Monday, April 29, 2024

గద్దెనెక్కిన సారలమ్మ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ములుగు జిల్లా ప్రతినిధి : తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన మేడారం జాతర బుధవారం ఘనం గా ప్రారంభమైంది. కోరిన కోర్కెలు తీర్చే వన దేవత సారలమ్మ బుధవారం రాత్రి మేడారం గద్దెపై కొలువు దీరింది. తొలుత కన్నెపల్లి నుంచి మేడారంలో ఉన్న కన్నతల్లి సమ్మక్క చెంతకు సారలమ్మ చేరుకుంది. రాత్రి గద్దెలపైకి వచ్చింది. సా రలమ్మతోపాటు గంగారం మండలం, పూనుగొండ్ల నుండి ప గిడిద్దరాజు, ఏటూరునాగారం మండలం, కొండాయి నుండి గోవిందరాజు గద్దెలపైకి చేరారు. ఈ ముగ్గురు వనదేవతల రా కతో మేడారం వన జాతర వైభవంగా మొదలైంది.బుధవారం సాయంత్రం 4 గంటలకు కన్నెపల్లిలో సారలమ్మ పూజారులు రహస్య పూజలు నిర్వహించారు. రాత్రి 8 గంటల వరకు వా యిద్యాలు, నృత్యాలతో కన్నెపల్లి ఆలయం మార్మోగింది. పం చాయతీరాజ్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఆదివాసీలతో కలిసి నృత్యం చేశారు.

అనంతరం ఆలయం నుంచి రాత్రి 8 గంటలకు మొంటెలో అమ్మవారి ప్రతిరూపమైన పసుపు, కుంకుమలు తీసుకుని మేడారానికి పూజారులు బయలుదేరారు. సారలమ్మ ప్రధాన పూజారి అమ్మవారి ప్రతిమను మొంటిలో తీసుకుని కన్నెపల్లి ఆలయం మెట్లు దిగి ముందుకు కదులుతుండగా సంతాన భాగ్యం కోసం ఎదురుచూసే భక్తులు గుడి ముందు కింద పడుకొని పొర్లుదండాలతో వరం పట్టారు. సారలమ్మను తీసుకువస్తున్న పూజారులు వీరిపై దాటి వెళ్లారు. కన్నెపల్లిలో మహిళలు మంగళ హారతులు, కొబ్బరి కాయలు, బిందెలతో నీళ్లు ఆరగించి పూజలు చేసి సారలమ్మను మేడారానికి సాగనంపారు. హనుమాన్ జెండా నీడలో కన్నెపల్లి వెన్నెలమ్మగా పేరున్న సారలమ్మ గద్దెలపైకి చేరారు. పోలీసులు, సిఆర్‌పిఎఫ్ బలగాలు మూడంచెల రోప్ పార్టీతో భద్రత కల్పించారు. మార్గమధ్యలో జంపన్నవాగులో ప్రత్యేక పూజలు చేశారు. వంతెన ఉన్నా నీటిలో నుంచే నడుస్తూ వాగును దాటారు. కన్నెపల్లి నుంచి 4 కిలోమీటర్ల దూరంలోని మేడారం గద్దెల వద్దకు సారలమ్మను తీసుకువచ్చే అద్భుత సన్నివేశాన్ని కనులారా చూసేందుకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు.

సారలమ్మ గద్దెకు రాకను సూచిస్తూ ఆదివాసీ పూజారులు కొమ్ము బూరలు ఊదగా భక్తులు దారిపొడవునా ఇరువైపులా ఎదురెళ్లి దండాలు పెట్టారు. ప్రత్యేక డోలు వాయిద్యాలు, శివసత్తుల పూనకాలు, హిజ్రాల శివాలతో కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయం పరవశించింది. పగిడిద్దరాజు, గోవిందరాజులు అప్పటికే జంపన్నవాగు వద్దకు చేరకోగా సారలమ్మతో కలిసి వాగునుండి గద్దె వద్దకు బయలు దేరారు. సారలమ్మను గద్దె వద్దకు తీసుకువచ్చే ముందు మేడారంలోని సమ్మక్క ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తదుపరి సారలమ్మను గద్దె వద్దకు చేర్చిన అనంతరం ఆదివాసీ గిరిజన సాంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహించిన తర్వాత పూజారులు ముగ్గురి రూపాలను గద్దెలపై ప్రతిష్ఠించారు.

రేపు మేడారం జాతరకు సిఎం రేవంత్ రెడ్డి
ఆసియాలో అతి పెద్ద గిరిజన కుంభమేళా మేడారం జాతరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 23న వెళ్ళనున్నారు. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మేడారం జాతర బుధవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ జాతర ఈ నెల 24 వరకు కొనసాగుతోంది. రెండేళ్ళకొకసారి జరిగే ఈ జాతరకు రాష్ట్రం నుంచే గాకుండా వివిధ రాష్టాల నుండి లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు. ఇప్పటికే మేడారం పరిసర ప్రాంతాలు జనసంద్రంగా మారాయి. ముఖ్యమంత్రి రాక సంధర్భంగా అధికారులు ఇప్పటికే కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. సామాన్య భక్తులతో పాటు విఐపీలు కూడా జాతరకు వస్తున్నందున అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News