితి మరింత దయనీయంగా ఉందని, ఇక్కడికి వస్తే చావు తప్పదని ఆసుపత్రి ఆరుబయట ఉన్న రోగుల బంధువులే చెబుతుండటం విశేషం. గతవారం ఆసుపత్రిలో తనిఖీ నిర్వహించిన ఆరోగ్యశాఖ మంత్రికి రోగులు, వారి బందువులు సమస్యలపై విన్నవించారు. ఇక మీదట మెరుగైన వైద్యసేవలు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చినా అధికార యంత్రాంగంలో ఏమాత్రం చలనం లేకుండా పోయిందని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం సత్వరమే తగుచర్యలు చేపట్టి మెరుగైన సేవలు అందించి ప్రజల ప్రాణాలు కాపాడాలని కోరుతున్నారు.
మెరుగైన సేవలు అందిస్తున్నాంః డాక్టర్ సునీల్‌కుమార్
గాంధీ ఆసుపత్రికి వచ్చే ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామని ఆసుపత్రి సీనియర్ వైద్యులు డాక్టర్ సునీల్‌కుమార్ తెలిపారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజకుమారి సమావేశాల సందర్బంగా అందుబాటులో లేకపోవడంతో సునీల్‌కుమార్ వివరణ ఇచ్చారు. విషమ పరిస్థితుల్లో ఆసుపత్రికి రావడంతోనే మృతిచెంది ఉండవచ్చునని అన్నారు.