Sunday, December 15, 2024

అమ్మో చలి

- Advertisement -
- Advertisement -

రెండు రోజులుగా తగ్గుతున్న ఉష్ణోగ్రతలు
లానినా ప్రభావంతోనే పెరిగిన చలి
రానున్న రోజుల్లో మరింత పెరగనున్న చలి
తూర్పు, ఈశాన్య ఈదురు గాలుల ప్రభావం రాష్ట్రంపై అధికం
తెలంగాణలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు
ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణపై చలి పులి పంజా విసురుతోంది. గత కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో రోజురోజుకూ చలి తీవ్రత పెరుగుతోంది. హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించడం ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం. మరీ ముఖ్యంగా తెల్లవారుజామున పొగ మంచు కప్పేస్తుంది. కొన్ని ప్రాంతాల్లో ఉదయం 9 గంటలు దాటినా ఆ ప్రభావం అలాగే ఉంటోంది. దీంతో రోడ్లపైకి వచ్చే వాహనదారులు లైట్లు వేసుకుని వాహనాలను నడిపించాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. మధ్యాహ్నం సమయంలో సాధారణ, రాత్రి సమయాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, లా నినా ప్రభావంతో ముందు ముందు మరింత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు.

చిన్న పిల్లలు, వృద్ధుల పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. 2024 జనవరి సీజన్‌లో హైదరాబాద్ నగరంలో 8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా, ఈసారి మరింత తక్కువ నమోదయ్యే అవకాశం ఉందని ఇండియన్ మెట్రాలజీ విభాగం స్పష్టం చేసింది. గత రెండు రోజులుగా రాష్ట్రంలో చలి ప్రభావం పెరిగింది. తెల్లవారు జామున రోడ్లపై ఏమీ కనిపించలేనంతగా మంచు కమ్మేస్తోంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత అధికంగా ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు తెలిపారు. కనిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పట్టాయని వివరించారు. ముఖ్యంగా ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో అధికంగా చలి తీవ్రత ఉందని రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశముందని తెలిపారు.

దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఉష్టోగ్రతలు సాధారణంగానే ఉన్నాయి. ఆదిలాబాద్‌లో 12.7 కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రోజుల్లో ఇంకా ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశముంది. రానున్న 5 రోజుల పాటు ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ఆదిలాబాద్, మెదక్, పటాన్‌చెరు ప్రాంతాల్లో సాధారణ కం ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు తెలిపారు. ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించడం వల్ల నవంబరు నుంచి చలి తీవ్రత ఎక్కువవుతుందని వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు తెలిపారు. ఈ కారణంగానే ఈ నెల నుంచి మంచు కురుస్తున్నట్లు ఆయన వివరించారు. తూర్పు, ఈశాన్య ఈదురు గాలుల ప్రభావం కూడా రాష్ట్రంపై అధికంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

ఈ గాలిలో తేమ అధిక శాతం ఉంటున్న కారణంగా అవి ఉత్తర తెలంగాణలోకి ప్రవేశించగానే పొగ మంచు పడటం మొదలవుతుందని వివరించారు. ఈ పవనాలు దక్షిణ భారతం నుంచి మధ్య, ఉత్తర భారతం వైపుగా సాగుతాయని చెప్పారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో అతి తక్కువగా 3.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత 1973లో నమోదు కాగా 2023 లో వికారాబాద్ జిల్లా గండీడ్‌లో 3.5 డిగ్రీలు నమోదైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత అత్యధికంగా నమోదవుతోంది. రాష్ట్రంలో సగటు చలికాల ఉష్ణోగ్రతలు 22 నుంచి 23 డిగ్రీల సెల్సియస్ కాగా కొన్నేళ్లుగా దీని కన్నా తక్కువ స్థాయిలో సగటు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వివరించారు. ఈ నేపథ్యంలో వైద్యులు పలు సలహాలు ఇస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధులున్న వారు జాగ్రత్తగా ఉండటం తప్పనిసరి అని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా 60 సంవత్సరాలు పైబడిన వారిలో రక్తనాళాలు కుచించుకుపోవటంతో పాటు, రక్తం గడ్డ కట్టే సమస్యలు ఈ కాలంలో అధికంగా ఉంటాయని చెబుతున్నారు. కనీసం సంవత్సరానికి ఒకసారైనా బాడీ చెకప్ చేసుకోవాలని సూచిస్తున్నారు.

పిల్లలు వృద్ధులు జాగ్రత్త వహించాలి : శీతాకాలంలో చలి తీవ్రత ఉదయం 4.30గంటల నుంచి ఎక్కువగా ఉంటుందన్న ఆయన దట్టమైన పొగ మంచు కురుస్తోంది. సూర్యరశ్మి పెరుగుతున్న సమయంలో మంచు పోతోంది. శీతాకాలంలో చిన్న పిల్లలు, వృద్ధులు వేడి పానీయాలు తీసుకోవాలని, ముదురు రంగు దుస్తులు ధరించాలని వైద్యులు సూచించారు. ప్రస్తుతం వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పుల కారణంగా వైద్యులు పలు సలహాలు ఇస్తున్నారు. వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు అత్యంత జాగ్రత్తగా ఉండటం తప్పనిసరని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా 60 సంవత్సరాలు పైబడిన వారిలో రక్తనాళాలు కుంచించుకుపోవటంతో పాటు, రక్తం గడ్డకట్టే సమస్యలు అధికంగా ఉంటాయని చెబుతున్నారు. వేడి పదార్థాలు మాత్రమే ఆహారంగా తీసుకోవాలని, ఎప్పటికప్పుడు వంట చేసుకుని తినడం మేలని సూచిస్తున్నారు. సంవత్సరానికి కనీసం ఒకసారైనా బాడీ చెకప్ చేసుకుంటే మేలని తెలిపారు.

పెరుగుతున్న చలి తీవ్రత : తెలంగాణలో చలి తీవ్రత క్రమేపీ పెరుగుతోంది. కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో చలి ప్రభావం ఎక్కువవుతోంది. సోమవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం గిన్నెధరిలో 12.0 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. అదే జిల్లాకు చెందిన సిర్పూర్(యు) లో 12.3, వాంకిడిలో 12.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లో చలి ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 12- 13 డిగ్రీల లోపే నమోదయ్యాయి. రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల జిల్లాలో సైతం ఉష్ణోగ్రతలు 13 నుంచి -15 డిగ్రీల స్థాయికి పడి పోయాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా లోనూ ఈ సీజన్‌లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వికారాబాద్ జిల్లా లోని మర్పల్లి, రంగారెడ్డి జిల్లా చందన్వెల్లిల్లో వరుసగా రెండో రోజు 12.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. హైదరాబాద్ శివారు లోని ఇబ్రహీంపట్నం, మహేశ్వరం ప్రాంతాల్లో 12.6 డిగ్రీలు నమోదు కావడం విశేషం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News