Saturday, July 27, 2024

హోర్డింగ్ కూలిన ప్రమాదం..16కు పెరిగిన మృతుల సంఖ్య

- Advertisement -
- Advertisement -

ముంబై లోని ఘాట్ కోపర్ వద్ద హోర్డింగ్ కుప్పకూలిన సంఘటనలో మృతుల సంఖ్య 16 కు చేరింది. శిథిలాలను తొలగిస్తుండగా బుధవారం రాత్రి మరో రెండు మృతదేహాలు బయటపడ్డాయి. మృతులు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విశ్రాంత మేనేజర్ మనోజ్ చన్సోరియా(60) , ఆయన భార్య అనితా చన్సోరియా(59) గా పోలీసులు గుర్తించారు. సోమవారం సాయంత్రం ముంబై లోని పలు ప్రాంతాల్లో అకాల వర్షం , ఈదురుగాలులు బీభత్సం సృష్టించడంతో సుమారు 250 టన్నుల బరువు ఉన్న హోర్డింగ్ ఒక పెట్రోల్ పంప్‌పై కుప్పకూలిన సంఘటన తెలిసిందే. దాంతో దాని కింద దాదాపు 100 మంది చిక్కుకు పోయారు. వారిలో ఈ దంపతులు కూడా ఉన్నారు. ఆ శిధిలాలను తొలగిస్తోన్న తరుణంలో ఒక కారులో వీరి మృతదేహాలను గుర్తించినట్టు పోలీస్‌లు తెలిపారు.

ముంబై ఏటీసీలో జనరల్ మేనేజర్ హోదాలో పనిచేసిన చన్సోరియా, రెండు నెలల క్రితమే పదవీ విరమణ చేశారు. తరువాత వారు నగరాన్ని వీడి జబల్‌పూర్‌కు తరలిపోయారు. వీసా నిమిత్తం కొద్ది రోజుల క్రితం వారు ఇక్కడకు వచ్చారని బంధువులు తెలిపారు. పని పూర్తి చేసుకొని జబల్‌పూర్ వెళ్తుండగా, పెట్రోల్ ఫిల్ చేసుకునేందుకు బంక్ వద్ద కారు ఆపిన సమయం లోనే మృత్యువు వారిని కబళించింది. అయితే రెండు రోజులుగా తల్లిదండ్రులు తన ఫోన్ ఎత్తక పోవడంతో అమెరికాలో ఉన్న వారి కుమారుడు ఆందోళనకు గురయ్యాడు. ఇక్కడ తన బంధువులను అప్రమత్తం చేయడంతో వారు మిస్సింగ్ ఫిర్యాదు చేశారు. మనోజ్ ఆఖరి మొబైల్ లొకేషన్ చెడ్డానగర్ పెట్రోల్ పంప్ వద్ద అని తేలడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆ ప్రాంతంలో నిరీక్షించారు. తరువాత వీరి మృతదేహాలు బయటపడ్డాయి. అమెరికాలో ఉంటున్న వీరి కుమారుడు బుధవారం రాత్రి వచ్చి ఉంటాడని తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News