Saturday, April 27, 2024

మహానగరంలో జనగాయాలెన్నో..

- Advertisement -
- Advertisement -
Delhi-Violence
తమ వారికోసం తల్ల‘ఢిల్లీ’

న్యూఢిల్లీ : ఘర్షణల గాయం నుంచి తేరుకుంటున్న ఢిల్లీలో ఇప్పుడు హృదయ విదారక దృశ్యాలు కన్పిస్తున్నాయి. ఇంటినుంచి వెళ్లిన వారు ఇంతవరకూ తిరిగి రాకపోవడంతో ఎందరో తల్లడిల్లుతున్నారు. ఇక తమ వారు దాడులలో మృతి చెందారని తెలియడంతో వారి ఆత్మీయులు దిగాలుగా ఆసుపత్రుల వద్ద పడిగాపులు పడుతున్నారు. ఈశాన్య ఢిల్లీలో వరుస ఘటనల్లో మృతి చెందిన వారికి పోస్టుమార్టం ఇతర ప్రక్రియలు చేపడుతున్నారు. వారి మృతదేహాలను తీసుకుని వెళ్లేందుకు వారి బంధువులు మార్చురీల వద్ద ఎదురుచూడాల్సి వస్తోంది. స్థానిక జిటిబి ఆసుపత్రి వద్ద జనం గుమికూడి ఉన్నారు. రోదనల నడుమ అక్కడ వాతావరణం బరువెక్కింది.

తమ వారు చాలా రోజులుగా ఇంటికి రాకపోవడంతో కొందరు ఆసుపత్రుల వద్దకు వచ్చి గాయపడ్డ, మృతుల జాబితాను నిర్థారించుకుంటున్నారు. తమ వారి పేర్లు ఉన్నాయో లేదో తెలుసుకుంటున్నారు. అయితే చాలా మందికి వెంటనే సరైన సమాధానాలు రాకపోవడంతో కన్పించకుండా పోయిన వారి బంధువులలో ఆందోళన తీవ్రతరం అయింది. తాము అక్కడే ఉండాలా? లేక వేరే చోట వెతకాలా? తెలియక గందరగోళానికి గురవుతున్నారు. 35 ఏండ్ల ముదస్సిర్ ఖాన్ కన్పించకుండా పొయ్యాడు. ఆయన బంధువులు చివరికి ఆయన చనిపోయినట్లు తెలియడంతో ఆసుపత్రి వద్దకు వచ్చి శవం కోసం చూస్తున్నారు.

రెండు రోజుల నుంచి ఇక్కడనే ఉన్నట్లు, ఓ సారి ఫైలు సిద్ధం చేయాలి, మరోసారి పోస్టుమార్టం పూర్తి కావాలని చెపుతున్నారని బంధువులు తెలిపారు. ఏదో విధంగా భౌతికకాయం అందితే తీసుకువెళ్లి అంత్యక్రియలు పూర్తి చేస్తామని మేనల్లుడు అర్బాజ్ ఖాన్ చెప్పారు. తాము ముస్తఫాబాద్ ప్రాంతంలో ఉంటున్నట్లు ఇప్పటికీ పరిస్థితి భయంగానే ఉందని తెలిపారు. రాత్రిపూట నిద్రలేకుండా పోతోందని, పిల్లలు స్కూళ్లకు పోవడం లేదు. పెద్దలు పనులకు వెళ్లడం లేదని చెప్పారు. మూడురోజులలో ఏం జరిగిందో తెలుసుకుంటేనే వణుకుపుడుతోందన్నారు.

ఇంతకూ ముదస్సిర్ ఖాన్ చేసిన నేరం ఏదీ లేదు. ఆరోజు కర్దామ్‌పురిలో తన ఇంటి బయట కూర్చోని ఉన్నాడు. ఓ గుంపు వచ్చి దాడికి దిగింది. ఈలోగానే నుదుటిలోకి బుల్లెట్లను దించారు. ఆసుపత్రికి చేర్చేలోగానే ఖాన్ మృతి చెందినట్లు వెల్లడైంది. ప్లాస్టిక్ వ్యర్థాల దుకాణంలో పనిచేసే ఖాన్ భార్య పిల్లలతో కలిసి జీవిస్తున్నాడు. ఖాన్ తరహాలో పలువురు దుర్మరణం చెందారు. అసలు ఎందుకు తమ వారు ప్రాణాలు పోగొట్టుకున్నారు. వారు చేసిన తప్పేమిటీ? తాము ఎవరికి తమ గోడు విన్పించుకోవాలి? తెలియక తుపాన్ తరువాతి ప్రశాంతతను అనుభవిస్తున్న జనం వాపోతున్నారు.

బాధితులకు ఢిల్లీ సర్కారు సాయం..

ఢిల్లీ ఘర్షణలలో బాధిత కుటుంబాలకు కేజ్రీవాల్ ప్రభుత్వం ఆర్థిక సాయం, ఇతరత్రా తోడ్పాటును ప్రకటించింది. మృతుల కుటుంబాలకు పది లక్షల రూపాయలు, లక్ష రూపాయల ఎక్స్‌గ్రేషియా అందించనున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం విలేకరుల సమావేశంలో తెలిపారు. తక్షణ సాయం కింద రూ లక్ష నగదు అందిస్తామని, సంబంధిత మరణ పత్రాలు ఇతరత్రా అంశాల ధృవీకరణ తరువాత మిగిలిన సాయం ఉంటుందని వివరించారు. మృతులు మైనర్లు అయితే వారి తల్లిదండ్రులకు రూ 5 లక్షల సాయం అందిస్తారు. తీవ్రంగా గాయపడ్డ వారికి రూ 2 లక్షల సాయం ఇస్తారు. రోజువారి పనులకు వెళ్లే వారి జీవనాధారం పోయినా, వారు వెంటనే పనులలోకి వెళ్లలేని స్థితిలో పడ్డా, వారిని గుర్తించి తగు విధంగా సాయం అందిస్తారని ముఖ్యమంత్రి తెలిపారు.

Delhi Violence Over CAA Protest Updates

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News